కర్నూలుపై చర్చ, ఓటింగ్ జరిగాయి: శ్రీకాంత్‌రెడ్డి

కర్నూలుపై చర్చ, ఓటింగ్ జరిగాయి: శ్రీకాంత్‌రెడ్డి - Sakshi


* రుజువులు చూపించిన విపక్ష సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి

* అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారు

* రాజధానిపై ఆయన చేసిన ప్రకటన మాటల గారడీ

* శంకుస్థాపనలు మినహా నిధులిచ్చిన చరిత్ర బాబుకు లేదు

* గోల్కొండ కోట, చార్మినార్ కూడా తానే నిర్మించానంటారు


 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా అసెంబ్లీలో కర్నూలుపై చర్చ జరగలేదని సీఎం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ సభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అప్పట్లో రాజధాని విషయంలో కేవలం చర్చ జరగడమే కాకుండా ఓటింగ్ కూడా జరిగిందని  రుజువులను చూపించారు. తీర్మానానికి అనుకూలం, వ్యతిరేకంగా వచ్చిన ఓట్లతో పాటు తటస్థుల వివరాలూ ఉన్నాయన్నారు.

 

 అంతకుముందు రాజధాని ఏర్పాటుపై చందబాబు మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులు చెబుతున్నట్లుగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎంపికకు ముందు శాసనసభలో చర్చ జరగలేదని,  ప్రకాశంపంతులు నివాసంలో కొంతమందినేతలు మాట్లాడుకున్నా ఏకాభిప్రాయం రాలేదన్నారు. చివరకు... ప్రకాశం పంతులే కర్నూలును ఎంపిక చేశారని తెలిపారు. దీనిపై గురువారం జరిగిన చర్చలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు మాటలు అబద్ధమని కొన్ని సాక్ష్యాలతో నిరూపించారు.

 

 చార్మినార్ కూడా బాబే నిర్మించారంటారు

 ఎవరు అభివృద్ధి చేసినా తన ముద్ర కొట్టి సొంతం చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఒక పేపర్ పట్టుకొని చదివేస్తే.. అన్నీ వచ్చేసినట్లేనా? మాటలకే పరిమితమైన చంద్రబాబు గత చరిత్ర చూస్తే.. ఇదంతా అరచేతిలో స్వర్గమని అర్థమవుతుంది.’’ అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులిచ్చి పనులు ముగింపు దశకు తీసుకొచ్చిన వాటినీ బాబు సొంత ప్రాజెక్టులుగా చెప్పుకుంటున్నారు.   హైదరాబాద్‌లో అసెంబ్లీ భవనం, గోల్కొండ కోట, చార్మినార్ కూడా ఆయనే కట్టించి ఉంటారు’’ అని ఎద్దేవా చేశారు.

 

 రాజధానిపై చర్చకు ఇదిగో సాక్ష్యం

1953 జూన్‌లో ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయించడానికి నాటి మద్రాసు అసెంబ్లీలోని ఆంధ్ర సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించారు. వారు అధ్యక్షుడిగా టంగుటూరి ప్రకాశంగారిని ఎన్నుకోవటంతో ఆయన అధ్యక్షతన మొత్తం 141 మంది ఎమ్మెల్యేలకు గాను 133 మంది సమావేశమై  ఐదురోజుల పాటు చర్చించారు. ప్రతిపక్షమే కాక... ప్రతీ పక్షమూ తన అభిప్రాయాన్ని తెలియజేసిన ఈ చర్చలో పలువురు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్ జరిగింది. కొన్ని  వీగిపోయాయి. చివరకు రాజధాని ఎక్కడనే దానిపై ఓటింగ్ జరగ్గా విజయవాడకు వ్యతిరేకంగా 79 , అనుకూలంగా 53 మంది ఓటువేశారు. సభాధ్యక్షుడుఓటింగ్‌లో పాల్గొనలేదు. సుదీర్ఘ చర్చ తరవాతే రాజధానిని ఎంపిక చేశారన్న దానికి సాక్ష్యంగా నాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ కాపీలివి...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top