జలదీక్షకు జనప్రవాహం

జలదీక్షకు జనప్రవాహం - Sakshi


♦ కర్నూలులో మూడో రోజుకు చేరిన జగన్ నిరాహార దీక్ష     

♦ జలదీక్షకు మద్దతు ప్రకటించిన వివిధ ప్రజా సంఘాలు

 

 కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ  నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ... కేంద్ర ప్రభుత్వ దృష్టికి జల అన్యాయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న నిరాహారదీక్షకు రెండో రోజు జనం పోటెత్తారు. కర్నూ లు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, జనం జాతరలాగా తరలివచ్చారు.



మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే జగన్ దీక్షా వేదిక వద్ద తన కోసం వచ్చిన జనాన్ని కలుసుకోవడం ప్రారంభించారు.  ఎండలు మండిపోతున్నా దూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అన్ని వైపుల నుంచీ జనం ఒక్కసారిగా దీక్షా ప్రాంగణంలోకి వచ్చి పడటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అదుపు చేయలేక పోయారు. జనం రద్దీని గమనించిన జగన్ కూడా విరామం లేకుండా వారిని రాత్రి ఎనిమిది గంటల వరకూ కలుస్తూనే ఉన్నారు.ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చి జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతు ప్రకటించారు.



 బాబు తీరుపై జనాగ్రహం..

 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న జల అన్యాయంపై జగన్ నిరాహారదీక్ష చేస్తూ ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు దీక్షకు వచ్చిన జనానికి ఆగ్రహం కలిగించాయి. ఓటుకు కోట్లు కేసు ఉచ్చు తనకు బిగుస్తుందేమోనన్న భయంతోనే చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో చర్చల సందర్భంగా ప్రత్యేక హోదాపై గట్టిగా అడగలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమైంది.

 





 దీక్షలు, ధర్నాలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు

 తెలంగాణ రాష్ర్ట్టం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న నిరాహారదీక్షకు వెల్లువలా మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు, ధర్నాలతో మంగళవారం రాష్ర్టవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలకడం విశేషం.



Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top