దాచేస్తే దాగని సత్యం జలయజ్ఞ ఫలం


సాగునీటిరంగంపై వైఎస్ చెరగని ముద్ర

 2004 తర్వాత మారిన ప్రాధాన్యతలు

 సాగునీటి రంగానికి పెద్దపీట

 కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో చేపట్టిన జలయజ్ఞం

 వైఎస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన 23.49 లక్షల ఎకరాలు

 సాగునీటి రంగానికి వైఎస్ చేసిన కేటాయింపులు, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టే ఆయన కృషికి రుజువు


బాబు హయాంలో చిన్నచూపే...

 అరకొర కేటాయింపులే అందుకు నిదర్శనం

 తన హయాంలో పోలవరానికి పాలనా అనుమతీ ఇవ్వలేదు

 హంద్రీనీవాలో ఎకరాకు రూ.16,750 ఖర్చంటూ వ్యతిరేకించిన బాబు

 ఇప్పుడేమో.. హంద్రీనీవా ద్వారా అనంతపురానికి నీళ్లిస్తున్న ఘనత తనదేనట!

 వైఎస్ చేసిన కృషిని కావాలని తక్కువగా చూపే ప్రయత్నం..


 

జలయజ్ఞం.. అద్భుత సంకల్పం... కోటి ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి, రైతన్న భవిష్యత్తుకు భరోసాను కల్పించడానికి  డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న దృఢ నిర్ణయం. భారీగా బడ్జెట్ కేటాయింపులు. అదే వేగంతో నిర్మాణాలు..  ఆయన హయాంలోనే పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పొలాలకు సాగునీరూ అందించారు.  కానీ.. చంద్రబాబు  తీరు అందుకు భిన్నం.తన తొమ్మిదేళ్లలో సాగునీటికి  ప్రాధాన్యమివ్వలేదు. పునాదిరాళ్లు, ప్రచార ఆర్భాటమే ప్రత్యేకత అయ్యింది. ఈ నిజాన్ని గణాంకాలే చెబుతున్నాయి.

 

ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి

చరిత్రను చెరిపేయడానికి ప్రయత్నించడం వృథాప్రయాసే. చరిత్రను తిరగరాద్దామనుకున్నా.. అది అందరికీ సాధ్యం కాదు. సాగునీటి రంగంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన కృషిని తక్కువ చేసి చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యం, ఫలితంగా వివిధ ప్రాజెక్టుల కింద సాగైన బీడు భూములు, రైతుల ఇంట కురిసిన సిరులు, భారీగా నిధుల కేటాయింపు ఫలితంగా శరవేగంగా పనులు జరిగి ఆయన మరణంతో నిలిచిపోయిన ప్రాజెక్టులు, మళ్లీ చంద్రబాబు అధికారం చేపట్టాక ప్రాధాన్యం కోల్పోయిన నీటిపారుదల రంగం.. ఇవన్నీ సజీవ సాక్ష్యాలే.

 

శ్వేతపత్రంలో దాయలేని నిజాలు



చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నిరంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. సాగునీటి రంగంపై రూపొందించిన శ్వేతపత్రంలో.. చంద్రబాబు ఎంతగా దాయాలనుకున్నా నిజాలు దాచలేకపోయారు. బాబు ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలోనే.. నీటిపారుదల రంగంలో వైఎస్సార్ ముద్ర స్పష్టంగా కనిపించింది. వాస్తవాల ఆధారంగా చంద్రబాబు హయాం(1994-2004)లో సాగునీటి రంగానికిచ్చిన ప్రాధాన్యం, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం, అలాగే దివంగత నేత వైఎస్సార్, ఆ తరువాతి ప్రభుత్వాల(2004-2014) హయాంలో సాగునీటి ప్రాజెక్టులకిచ్చిన ప్రాధాన్యం, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం వివరాలను శ్వేతపత్రంలో వెలువరించారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం అత్యధికంగా కనపడుతూ, తన హయాంలో అరకొర వ్యయం, అప్రాధాన్యం కనిపిస్తుండడం.. శ్వేతపత్రం సాక్షిగా నిజం.

 

పోలవరానికి పాలనా అనుమతులూ ఇవ్వని బాబు



చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం పరిపాలన అనుమతి మంజూరు చేయడానికి కూడా ఇష్టపడలేదు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టారు. తెలంగాణ రైతుల పొలాలకు గోదావరి జలాలను అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదని  ఆ పథకాలను వైఎస్సార్ చేపట్టారు. హంద్రీ-నీవా సుజలస్రవంతికి ద్వారా సాగునీరందించాలంటే ఎకరానికి రూ.16,750 అవుతుందని అంచనా. అయినా వైఎస్.. సీమకు నీరందించడానికి భగీరథ ప్రయత్నం చేశారు. ఎకరానికి అంత ఖర్చా? అంటూ మొన్న అధికారం చేపట్టిన తొలి నెలలో తప్పుబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు హంద్రీనీవా ఘనత తనదేనని, అనంతపురం జిల్లాకు నీరివ్వడం తనవల్లే సాధ్యమైందంటూ ఘనంగా ప్రకటించడం.. ఆయన మార్కు రాజకీయానికి పరాకాష్ట.

 

సీమాంధ్రలో..



2004 తర్వాత వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు 86

 

 వీటిని చేపట్టినప్పటి అంచనా వ్యయం రూ.1,33,730 కోట్లు

 

 సవరించిన అంచనాల మేరకు వ్యయం రూ.1,90,598 కోట్లు

 

 పనులు ప్రారంభమైన ప్రాజెక్టుల సంఖ్య 85

 

 85 ప్రాజెక్టులద్వారా 97.69 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని లక్ష్యం

 

 మరో 23.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యం

 

 2014 వరకు పూర్తయిన ప్రాజెక్టుల సంఖ్య 16

 

 తద్వారా కొత్త ఆయకట్టు 2.33 లక్షల ఎకరాలు-స్థిరీకరణ 1.89 లక్షల ఎకరాలు

 

 పాక్షికంగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులు 25

 

 తద్వారా కొత్త ఆయకట్టు 17.20 లక్షల ఎకరాలు-స్థిరీకరణ 2.07 లక్షల ఎకరాలు



13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల(26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ఆధునీకరణ ప్రాజెక్టులు)ను చేపట్టారు.

 

 54 ప్రాజెక్టులకు రూ.80,559 కోట్ల వ్యయంతో 52.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం

 

 ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు 13

 

 పాక్షికంగా సాగునీటిని విడుదల చేస్తున్న ప్రాజెక్టులు 14

 

 పూర్తి చేసిన, పాక్షికంగా నీటిని విడుదల చేస్తున్న 27 ప్రాజెక్టులకు చేసిన వ్యయం రూ.19,460 కోట్లు

 

నిర్మాణంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు 40. ఇందులో పాక్షికంగా పూర్తయిన 14 ప్రాజెక్టులున్నాయి. 11 పథకాల నిర్మాణం చివరి దశలో ఉంది. ఇవి పూర్తయితే 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మరో 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది.

 

 సీమాంధ్రలో సాగునీటి రంగానికి 1994-2004 మధ్య చేసిన వ్యయం రూ. 6,087 కోట్లు.

 

 సీమాంధ్రలో సాగునీటి రంగానికి 2004-2014 మధ్య చేసిన వ్యయం రూ.41,434 కోట్లు. తద్వారా 11.878 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పన

 

 పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా సీమాంధ్రలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి రూ.17,368 కోట్లు అవసరం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top