ఉరేసుకున్న ఫొటో

ఉరేసుకున్న ఫొటో - Sakshi


సూసైడ్ విన్నాం! సెల్ఫీ విన్నాం! మరి... సెల్ఫీసైడ్? సెల్ఫీల మోజుతో జాగ్రత్తపడకపోతే, అది సెల్ఫీసైడే! అంటే ఫోటోతో ఉరేసుకోవడమే అమ్మాయిలు అమాయకంగా ప్రేమలో పడి... లేకపోతే స్నేహం అనుకొని... అదీ కాకపోతే పరిచయం అనుకొని... ఫోటోలు, సెల్ఫీలు దిగి... పంచుకొంటే, వాటిని బ్లాక్‌మెయిలింగ్ కోసం వాడుతున్న‘బ్లాక్‌షీప్స్’ ఎన్నో! అమ్మాయిలూ! జాగ్రత్త! సెల్ఫీలు క్యారెక్టర్‌ని చంపేస్తున్నాయి! డోన్ట్ కమిట్ ‘సెల్ఫీసైడ్’!

 

ఒకప్పుడు ఆటోగ్రాఫ్... ఆ తరువాత ఫోటోగ్రాఫ్... మరి ఇప్పుడు? స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ!

 

గౌరవప్రదంగా చెప్పాలంటే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఇవాళ ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్. లోతుగా ఆలోచించి చూస్తే - ప్రతి ఒక్కరూ ఇరుక్కుపోతున్న, తప్పించుకోలేకపోతున్న తీవ్రమైన వ్యసనం. తీసుకున్న సెల్ఫీని మరుక్షణమే సోషల్ మీడియాలో పెట్టుకోవాలని జనం తాపత్రయపడుతున్నారు. ఈ సెల్ఫీల వ్యవహారంతో మిగిలిన ఇబ్బందుల మాట ఎలా ఉన్నా, అమ్మాయిలు మాత్రం అమాయకంగా బలి అవుతున్నారు. కొందరు సైబర్ నేరగాళ్ళ చేతిలో ఆయుధంగా మారిన సెల్ఫీలకు బలవుతున్నారు.  

 

స్నేహం, ప్రేమ, పెళ్ళి పేరుతో కొందరు ప్రబుద్ధులు - అమ్మాయిల్ని నమ్మించి, వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. తీరా ఎక్కడో బెడిసికొట్టాక, ఆ ఫోటోలను నెట్‌లో పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ళ సంఖ్య ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలే అందుకు ఉదాహరణ.

 

సెల్ఫ్ గోల్!

హైదరాబాద్‌లోని సఫిల్‌గూడాకు చెందిన 32 ఏళ్ళ నిజాముద్దీన్ హైదర్ ఇలాంటి సైబర్ నేరానికే పాల్పడ్డాడు. అయిదేళ్ళ క్రితం ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ఎం.బి.ఏ. చదివిన ఆ అమ్మాయితో స్నేహం చేశాడు. అనాథనంటూ సినిమా కష్టాలన్నీ చెప్పుకొని సానుభూతి చూరగొన్నాడు. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ పరిచయం కాస్తా స్నేహం పరిధి దాటి, చాలా ముందుకు వెళ్ళింది. త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని ఆ అమ్మాయికి మనోడు మాయ మాటలు చెప్పాడు.



అలా రెండేళ్ళు గడిచిపోయాయి. ఆ సమయంలో ఆ అమాయకురాలు ఈ మేకవన్నె పులితో సన్నిహితంగా మెలుగుతూ, అతని ఫోన్‌లో చాలా సెల్ఫీలు దిగింది. తీరా నిజాముద్దీన్‌కు అప్పటికే పెళ్ళి అయిపోయిందని ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. దాంతో, అతగాడిని దూరం పెట్టింది. కానీ, కలసి తీసుకున్న సెల్ఫీలను అడ్డం పెట్టుకొని, ఆమెను నిజాముద్దీన్ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించసాగాడు. చివరకు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సైబర్ నేరగాడు నిజాముద్దీన్‌ను ఈ ఏప్రిల్ ఆఖరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

 

సైబర్ నేరాల్లో మరో వికృత కోణం - సోషల్ మీడియాలో తప్పుడు ఐడెంటిటీతో చేస్తున్న మోసపూరిత స్నేహాలు. హైదరాబాద్‌లోని భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మజీద్ చేసింది అదే. 21 ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ఫేస్‌బుక్ ద్వారా ఏకంగా కొన్ని వందల మంది అమ్మాయిలతో స్నేహం చేశాడు. తాను కూడా అమ్మాయినే అని ఫేక్ ఐడెంటిటీతో నమ్మించాడు. తోటి కాలేజ్ స్టూడెంట్ అనుకున్న అమ్మాయిలందరూ అతని వలలో పడ్డారు. ఎంతగా మోసపోయారంటే, చివరకు తమ తల్లితండ్రులతో చెప్పని విషయాలు కూడా ‘ఆమెనని మోసం చేసిన అతని’తో పంచుకున్నారు. మద్యపానం, పొగతాగడం దగ్గర నుంచి చివరకు తమ బాయ్‌ఫ్రెండ్స్, లైంగిక ప్రాధాన్యాల దాకా అన్నీ చెప్పుకొన్నారు.

 

అలా వాళ్ళ దగ్గర చనువు సంపాదించిన మజీద్ వాళ్ళ నుంచి అర్ధనగ్న సెల్ఫీలు కూడా తెప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ సెల్ఫీల బూచి చూపెట్టి, భయపెట్టసాగాడు. ఆన్‌లైన్‌లో పెట్టేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ వ్యవహారం చివరకు సైబర్ పోలీసులకు చేరింది. కొన్ని వందల మంది టీనేజ్ అమ్మాయిల అర్ధనగ్న సెల్ఫీలు, ఫోటోలను ఈ ప్రబుద్ధుడు సేకరించినట్లు తేలింది. గతంలో ఏడు నెలల కాలంలో రెండుసార్లు అరెస్టయిన మజీద్‌పై తాజాగా పీడీ చట్టం కింద చర్య చేపట్టారు.

 

ప్రేమికుడే బ్లాక్‌మెయిలర్!

ఇవాళ సమాజంలో అమ్మాయిలపై పెరుగుతున్న సైబర్ వేధింపులకు ఈ తాజా సంఘటనలు మచ్చుకు ఒకటి రెండు మాత్రమే! అసభ్యంగా కానీ, బెదిరింపు ధోరణిలో కానీ ఆడవారికి మెయిల్స్, మెసేజ్‌లు పెట్టడం సైబర్ నేరాల విభాగంలోనే, మహిళలపై సాగుతున్న దౌర్జన్యాల కిందకు వస్తాయి. అలాగే, ప్రైవేట్, అశ్లీల సమాచారాన్ని, ఫోటోలను ఆన్‌లైన్‌లో కానీ, అశ్లీల సైబర్ ప్రపంచంలో కానీ పోస్ట్ చేయడం, సర్క్యులేట్ చేయడం కూడా! స్త్రీల విషయంలో ఈ రెండు రకాల నేరాలు ఇటీవల పెరుగుతున్నాయి.



నిజం చెప్పాలంటే - సన్నిహితంగా ఉంటూ తీసుకున్న సెల్ఫీలు, వీడియోలు, వీడియో ఛాట్‌లు ఇప్పుడు స్త్రీల బ్లాక్‌మెయిలింగ్‌కు ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. నూటికి దాదాపు 30 కేసుల్లో - ఇలా మాజీ లవర్స్, మోసగాళ్ళు ఒకప్పటి ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

 విచిత్రం ఏమిటంటే, ఫిర్యాదులైతే చేస్తున్నారు కానీ, బాధితుల్లో నూటికి 90 మంది ఈ విషయాన్ని ఎఫ్.ఐ.ఆర్. దాకా తీసుకువెళ్ళడం లేదు.



విషయం వీధికెక్కకుండా, ఆ మోసగాళ్ళ చేతి నుంచి ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. అవి ఏవీ ఆన్‌లైన్‌లోకి రాకుండా ఉండేలా చూడాలని మాత్రమే తాపత్రయపడుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆ మధ్య జరిపిన సర్వేలలో కూడా సెల్ఫీలకూ, మనుషుల మధ్య అనుబంధాల్లో ఉన్న సమస్యలకూ అవినాభావ సంబంధం ఉందని తేల్చాయి.



అదే పనిగా సెల్ఫీలు తీసుకోవడం, వాటిని పోస్ట్ చేయడం వల్ల అనుబంధాలు దెబ్బతింటాయని ‘సైబర్ సైకాలజీ, బిహేవియర్ అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ జర్నల్’ సైతం పేర్కొంది.  మొత్తం మీద సెల్ఫీలతో ఉపయోగాల మాటెలా ఉన్నా, సమస్యలు చాలానే బయటపడుతున్నాయి. అమ్మాయిలూ! తస్మాత్ జాగ్రత్త! డోన్ట్ కమిట్ సెల్ఫీసైడ్!

- రెంటాల జయదేవ

 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ!  నూటికి 90 నమోదు కావట్లేదు!

‘సైబర్ నేరాలు’ జరిగినప్పుడు 2000 నాటి ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం’ కింద, భారతీయ శిక్షాస్మృతి (ఐ.పి.సి) కింద ఎక్కువ భాగం అరెస్టులు జరుగుతున్నాయి. పెరిగిపోతున్న పట్టణీకరణ, ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ప్రధానంగా నగరాల్లో, పట్టణాల్లో సైబర్ క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటోంది. అయితే, నేరాల సంఖ్య వేలు, లక్షల్లో ఉన్నా, కేసుల నమోదవడం మాత్రం తక్కువే. మోసాలు, లైంగిక వేధింపులు, అప్రతిష్ఠ పాలు చేయడం లాంటి వ్యవహారాల్లో నూటికి 90 నేరాల్లో జనం వీధికెక్కడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దాంతో, కేసులు నమోదు కావడం లేదు.

 

‘జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) సమాచారం మేరకు - కేవలం నమోదైన కేసుల లెక్కే చూసినా- 2010 నుంచి 2013 మధ్య కేవలం మూడేళ్ళ కాలంలో సైబర్ నేరాలు 350 శాతం పెరిగాయి. 2010లో కేవలం 966 సైబర్ నేరాల కేసులు నమోదైతే, 2013 కల్లా ఆ కేసుల సంఖ్య ఏకంగా 4,356కు చేరింది. భారతదేశం మొత్తం మీద గమనిస్తే - ఐ.టి, ఐ.టి సంబంధ పరిశ్రమలకు సంబంధించి 70 శాతానికి పైగా ఆదాయం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తుంది. అందుకు తగ్గట్లే, ఈ రాష్ట్రాల్లోనే ఐ.టి. చట్టం కింద అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయి.

 

నెట్ సౌకర్యంతో పాటే... నేరాలూ...

ప్రస్తుతం సగటు సైబర్ క్రైమ్ రేటు ప్రపంచవ్యాప్తంగా 32 శాతం కాగా, భారతదేశంలో 16 శాతమే. అయితే, ప్రపంచ ఇంటర్నెట్ విపణిలో మన భారతీయ మార్కెట్ ఏటా 37 శాతం మేర పెరుగుతోంది. వచ్చే 2017 నాటికల్లా మన దేశంలో 50 కోట్ల మంది దాకా ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని అంచనా. ఆ దెబ్బతో మనం అమెరికాను మించిపోయి, ప్రపంచంలో చైనా తరువాత నెట్ వినియోగదారుల సంఖ్యలో రెండో అతి పెద్ద దేశంగా అవతరిస్తామన్న మాట! ఆ లెక్కన సైబర్ నేరాల రేటు కూడా బాగా పెరగనుంది. ఈ నేరాల్లో భాగమైన లైంగిక వేధింపుల లాంటివి పక్కనపెట్టి, కేవలం ఆర్థిక నేరాల విషయం చూసినా, మనదేశంలోని ప్రతి నాలుగు సంస్థల్లో ఒకటి ఈ సైబర్ ఆర్థిక నేరాల బారిన పడుతోంది.

 

సైబర్ భూతం బారినపడకుండా ఉండాలంటే...

మీ వ్యక్తిగత సమాచారాన్ని ‘సోషల్ మీడియా ఛాట్’లలో వెల్లడించకండి.

ప్రెమ మోజులో అవతలి వ్యక్తుల్ని అతిగా నమ్మి, వాళ్ళతో చనువుగా ఉంటూ, సెల్ఫీలు దిగడం ఎప్పటికైనా ఇబ్బందే!

పిల్లలు కానీ, యువతీ యువకులు కానీ తల్లితండ్రులకు తెలియకుండా తమ ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకపోవడమే బెటర్.

ఈ డిజిటల్ యుగంలో ఏ ఫోటో, ఏ వీడియో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి, మహిళలు తమ సన్నిహితులైనవారితో సహా ఎవరినీ తమ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను రికార్డు చేయనివ్వకూడదు.

అపరిచితులు ఎవరితోనూ ‘సన్నిహితంగా’ ఛాటింగ్ చేయకండి. ప్రైవేట్ ఫోటోలను ఎవరితోనూ షేర్ చేయకండి.

అపరిచితులతో మామూలు ఫోటోలు కూడా పంచుకోవద్దు. వారు దాన్ని ‘మార్ఫింగ్’ చేసి, బ్లాక్‌మెయిలింగ్ చేసే ముప్పు ఎక్కువ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top