సీఎం, డీజీపీలపై కేసులు పెట్టాలి: ఎర్రబెల్లి
సీమాంధ్రలో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం వెనక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి హస్తం ఉన్నదని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.
సీమాంధ్రలో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం వెనక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి హస్తం ఉన్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విగ్రహాల కూల్చివేతలో సీఎం, డీజీపీ హస్తం ఉందని వారిపై కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేది వీళ్లేనన్నారు. మంత్రులు, సీఎం డ్రామా కంపెనీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎంగా వైఎస్‌ఆర్ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకుంటే... రోశయ్య సీఎం అయిన తరువాత అణిచివేత కొనసాగిందని తెలిపారు. మొదటగా కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే రోశయ్య సీఎంగా అడ్డుపడ్డారని, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.
నాడు జై తెలంగాణ అన్న సోనియాగాంధీ.. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఆంశం పెట్టి ఇప్పుడు రాష్ట్రం ఇస్తుంటే సీఎం అజ్ఞానిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు ప్రాంతాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేదా కేంద్రమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఎర్రబెల్లి అన్నారు.


