డాక్టర్ బాలశౌరి రెడ్డి కన్నుమూత

డాక్టర్ బాలశౌరి రెడ్డి కన్నుమూత


చెన్నై :  రచనలే ఉఛ్వాస, నిశ్వాసలుగా జీవించిన కలం వీరుడు కన్నుమూశాడు. హిందీనే ఊపిరిగా భావించిన భాషాప్రేమికుడు తన అభిమానలోకాన్ని శోకసంద్రంలో ముంచి భౌతికంగా దూరమైనాడు. అశేష ప్రజానీకానికి తన తీపి జ్ఞాపకాలను, రచనా పరిమళాలను వదిలి తరలిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తెలుగువాడి  గౌరవాన్ని జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన ప్రముఖ రచయిత బాలశౌరిరెడ్డి (88) వృద్ధాప్యంతో చెన్నైలో మంగళవారం తనువుచాలించారు. బాలశౌరిరెడ్డి మరణంతో సాహితీలోకం చిన్నబోయింది.




తెలుగు వాడిగా పుట్టి జాతీయ భాష హిందీలో సాహిత్య రచనలు చేసి, కేంద్ర సాహిత్య పురస్కారాలను అందుకుని ప్రధాని సలహాదారులుగా కొనసాగి జీవిత ప్రస్థానాన్ని సంపూర్ణం చేసుకున్న డాక్టర్ బాలశౌరి రెడ్డి (88) ఇక లేరు. సీమ క్షేత్రం కడపలో కనులు తెరచిన బాలశౌరి రెడ్డి ఉత్తరాదిన రచనా వ్యాసాంగాన్ని చేపట్టి, తమిళనాట స్థిరపడి ఇక్కడి తెలుగు వారికి ఆత్మీయులుగా మారారు. నిగర్విగా, సహృదయులుగా, హిందీ భాషా ప్రేమికుడిగా ఆత్మీయులు మన్ననలు అందుకున్న శౌరిరెడ్డి కన్నుమూయడం పట్ల పలువురు తెలుగు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చెన్నపురిలో దశాబ్దాల బంధాన్ని ఏర్పరచుకున్న బాలశౌరి రెడ్డి గురించి కొన్ని విషయాలు.




హిందీ శిక్షణ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా...

కడప జిల్లా, పులివెందుల తాలూకా గొల్లల గూడూరులో ఎద్దుల ఓబులమ్మ, గంగిరెడ్డి దంపతులకు 1928 జూలై 1వ తేదీన జన్మించిన బాలశౌరిరెడ్డి కడప, నెల్లూరు, అలహాబాద్, బెనారస్‌లలో విద్యాభ్యాసం సాగించారు. హిందీ శిక్షణ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్‌గా పని చేశారు. హిందీ చందమామకు 23 సంవత్సరాలు సంపాదకత్వం వహించిన బాలశౌరిరెడ్డి, కోల్‌కత్తాలోని భారతీయ భాషా పరిషత్తుకు 1990-94 మధ్య డెరైక్టర్‌గా, ఆంధ్ర హిందీ అకాడమీ - హైదరాబాదుకు చైర్మన్‌గాను పనిచేశారు.


హిందీ సాహిత్య సమ్మేళన, ప్రయోగ, తమిళనాడు హిందీ అకాడమీకి అధ్యక్షులుగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వందకుపైగా అందుకున్నారు. సాహిత్యంపై ఎనలేని ప్రేమతో హిందీ, తెలుగు భాషల్లో బాలశౌరిరెడ్డి అనేక రచనలు రాయటమే కాకుండా హిందీలో నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి అనువాదాలు చేశారు.


హిందీలో 72 పుస్తకాలు, తెలుగు నుంచి హిందీలోకి 24 గ్రంథాలు అనువదించారు. శౌరిరెడ్డి రచనలపై దేశవ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 పీహెచ్‌డీలు, 11 ఎంఫిల్ డిగ్రీలు వచ్చాయి. బాలశౌరిరెడ్డి అనేక తెలుగు నవలను హిందీలోకి అనువదించారు. రుద్రమదేవి, నారాయణ భట్ (నోరి) రాజశేఖర చరిత్ర (వీరేశలింగం పంతులు), అల్పజీవి (రాచకొండ), కౌసల్యా (పోలాప్రగడ) కేమురి (రావూరి భరద్వాజ) తదితర నవలలను తెలుగు నుంచి హిందీలోకి అనువదించారు.


సాహితీ రంగంలో శౌరిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2006లో సాహిత్య పురస్కారాన్ని అందించింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి సన్మానంతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రముఖులు నుంచి సన్మానాలు పొందిన బాల శౌరిరెడ్డి సాహిత్య ప్రేమికుడిగా కొనసాగారు.




 భారత ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించే కేంద్రీయ హిందీ సమితికి సలహాదారుడుగా స్థానం పొందడం ఆయన మేధస్సుకు నిదర్శనం. 88 ఏళ్ల వయస్సులో వృద్ధాప్యం మీదపడుతున్నా ఆయనలో సాహిత్యాభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే భోపాల్‌కు వెళ్లి ఒక సదస్సులో పాల్గొని వచ్చారు. ఈనెలాఖరులో త్రివేండ్రలో జరిగే ఒక సెమినార్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సెమినార్ కోసం అనేక అంశాలపై విరామం లేకుండా ఎడతెరిపి శోధనలు సాగించారు.


చివరి వరకు చురుకైన జీవనం సాగించిన బాలశౌరిరెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. బాలశౌరిరెడ్డికి భార్య శుభద్రాదేవి, కుమారుడు వై.వెంకటరమణారెడ్డి, కుమార్తె భారతి ఉన్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశానవాటికలో జరగనున్నాయి.

 

పలువురు తెలుగు ప్రముఖుల సంతాపం

 

 హిందీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు

ప్రధాని సలహాదారులుగా పని చేసిన ప్రొఫెసర్ బాలశౌరిరెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. హిందీ భాష కోసం, సాహిత్యం కోసం, హిందీ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు నిజంగా హర్షించదగినవి. శౌరిరెడ్డి మరణం హిందీ సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యాన్ని అందించాలని సంతాపాన్ని తెలిపారు.

 - తమిళనాడు రాష్ట్ర గవర్నర్ - కొణిజేటి రోశయ్య

 

సాహితీ వినీలాకాశంలో ఆయనో ధ్రువతార

 రచనలు, అనువాదాలతో తెలుగువారి ఖ్యాతిని నిలిపిన బాలశౌరిరెడ్డి సాహితీ వినీలాకాశంలో ఓ ధ్రువతార. ఆయన లేని లోటు తీర్చలేనిది.

 - నరోత్తమరెడ్డి, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్

 

తెలుగు జాతి ముద్దుబిడ్డ

 జాతీయభాషకు ఎనలేని సేవలు అందించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాలశౌరి రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన హిందీకి చేసిన సేవ కొనియాడదగినదంటూ శౌరిరెడ్డి మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.    

 -యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (కేంద్రీయ హిందీ సమితి సభ్యులు, మాజీ ఎంపీ)

 

బాల శౌరిరెడ్డి సేవలు అజరామరం  

తెలుగు వాడై ఉంటూ జాతీయ భాష హిందీకి దశాబ్దాలు తరబడి సేవలందించటం నిజంగా గొప్ప విషయమని, బాలశౌరిరెడ్డి తెలుగు వారి కీర్తిని నిలిపారన్నారు. ఆయన మృతి సంఘటన తెలియడం తనను

 దిగ్భ్రాంతికి గురి చేసింది.

 - డాక్టర్ సునీల్ (ఉంగలుక్కాగ ట్రస్ట్ వ్యవస్థాపకులు)

 

 తెలుగు వారి గొప్పతనాన్ని చాటారు

ఎన్నో పురస్కారాలు అందుకున్న డాక్టర్ బాలశౌరి రెడ్డి నిగర్విగా, కల్మషం లేని మనిషిగా అందరికీ ఆత్మీయులుగా నిలిచారని, హిందీ భాషకు ఆయన లేని లోటు తీర్చలేనిది.

  -మాడభూషి సంపత్‌కుమార్ (మద్రాసు యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు)

 

 నిత్యకృషీవలుడు బాలశౌరి రెడ్డి

 దశాబ్దాల పాటు హిందీ సాహిత్యానికి కృషి చేస్తూ , చేస్తున్న నిత్యకృషీవలుడు డాక్టర్ బాలశౌరిరెడ్డి. ఆయన రచనలు ఆబాలగోపాలాన్ని అలరించాయని, అలాంటి మంచి మనిషి మన నుంచి దూరం కావటం బాధాకరం.

 -డాక్టర్ ఏవీ శివకుమారి ( హిందీ ఉపాధ్యాయురాలు)




 

Read also in:
Back to Top