
రాజధాని పక్కనే ‘జయభేరి’
ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ఆ రాష్ట్ర అధికార పార్టీ పెద్దల రియల్ వ్యాపారానికి రంగం సిద్ధమైంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు
♦ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికార పార్టీ పెద్దల రియల్ వ్యాపారం
♦ ఆకాశ హర్మ్యాల నిర్మాణంతో కోట్లకు పడగలెత్తేందుకు సమాయత్తం
♦ కుంచనపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ‘జయభేరి’ సన్నాహాలు
♦ ఇప్పటికే పలు అనుమతులు
సాక్షి, విజయవాడ బ్యూరో : ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ఆ రాష్ట్ర అధికార పార్టీ పెద్దల రియల్ వ్యాపారానికి రంగం సిద్ధమైంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు నిర్మించడం ద్వారా కోట్లకు పడగలెత్తేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం కూడా వెంటవెంటనే అన్నిరకాల అనుమతులూ మంజూరు చేస్తోంది. రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కుంచనపల్లిలో సుమారు 7 ఎకరాల (2.775 హెక్టార్లు) విస్తీర్ణంలో నిర్మించనున్న భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు ప్రభుత్వ పరంగా గ్రీన్‌సిగ్నల్ లభించడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. భూములిచ్చిన రాజధాని రైతులను ఆలోచనల్లో పడేసింది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది.
సుమారు నెల రోజుల తర్వాత నూతన రాజధాని ఎక్కడన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి నుంచీ చంద్రబాబునాయుడు విజయవాడ ప్రాం తమే రాజధానిగా చెబుతున్న క్రమంలో ఇక్కడికి సమీపంలోని భూములపై అధికార పార్టీ పెద్దల కన్ను పడింది. కొద్దిరోజులకు విజయవాడ చుట్టూ ఉన్న ప్రాంతం రాజధానికి అనుకూలం కాదన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. దీంతో విజయవాడ, గుంటూరు మధ్యనున్న విలువైన భూముల ధరలు కాస్తంత దిగజారాయి. సరిగ్గా అప్పుడు అధికార పార్టీ పెద్దలు కొందరు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
రాజధాని ప్రాంతం ఎక్కడో, ఆ ప్రాంతం సరిహద్దులేమిటో, చుట్టూ ఉన్న భూముల ధరలెలా ఉన్నాయోనన్న విషయాన్ని రాజధాని ఎంపిక సమయంలోనే గుర్తించిన నేతలు గుట్టు చప్పుడు కాకుండా ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేశారు. ఇదే క్రమంలో తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని 80/4, 81/3, 81/4 తదితర ఆర్‌ఎస్ నంబర్లలోని సుమారు ఏడు ఎకరాల భూములను జయభేరీ సంస్థ కొనుగోలు చేసింది. సదరు భూమిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మిం చేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ఈ ఏడాది జూలై 21న చైర్మన్ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశమైన స్టేట్ ఎక్స్‌పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఎస్‌ఈఏసీ) జయభేరీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిం ది. ఆ తర్వాత గత ఆగస్టు 4న సమావేశమైన స్టేట్ లెవల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) కూడా ఈ భారీ రియల్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిం ది. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు ప్రస్తుతం రాజధాని రైతుల్లో చర్చనీయాంశంగా మారింది.
ముందునుంచే వ్యాపార కోణం..
నూతన రాజధాని అమరావతికి కుంచనపల్లి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. జయభేరీ సంస్థ కొనుగోలు చేసిన భూముల పక్కనే జాతీయ రహదారి కూడా ఉంది. సింగపూర్ ప్రభుత్వం అందజేసిన రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం.. తాడేపల్లి నుంచి సీతానగరం మీదుగా అమరావతి వరకు రోడ్డు వే స్తే కుంచనపల్లి రాజధానికి మరింత దగ్గరవుతుంది. భవిష్యత్తులో అన్ని విధాలా డిమాండ్ బాగా ఉంటుంది. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించిన ఎంపీ మురళీమోహన్ తనకున్న రాజకీయ పలుకుబడితో అన్ని విషయాలూ ముందే తెలుసుకున్న తర్వాత కుంచనపల్లిలో భూములు కొన్నారని స్పష్టమవుతోంది.