భార్య ప్రేమాయణానికి భర్త బలి
ఈనెల 14న సంఘీ దేవాలయానికి వెళ్లి తిరిగివస్తున్న దంపతులపై జరిగిన దాడిలో భర్త (27) మరణించగా, భార్య గాయపడిన సంఘటన పై దర్యాప్తు జరిపిన సైబరాబాద్ పోలీసులు భార్య ప్రియుడిని, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఈనెల 14న సంఘీ దేవాలయానికి వెళ్లి తిరిగివస్తున్న దంపతులపై జరిగిన దాడిలో భర్త (27) మరణించగా, భార్య గాయపడిన సంఘటన పై దర్యాప్తు జరిపిన సైబరాబాద్ పోలీసులు భార్య ప్రియుడిని, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన యువతికి, ఆర్టీసీ మెకానిక్‌కు పెద్దలు బలవంతపు పెళ్లి చేయడంతో.. ఆ యువతి ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి చెందిన వెంకటేశ్వరరావు జూబ్లీ బస్‌డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. నాచారానికి చెందిన ఓ యువతితో అతనికి నిశ్చితార్థం తేదీ ఖరారయ్యింది. అయితే వెంకటేశ్వరరావుతో పెళ్లి ఇష్టం లేని ఆమె తాను ప్రేమించిన యువకుడిని ఆర్య సమాజంలో వివాహం చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిన్న కుమార్తె సౌజన్యను వెంకటేశ్వరరావుకిచ్చి గత మే 29న పెళ్లి జరిపించారు. కానీ సౌజన్య కూడా అంతకుముందే ఓ యువకుడితో ప్రేమలో ఉంది. పెళ్లి తర్వాత సౌజన్య ప్రతి శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరి శనివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చేది. ఈ నేపథ్యంలోనే సౌజన్య, ఆమె కళాశాల నాటి స్నేహితుడు, పశ్చిమబెంగాల్‌కు చెందిన జయదీప్‌లు.. వెంకటేశ్వరరావును ఆడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 13న సౌజన్య హైదరాబాద్ వచ్చింది. జయదీప్ కూడా నగరానికి వచ్చి స్నేహితుడు రాజ్‌కుమార్ సహకారం కోరాడు.
శనివారం దంపతులిద్దరూ బైక్‌పై సంఘీ దేవాలయానికి వెళ్లారు. రాత్రి 7.30కు తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో సౌజన్య ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వరరావును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న జయదీప్, రాజ్‌కుమార్‌లు వెంకటేశ్వరరావుపై దాడి చేసి హతమార్చారు. దుండగులు తనపై కూడా దాడి చేశారని చెప్పేందుకు సౌజన్య తన వీపు వెనుకభాగంలో కత్తిగాట్లు చేయించుకుంది. వివిధ కోణాలో దర్యాప్తు జరిపిన పోలీసులు సౌజన్య సెల్‌ఫోన్ కాల్స్ లిస్టును బయటకు తీయడంతో మొత్తం గుట్టు రట్టయ్యింది.


