సర్వమంగళం | party leaders Fierce opposition botsa satyanarayana | Sakshi
Sakshi News home page

సర్వమంగళం

Mar 12 2014 2:37 AM | Updated on Sep 2 2017 4:35 AM

సర్వమంగళం

సర్వమంగళం

ఉన్నది పోయిం ది. దాచుకున్నదీ పోయింది..మొత్తానికి తిరుక్షవరం అయింది. అన్న చందాన తయారైంది మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉన్నది పోయిం ది. దాచుకున్నదీ పోయింది..మొత్తానికి తిరుక్షవరం అయింది. అన్న చందాన తయారైంది మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి. తన రాజకీయంతో జిల్లాను పదేళ్ల పాటు శాసించిన బొత్స సత్యనారాయణకు రాజకీయ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి . సార్వత్రిక ఎన్నికలు జరగకముందే  ఆయ నకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అటు ప్రజల పరంగా, ఇటు పార్టీ అధిష్ఠానం పరంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న రాజ్యసభ ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్రపతి పాలనతో మంత్రి పదవి ముందే పోయింది.  ఆయన జిల్లాలో రాజకీయ చక్రం తిప్పేందుకు వేదికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వవడంతో పట్టు చేజారిపోయినట్టు అయ్యింది. చివరికి చేతిలో ఉన్న పీసీపీ అధ్యక్ష పదవి హుష్ కాకి అయ్యింది. జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే బొత్స రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్టు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో అనిపిస్తోంది. 
 
  పదేళ్లుగా   ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్ర విభజన, మద్యం సిండికేట్, భూకబ్జాల ఆరోపణల ప్రభావంతో వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. చీపురుపల్లిలో మళ్లీ పోటీ చేస్తే గెలుస్తారో లేదోనన్న సందేహాలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని మిగతా నియోజకవర్గాలపై ఆయన దృష్టి సారించారు. ఎక్కడా  ఆయనకు సానుకూల పరిస్థితులు కన్పించకపోవడంతో రాజ్యసభపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల బరిలో నిలవకుండా ఉండాలంటే పెద్దల సభ సరైనదని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అధిష్ఠానం కరుణించలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న బొత్స సత్యనారాయణకు రాజకీయంగా కలిసివచ్చిన  జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కూడా వెక్కిరించింది.  
 
ఒక్కసారి జెడ్పీ పోతే  పని అయిపోయినట్టేనని, ఆయన రాజకీయ ఆధిపత్యానికి గండి పడినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషించుకుంటున్న సందర్భా లు ఉన్నాయి.  ఆయనపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నారో, ఎన్నికలకు పనికి రారనుకున్నారో గానీ అకస్మాత్తుగా పీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం తీసేసి మాజీ మంత్రి రఘువీరారెడ్డికి అప్పగించింది. కీలక పదవి తీసేసి మరో పదవి ఇచ్చి సంతృప్తి పరిచిందా అంటే అదీ లేదు. సీమాంధ్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రఘువీరారెడ్డి, క్యాంపైన్ కమిటీ చైర్మన్‌గా చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఆనం రామనారాయణరెడ్డి, వివిధ కమిటీల కో చైర్మన్‌లుగా పనబాక లక్ష్మి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లను నియమించింది. చివరకు అధిష్టానం బొత్సకు ఎలాంటి ప్రాధాన్యత కలిగిన పోస్టునూ అప్పగించలేదు. నలుగురితో నారాయణ మాదిరిగా ఎన్నికల కమిటీలోని 20మంది సభ్యుల్లో ఒకరుగా నియమించి అధిష్ఠానం తన ఉద్దేశ్యాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో  ఆయన ఫ్యామిలీ ప్యాక్ రాజకీయం ఏమవుతుందోనన్న చర్చ మొదలయ్యింది. ఆయననే నమ్ముకున్న కేడర్ డీలా పడిపోయింది. ఇంకా వేచి ఉండడం మంచిది కాదన్న ఆలోచనకొచ్చేశారు. దీంతో ఎవరి దారి వారు చూసుకునే యోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement