కేంద్రంలో ఇంకా ఉన్నారేం: జగన్

కేంద్రంలో ఇంకా ఉన్నారేం: జగన్ - Sakshi


హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు మంత్రులుగా కొనసాగుతున్నారో చెప్పాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ నేతలను నిలదీశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు తనపై చేసిన విమర్శలపై జగన్ ఘాటుగా స్పందించారు. తనపై కేసులు ఉన్నందున కేంద్రం ఏమైనా చేస్తుందేమోననే భయంతో ప్రతిపక్షనేత ఈ విషయంలో నోరుమెదపడం లేదంటూ టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ వ్యాఖ్యానించడంపై జగన్ మండిపడ్డారు.



‘మొత్తం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు నేను చాలెంజ్ విసురుతున్నా. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తే టీడీపీవారు కేంద్రంలో మంత్రులుగా ఎందుకు కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పండి. బడ్జెట్‌పై మొదట మీడియా వద్దకు వచ్చి మా పార్టీ నేత సోమయాజులే మాట్లాడారు. ఆయన మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు’ అని గుర్తుచేశారు.


రైతుల భూమితో ‘రియల్’ వ్యాపారమా?



రాజధానికి భూమి విషయంలో ప్రతిపక్షనేత సభలో ఒకలా, బయట మరోలా మాట్లాడుతున్నారని కూన రవికుమార్ వ్యాఖ్యానించడాన్ని జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు. ‘నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెప్పడంపై చంద్రబాబు ట్యూషన్లు బాగా ఇచ్చారు. ప్రభుత్వ భూమి, డీగ్రేడెడ్ అటవీ భూమి తీసుకుని సింగపూర్ కాకుంటే జపాన్ కట్టుకోండి. ఎవరికీ అభ్యంతరం లేదు. ఏటా 3-4 పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం ఎలా సబబు. మంగళగిరిలో 3-4 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిని తీసుకుని మీకు నచ్చిన విధంగా కట్టుకొని అభివృద్ధి చేయండి. రైతుల భూమిని వదిలేయండి. బలవంతంగా రైతుల భూమి లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేయడం ఏమిటి?’ అంటూ అధికార పక్షాన్ని నిలదీశారు.


పచ్చచొక్కాలకే వైద్య కళాశాలలా?



విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల స్థాపనపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఆర్.సుజయకృష్ణ రంగారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్న అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్డ్డ్రి మధ్య మాటల యుద్ధం నడిచింది. విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటుకు మానస ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దరఖాస్తు చేసుకుందని, ప్రస్తుతం అది పరిశీలనలో ఉందని మంత్రి కామినేని చెప్పారు. దీనిపై రంగారావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే అక్కడ ఓ ప్రైవేటు కళాశాల ఉందని, మరొకటి అవసరం లేదని, పెడితే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య కళాశాల పెట్టాలంటే రూ. 350 కోట్లు ఖర్చవుతుందని, ఏటా మరో రూ. 30 కోట్లు కావాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసినా 50 శాతం సీట్లను పబ్లిక్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.



మానస ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి ఆనంద గజపతి రాజని, మంచి పేరుందని, రూ. 400 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని ఇందుకు కేటాయిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై జగన్ జోక్యం చేసుకుంటూ ‘వాళ్ల పార్టీకి చెందిన అశోక గజపతిరాజుకు (ఆనంద గజపతిరాజు సోదరుడు) అనుమతి ఇస్తూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కళాశాలలకు అనుమతి ఇచ్చి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వమేమో ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటోంది. తాను చేస్తున్న పనిని గొప్పగా చెప్పుకోవడానికి అశోక్ గజపతిరాజు చాలా మంచోడని కితాబు ఇచ్చుకుంటోంది.



ఆ రాజు ఎంత మంచోడో మా బొబ్బిలి రాజు (సుజయకృష్ణ రంగారావు) అంతే మంచోడని మా పార్టీ వాళ్లు కితాబిస్తున్నారు. ఆయనకూ ఇవ్వాలి’ అన్నారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ మాజీ సీఎం జనార్దనరెడ్డికి, చంద్రబాబుకు సంబంధం లేదని... నిబంధనల ప్రకారం ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరిశీలించి అర్హతలుంటే ఇస్తామని, రంగారావు కూడా అదే మాదిరి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top