ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌

ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌ - Sakshi


వాషింగ్టన్‌: ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో పిల్లిమొగ్గవేశారు. ‘ఇది ముస్లింలపై నిషేధంకాదు.. ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశాలను మీడియా వక్రీకరించింది’ అని వాపోయారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్‌ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన నష్టనివారణచర్యలకు దిగారు.



‘ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా.. కార్యనిర్వాహక ఉత్తర్వులు (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌) అంటే ముస్లింలపై నిషేధం విధించినట్టు కానేకాదు. ఉత్తర్వుల సారాంశాన్ని మీడియా వక్రీకరించింది. నిజానికి ఈ ఉత్తర్వులు మత సంబంధమైనవి కావు. అమెరికన్ల భద్రత, ఉగ్రవాదం అంశాలనే ప్రాతిపదికగా తీసుకున్నాం. ‘అమెరికా ఫస్ట్‌’ అనేది మా విధానం. అమెరికన్ల భద్రత విషయంలో రాజీపడేది లేదు. అయినా, ఆ ఏడు దేశాలను మినహాయిస్తే, ప్రపంచంలో ముస్లిం మెజారిటీ ఉన్న దాదాపు 40 దేశాలకు మా నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. 90 రోజుల్లో వీసాల జారీ ప్రక్రియను మరింత పకడ్బందీ చేస్తాం. అప్పుడు అన్ని దేశాలకు చెందిన పౌరులను అమెరికాలోకి ఆహ్వానిస్తాం’ అని ట్రంప్‌ చెప్పారు.

(ట్రంప్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌: ఇరాన్‌ సంచలన నిర్ణయం)





ఒబామా బాటలోనే నేనూ..

ముస్లిం దేశాలపై నిషేధం విధించడం కొత్తేమీ కాదన్న ట్రంప్‌.. బరాక్‌ ఒబామా హయాంలోనూ అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నదని గుర్తుచేశారు. ‘ఒబామా, 2011లో ఇరాకీయుల ప్రవేశంపై ఆరునెలలపాటు విధించారు. ఇప్పటి కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పేర్కొన్న ఏడు దేశాలు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నాయని నిర్ధారించింది కూడా ఒబామా సర్కారే’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. సిరియా మారణహోమంలో నలిగిపోతున్న వారిపట్ల తాను కూడా చింతిస్తున్నానని, అంతమాత్రనా అమెరికన్ల భధ్రతను పణంగాపెట్టి శరణార్థులను ఆహ్వానించబోనని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అన్నింటికంటే ముందు అమెరికాను సురక్షితంగా చేసిన తర్వాతే శరణార్థుల సమస్యల పరిష్కారానికి నడుం కడతామని వ్యాఖ్యానించారు. ‘అవును. అమెరికా ఒక వలసదేశమే. కానీ శరణార్థుల కంటే అమెరికన్ల భద్రతే నాకు ముఖ్యం’అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

(ఒకసారి అమెరికాను వీడితే.. మళ్లీ వెళ్లడం కుదరదు!)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top