చరిత్రలో చెరిగిపోని సంతకం

చరిత్రలో చెరిగిపోని సంతకం - Sakshi


వట్టికోట ఆళ్వారుస్వామి శతజయంతి

 

కలాలు పట్టిన వాళ్లంతా కవులూ, రచయితలూ కాదు. మూడు నాలుగు గ్రంథాలను అచ్చువేసుకు తిరిగే వారంతా ఆళ్వారుస్వాములు కారు. గడ్డాలు పెంచుకున్న వాళ్లంతా కాళోజీలు కాలేరు. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణయని’ నినాదాన్ని వల్లెవేసిన వారంతా దాశరథులు కాలేరు. త్యాగాలకు వెనుదీయని వాళ్లే ‘వట్టికోట’ వారసులవుతారు.

 

పుస్తకాలను అచ్చువేసిన వాళ్లు, పుస్తకాలను అమ్ము కునే వాళ్లంతా వట్టికోట ఆళ్వారుస్వాములు కాదు. పుస్తకాలను అచ్చువేసిన వాళ్లలో కొందరు ఈమ ధ్య వ్యకిగతంగా తమకు తాముగా వట్టికోట ఆళ్వా రుస్వామి వారసులమని చెప్పుకుంటున్నారు. వట్టికోట ఆళ్వారుస్వామి వంటి వారి వారసత్వం కొనసాగితే జనహిత సాహిత్యం వర్ధిల్లుతుంది. కొత్త తరం కవులను, రచయితలను అందుకు సన్నద్ధం చేయవలసిన నేపథ్యంలో వట్టి కోట ఆళ్వారుస్వామిని మననం చేసుకొని ముం దుకు సాగాలి.



వట్టికోట మార్గంలో నడవటం చాలా కష్టమైన పని, ఆయన బాట కష్టాల బాట. జైలు గోడల మీద రుద్రవీణలు మోగించే దారి. ఆయన నిబద్ధత, నిమగ్నతతో పుస్తకాలను నెత్తిన పెట్టుకొని మోశాడు, ఊరూరా తిరిగి పుస్తకాలను పంచుకుంటూ భావ జాల వ్యాప్తి చేసిన వాడు. వట్టికోట లాంటి వైతాళికు లను, దార్శనికులను మననం చేసుకోవటం అంటే కొత్త తరాల్ని ప్రేరేపించటమే.



వట్టికోట ప్రజాసాహిత్యం కోసం మొత్తం తన జీవితాన్నే వెచ్చించాడు. వంటవాడిగా జీవిస్తూ సాహిత్యాన్ని ప్రజలకు వండి పెట్టాడు. ఊరూరా తిరుగుతూ చివరకు హోటల్‌లో పనిచేస్తూ చదు వుకున్నాడు. తాను చదువుకున్న చదువుతో తన రచ నలతో సమాజానికి పాఠ్యాంశంగా మారాడు. కాళో జీ, వట్టికోట, చెరబండరాజు, సుద్దాల హన్మంతు, బండి యాదగిరి, దాశరథి, మగ్దూం మొయినుద్దీన్, శివసాగర్‌లు తాము ఏ విషయాలను తమ రచనల్లో చాటారో వాటినే తమ జీవితంలో ఆచరించారు. అం దుకే వాళ్లు చరిత్రకే వన్నె తెచ్చినవారుగా నిలిచారు.



వట్టికోట ఆశ్వారుస్వామి లాంటి వారు తమ మొత్తం జీవితకాలాన్ని సాహిత్యానికే అదీ ప్రజల కోసం కలం బట్టి అంకితం చేయటం వల్లనే ఏన్నో సామూహిక మార్పులకు దోహదకారులుగా నిలువ గలిగారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హన్మంతు, బండి యాదగిరిలతో జనం పాటలు ప్రాణం పోసుకున్నాయి. సురవరం ప్రతా పరెడ్డి వెలువరించిన ‘గోలకొండ’ కవుల సంకలనం ఆ రోజుల్లో విప్లవంగానే చెప్పాలి. సురవరం ప్రజల పక్షం వహించి ‘గోలకొండ’ పత్రికను ఎన్నో కష్టన ష్టాలకోర్చి నిర్వహించాడు. వేమన రాజ్యాన్ని వదిలి వేసి జనసాహిత్య శతకమయ్యాడు. పోతులూరి వీర బ్రహ్మం తన జీవితాన్నే మహత్తర, సాహిత్యతత్వం గా మార్చుకుని సామాజిక తత్త్వశాస్త్రంగా మారిపో యాడు. అణచివేతల నుంచి తొలుచుకుని అట్టడుగు వర్గాల సాహిత్యానికి జాషువా పాదులు వేశాడు. చెరబండరాజు వర్గ కసిని రగిలిస్తూ జీవితాన్నే కవి త్వానికి అంకితం చేశాడు.



వట్టికోట ఆశ్వారుస్వామి కూడా తాను జీవిం చిన 47 సంవత్సరాలూ ప్రజల కోసం తన అక్షరా లను అంకితంచేసి ‘ప్రజలమనిషి’ ‘గంగు’ నవలలు రాశారు. తెలంగాణ సమగ్ర చిత్రపటాన్ని చరిత్రకె క్కించారు. తెలంగాణపై వ్యాస సంకలనం రెండు భాగాలు వేశారు. సాహిత్య రంగంలో త్యాగాలకు, భోగాలకు స్థానముంది. పోతన్నలు, సోమనాథులు, బండి యాదగిరిలు, కాళోజీలు త్యాగాలకు గుర్తులు గా మిగిలారు. ఆ మార్గం లోనే వట్టికోట ఆళ్వారు స్వామి నడిచారు.  తన జీవితం, నిబద్ధత, నిమగ్నత లతో తెలంగాణ సాహిత్యానికి, తెలుగు సాహిత్యా నికి మహోన్నతమైన స్థానాన్ని కల్పించారు.



1915లో నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు సమీపం లోని చెరువు మాధవరంలో ఆయన జన్మించారు. ప్రగతిశీల భావజాలంతో ఆయన ఆర్యసమాజంలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తగా, తెలంగాణ సాయుధపోరులో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా కూ డా పనిచేశారు. ట్రేడ్‌యూనియన్ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించారు. 1941, 1946లలో జైలుజీవితం గడిపి రాజ్యనిర్బంధానికి గురయ్యారు. జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. అరవై ఏళ్లకు మునుపే తెలంగాణ అస్తిత్వ జండా ప ట్టారు. తెలంగాణ భాషను తన నవలల్లో రాశారు. జైలు కథలు రాశారు. అరసం, తెలంగాణ రచయి తల సంఘంలో పని చేశారు.



సరిగ్గా తెలంగాణ రాష్ట్రం అవతరించిన సంద ర్భం, ఆయన శతజయంతి సంవత్సరం కావడం కాకతాళీయంగానే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్య మంలో ఆళ్వారుస్వామిని స్మరించుకుంటూ ఇక్కడి సాహిత్య సాంస్కృతిక రంగాలు కదిలాయి. ఇప్పుడు వట్టికోటను పునశ్చరణ చేసుకునే సందర్భంలోనే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతోంది. తన ఒంటి నిండా, ఇంటి నిండా తెలంగాణ మట్టిని రాసుకుని తిరిగిన ప్రజల మనిషి కావటం వల్లనే ఆయన తెలం గాణ వైతాళికుడయ్యారు. రాజారామ్మోహన్‌రాయ్, కందుకూరి, గురజాడ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ల సరసన వట్టికోట ఆళ్వారుస్వామిని సగర్వంగా వైతా ళికునిగా నిలబెట్టవచ్చును. అదిమిపెట్టినంత మా త్రాన వైతాళికులు అడుగంటిపోరు. చరిత్ర తనను తాను రాసుకుంటున్నపుడు ప్రజలే వైతాళికులను లిఖించుకుంటారు. ప్రజలకోసం పుట్టి ప్రజల కోసం పెరిగి ప్రజల కోసం నేలకొరిగిన వాళ్లంతా వైతాళికు లే. వట్టికోట తెలంగాణ సమాజ వైతాళికుడు. ఆయ నను స్మరించుకుంటూ మానవీయ విలువలున్న తెలంగాణను స్మరించుకుందాం. మనిషిని మనిషి దోచుకోని సమాజం కోసం కవులు రచయితలుగా వట్టికోట స్ఫూర్తిని ఒంటినిండా నింపుకుందాం.



వ్యాసకర్త ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు  -   జూలూరు గౌరీశంకర్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top