బాలయ్యా.. ఇదేం గోలయ్యా..!
సార్వత్రిక ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీచేయాలన్నది తేల్చకపోవడంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ఓ కొలిక్కి తేలేకపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీచేయాలన్నది తేల్చకపోవడంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ఓ కొలిక్కి తేలేకపోతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీచేస్తారన్నది ఆ పార్టీ టికెట్ ఆశిస్తోన్న నేతలను ఉత్కంఠకు గురిచేస్తోంది. హిందూపురం శాసనసభ స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తే అభ్యర్థుల ఎంపిక ఓ రకంగానూ.. పోటీ చేయకపోతే మరో రకంగానూ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇది పార్టీ టికెట్ ఆశిస్తోన్న నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి తరఫున సినీనటుడు బాలకృష్ణ ఊరూవాడ ప్రచారం చేశారు. సినీ గ్లామర్‌తో అటు జనాన్ని రప్పించలేక.. మెప్పించలేక చతికిలపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనం ముందు మహాకూటమి చిత్తయింది. మహాకూటమి పరాజయంతో బావ చంద్రబాబు కళ్లల్లో బాలకృష్ణ ఆనందం చూడలేకపోయారు. తన తండ్రి ఎన్‌టీ రామారావు పోటీ చేసిన హిందూపురం శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని ఇటీవల పలు సందర్భాల్లో బాలకృష్ణ తన సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు.
తాను గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే.. సీఎం పీఠంపై తాను కూర్చోవాలని అభిమానాలు ఆరాటపడుతున్నారని మనసులోని మాటను కూడా ఇటీవల ఆయన బయటపెట్టారు. ఇది చంద్రబాబును ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నేతల ద్వారా ఎన్‌టీ రామారావు సొంతూరు నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజకవర్గం నుంచి గానీ.. గన్నవరం నుంచీ గానీ బరిలోకి దిగాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచిస్తూ వచ్చారు. కానీ.. చంద్రబాబు సూచనను బాలకృష్ణ పరిగణనలోకి తీసుకోలేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. పోటీ చేసే స్థానంపై బాలకృష్ణ ఎటూ తేల్చకపోవడం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఆ పార్టీ టికెట్ ఆశిస్తోన్న నేతలను కూడా ఇరకాటంలోకి నెట్టింది.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ హిందూపురం నుంచి అత్తెసరు మెజార్టీతో ఎన్నికయ్యారు. కానీ.. అబ్దుల్‌ఘనీకి టికెట్ ఇవ్వననే సంకేతాలను పంపడం ద్వారా మైనార్టీలను చంద్రబాబు యథాప్రకారం చిన్నచూపు చూశారు. చంద్రబాబు ఇచ్చిన సంకేతాలతో హిందూపురం స్థానంపై మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులు, ఎంపీ నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మినారాయణ ఆశలు పెట్టుకున్నారు. నిమ్మల కిష్టప్పకు హిందూపురం టికెట్ దక్కితే.. బీకే పార్థసారధిని హిందూపురం ఎంపీగా పంపి.. పెనుకొండ నుంచి తాను పోటీ చేయాలని పరిటాల సునీత ఎత్తులు వేస్తున్నారు.
తన అభిమానులు తనను సీఎంగా చూడాలని ఆశిస్తున్నారని బాలకృష్ణ ప్రకటించిన నేపథ్యంలో ఆందోళన చెందిన చంద్రబాబు.. ఆయనను హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. హిందూపురం లోక్‌సభ పరిధిలో వైఎస్సార్‌సీపీ బలీయమైన శక్తిగా అవతరించిన నేపథ్యంలో అక్కడి నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి అంగీకరించరనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. లోక్‌సభకు కాకుండా హిందూపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తాననే ప్రతిపాదనను బాలకృష్ణ తెరపైకి తెచ్చే అవకాశమే ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను రాయలసీమలో కుప్పం నుంచి పోటీ చేస్తోన్న నేపథ్యంలో.. కోస్తాంధ్ర నుంచి పోటీ చేస్తే బాగుంటుందని బాలకృష్ణను చంద్రబాబు పురమాయించడానికి సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా గన్నవరం.. గుడివాడల్లో ఏదో ఒక చోట పోటీ చేయించాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆ రెండు స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం దిశగా దూసుకుపోతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి బాలకృష్ణను పోటీ చేయాలని చంద్రబాబు పురమాయిస్తుండటంలో మర్మమేమిటన్నది విశదమవుతోంది. తనకు అడ్డు తొలగించుకోవడం కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోండటం.. ఆ ఎత్తులను బాలకృష్ణ చిత్తు చేస్తోండటంతో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాకుండా పోతోందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.


