అసంపూర్ణ మహాకావ్యం ‘రాజుల లోగిళ్ళు’

అసంపూర్ణ మహాకావ్యం ‘రాజుల లోగిళ్ళు’


విశేష రచన



 రెండు వేల  ఏళ్ళనాడు గుణాడ్యుడు పైశాచీభాషలో గొప్ప కావ్యం రాస్తే అర్థం కాలేదని అవమానించారు. ఆ బాధతో గుణాఢ్యుడు ఎవరికీ అక్కర లేని ఈ గ్రంథం ఎందుకని అడవిలో  హోమ గుండాన్ని రగిల్చి, ఆ అద్భుత కావ్యాన్ని ఒక్కొకటిగా చదువుతూ ఆ మంటల్లో ఆహుతి చేస్తుంటే అడవిలోని పశుపక్ష్యాదులు వినడనికి చుట్టూ చేరి ఈ ఘూరకృత్యానికి హాహాకారాలు చేస్తాయి. విషయం తెలుసుకున్న రాజు పరుగు పరుగున చేరి గుణాఢ్యుని కోపం పోగొట్టి ఆ దారుణం ఆపుజేయిస్తాడు. కాని అప్పటికే దాదాపు అయిదు వంతుల భాగం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ మిగిలిన అయిదోవంతుల భాగమే మన పాలిటికి బృహత్కథ. ఈ కథ అసంపూర్ణ కావ్యాల గురించి అనాదిగా సాహితీప్రియుల హృదయంలో ముల్లును చూపిస్తుంది. కె.ఎన్.వై. పతంజలి రాసిన ‘రాజుల లోగిళ్ళు’ నవల చదివాకా ఆ ముల్లు నా గుండెలో కూడా నాటుకుంది.



 1750లో విజయనగర సంస్థానంలోని ఆలమండ శివార్లలో ప్రారంభమయ్యే ఈ బృహన్నవల ఆ గ్రామంలో స్థిరపడ్డ కాకరపర్తి వంశీకులైన రాజుల జీవితాలనే కథావస్తువు చేసుకుంది. ఆ కులం సంస్కృతీ వ్యవహారాలు, కష్టనిష్టూరాలు, మంచీ చెడులూ వీటన్నిటినీ కలేసుకుంటూ సాగిపోయే కాలప్రవాహం నవలలో చూపించబూనారు. బ్రిటిష్ యుగానికి మునుపు రాజ్యానికి యుద్ధ్ధాల్లో, గ్రామానికి వివాదాల్లో అక్కరకి వస్తూ పౌరుషప్రతాపాలతో అరణాలు సాధించుకున్న  క్షత్రియులు తమదైన రాజ్యం అనే స్థానాన్ని  బ్రిటిష్ వారాక్రమించి తమ స్థానాన్ని పరిమితం చేసేసినా పూర్వ పద్ధతులు, పౌరుషాలు వదలకపోవడం ఆయా గుణాలన్నీ రిలవెన్‌‌స కోల్పోవడం చూపించారు.  కాకరపర్తి బాపిరాజుగారు 18వ శతాబ్ది మధ్యభాగంలో ఆలమండలో స్థిరపడ్డ నాటి నుంచి ఆ

 క్ష త్రియకుటుంబం విజయనగర సంస్థానంలో రాజ్యవ్యవహారాలు, తమలో తమకు ఆస్తితగవులు మొదలుకొని కుటుంబాల్లోని వ్యక్తుల ప్రవర్తనలు, సమూహ లక్షణాలు, ఆటలు, వేటలు, యుద్ధాలు, మరణాలు ఒకటేమిటి శతాబ్దాల జీవితాన్ని అక్షరాల్లో చిత్రించబోయిన మహారచన ఇది.



 ఈ నవలకు ఉన్న అనేకానేక  లక్షణాల్లో కళింగాంధ్ర క్షత్రియుల సంస్కృతికి మినీ ఎన్‌సైక్లోపీడియా కావడం ఒకటి. ఎందరెందరో వ్యక్తులు, ఎన్నెన్నో అలవాట్లు, ఏవేవో ఆచారాలు నవలలో ప్రతిచోటా చూపిస్తూనే వచ్చారు పతంజలి. క్ష త్రియ కుటుంబాల మీద ఆధారపడ్డ వృత్తులు కూడా తెలుస్తాయి. రాదారి మీద వచ్చేపోయేవారిపై క న్నేసి ఉంచి, వారిలో రాజులుంటే తీసుకువచ్చి మర్యాదలు చేయడానికి మంచి జీతంతో గాలిసాయెబు, భార్యకు కూడా తెలియని ‘పెదరాజుగారి మనసు తెలిసిన’ వంట చందర్రాజు, ‘సితం... నానెప్పుడో అనుకున్నాను మారాజా’ అంటూండే ఉద్ధారకులూ ఇలా ఎన్నో వృత్తుల వాళ్లు కనిపిస్తారు. ఈ కథామాలికలో ప్రేమగా ఇంట్లో పెంచే నెమళ్ళూ, ఎకరాలు తాకట్టు పెట్టి కొనే పందెం కోళ్ళు, వాటిలో మళ్ళీ ప్రత్యేకంగా రకాలు, గుర్రాలు, గుర్రాల్ని పెంచేవాళ్లు, అశ్వశాస్త్రం తెలిసిన రాజులు, తుపాకీ దెబ్బకి గొల్లుమన్నట్టు కకావికలైపోయే బెగ్గోర్లను తల తెగగొట్టి వేట చేసే జలకనిగ పక్షి, చెవులకు బంగారు లోలాకులు, కాళ్ళకు పుత్తడి కంకణాలతో దర్జా వెలగబెట్టే సొగసైన మారీ కోడిపుంజు వగైరా రాజుల వాకిళ్లలోని జంతువులు. గుమ్మడికాయలతో చేసిన తీయని మురబ్బీ, చక్కగా కాల్చిన దిబ్బరొట్టెలు తేనె ముంచుకు తినడం, వరిపిండితో చేసిన పోలీలు టర్కీ కోడి పోరిటీ నీళ్ళతో నంచుకోవడం మొదలుగా అవకాశం దొరికినప్పుడల్లా వారిళ్లలోని భోజన పదార్థాల వర్ణన చేస్తారు.



మగపెళ్ళివారి తరఫున ఓ వివాహానికి అలమండ కాకరపర్తి క్షత్రియులంతా తరలివెళ్లి అక్కడ చిన్నా చితక తగవు పెట్టుకుని తీసుకువెళ్లిన సామాగ్రితో ఊరిబయట సుష్టుగా భోజనాలు కానిస్తారు. తరతరాలుగా మారుతున్న తలకట్టు, వస్త్రాలు వంటివి, ఇళ్లలోగిళ్ళు కట్టిన విధానం, ఇంటిలోపలి వస్తుసామగ్రి వంటివన్నీ సవివరంగా వర్ణిస్తారు. అంతా వర్ణచిత్రాల్లా కళ్ళకు కడతారు. వీటన్నింటినీ మించినది నవలలో పతంజలి వాడిన భాష. మన సమాజంలో కులం వృత్తిగా, సాంఘిక ఆర్థిక స్థితిగా స్ఫుటమైన పాత్ర వహించినందున వందల ఏళ్లుగా ప్రతీ కులానికి వేర్వేరు యాసలు, ప్రత్యేకమైన నుడికారం, విశిష్టమైన ఉచ్ఛారణ ఉంటాయి. ఆ ప్రత్యేకమైన ఉచ్ఛారణలు కులవృత్తులు, ప్రత్యేకతలు నశించిపోయినా ఇప్పటికీ ఇంగువగట్టిన మూటల్లా వినిపిస్తూనే ఉంటాయి. సూక్ష్మమైన ఉచ్ఛారణ భేదాన్ని స్ఫుటంగా రికార్డు చేసిన అరుదైన రచయితల్లో పతంజలి ఒకరు. కన్యాశుల్కంలో ఉత్తరాంధ్ర బ్రాహ్మణుల భాషను, అందులోనూ వైదిక, నియోగి సునిశితమైన భేదాలతో గురజాడ చూపినట్టుగానే పతంజలి రాజులలోగిళ్ళులో క్షత్రియుల భాషను అంత జాగ్రత్తగా పట్టుకున్నారు. అందుకు పరాకాష్టగా వ్రాత మాధ్యమంలో అందుకోవడానికి దాదాపుగా అసాధ్యం అయిన సాగదీతని కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు ఒక మాటని ఒక వాక్యంగా సాగదీస్తారు అంటూ. మొత్తంగా ఆ సంస్కృతిని తరతరాలు, శతాబ్దాలు సాగే ఇతివృత్తమంతటా నేపథ్యంగా అల్లేశారు. ఇతివృత్తంలో భాగంగా అలమండ కాకరపర్తి వారు, వారి సమీప బంధువులు విజయనగర సంస్థాన చరిత్రలో ఎలా పాలు పంచుకున్నదీ తారీఖులు, చారిత్రక వ్యక్తులు, విలువైన ఉత్తరాల పాఠాలతో సహితంగా కనిపిస్తాయి.



 ఈ నవలలో చిత్రించిన క్షత్రియ వర్గ సంస్కృతి పెళ్ళిలో ప్రదర్శించే పంచదార చిలకల్లా, చరిత్ర అద్దాల బీరువాలో పెట్టి దాచుకున్న తాతగారి బొమ్మలాగా ఉండదు. రాజ్యాధికారం, రాజ్యంలోని వ్యవస్థలు మార్పు చెందుతూండడం వల్ల సామాజిక ఆర్థిక స్థితిగతుల్లోని మార్పులను ప్రదర్శిస్తూంటుంది ఈ నవల. నవలలోని పాత్రల్లో దౌర్జన్యం, ఉదారత్వం, సహృదయం, కుటిలత్వం, సమర్థత, నిష్క్రియ ఇలా అన్ని లక్షణాలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఇంకా చెప్పాల్సివస్తే ఒక్కో పాత్రలో పరస్పర విరుద్ధమనిపించే గుణాలూ కనిపిస్తాయి. కానీ పతంజలి ఏ ఒక్కరి తరఫునో ఉండడు. ఎందుకంటే ఇది ఒక కులానికి సంబంధించిన కథ అనే స్థాయి నుంచి రాజ్యం అనే వ్యవస్థలోని లక్షణాలుగా చూపే పెద్ద ప్రణాళిక ఇందులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ దుర్మార్గమూ, ఈ సుకృత్యమూ ఒకే వ్యవస్థ తాలూకు అంగాలు అన్నట్టుగా ఉంటుంది రచయిత దృక్పథం. పెట్టెలు పట్టనంత జవహరీ ఉన్న స్థితి నుంచి అంతా ఖాళీ అయిపోయి దెయ్యంపెట్టిలా మిగిలిన ఇనప్పెట్టి ఆ అరల్లో వెతికితే దొంగ సొరుగులో దొరికిన నగకే ఉప్పొంగిపోయిన సన్యాసిరాజు వరకూ ఎన్నో పరిణామాలు. 18వ శతాబ్దంలో యుద్ధాల మధ్యన, పదుల గ్రామాలకు పన్ను వసూలు చేసే హక్కున్న స్థితిలో కాకరపర్తి వారి ఘనత కట్టెదుట సత్యం.



అలాంటిది 20వ శతాబ్దికి కథ సాగేసరికి బ్రిటిష్ రాజరికం బిగిసిపోయి యుద్ధాలు హుళక్కి అయి సంస్థానాలు కొనుక్కునే స్థితి వచ్చేస్తుంది. ఈ పరిణామాలను అవగాహన చేసుకోలేకో, చేసుకున్నా తగ్గట్టు వుండలేకో క్షత్రియులు ఆనాటి అలవాట్లను ఆచారాలు చేసుకుంటారు. 1750లో కాకరపర్తి బాపిరాజు గురించి బండారు ఎర్రినాయుడు ‘మగోడన్నాకా మీసం ఉండాల! ఊరన్నాకా రాజుండాల...! అదండీ బావు... మీ కూటమానం మా గ్రామంలో కాపురం బెట్టాలని మాయందరి కోరిక...’ అంటూ కోరి నిలబెట్టుకున్న తర్వాత నాలుగైదు తరాల తర్వాత మరో మిడతాడ రామినాయుడు మనవడితో ‘‘ఈ మిడతలు యాడ్నుంచో వచ్చినాయి. ఆకలి తీరినాకా ఎల్లిపోతాయి. రాసోళ్ళు, దొరలు, సాయిబులు యాడనించో వచ్చారు. మిడతలు రెక్కల్తో వస్తే ఆళ్లు కత్తులతో వచ్చేరు. మిడతలు బాతులు తినేసినాకా పోతాయి. ఈళ్ళు ఇక్కడే దిగడిపోతారు. రాసోళ్ళు మనల్ని తిని బతుకుతారు’’ అని ఈసడించుకునే స్థితి వస్తుంది. ఇక్కడ కాకర్లపూడి

 యోగ నారసింహ పతంజలి రాజుల వెనుక ఉండడు, రైతును బాహాటంగా జాలిపడడు. ఇదీ విషయం, ఇదీ చరిత్ర గతి అని పాఠకుడికి చెప్తూంటాడు.

 

ఇంతకీ నా మనస్సులో నాటుకున్న ఆ ముల్లు సంగతి ఏమిటంటే ఈ నవలను పతంజలి వేయి పేజీలు పరిణామమున్న నవలగా సంకల్పించారు. తనకు తానే కుదించుకున్నా ఈ నవలను పూర్తిచేయలేక అసంపూర్తిగా వదిలేశారు. ఎన్నో ఏళ్ళుగా తన దగ్గర స్నేహితులకు ఈ నవల థీంను బృహత్కథలా విస్తరిస్తూ వినిపించేవారట. అది విన్నవారంతా ముగ్ధులైపోయేవారట. 2002 ప్రాంతంలో ఆర్టిస్ట్ మోహన్‌వంటి మిత్రుల చొరవతో ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదక బాధ్యతలు వహించిన ఓ ఐ.ఎ.ఎస్. అధికారి కొన్ని నెలలకు చెక్కు రాసేయగా ‘రాజుల లోగిళ్ళు’ ప్రారంభమైంది. ఆ కాంట్రాక్టు పూర్తయ్యాకా ఆపేశారు. పత్రిక వాళ్ళు ఎంతగా అడిగినా అప్పటికి మిగిలిన నవల రాయలేకపోయారు. ఆ తర్వాత కూడా రాయవీలుపడలేదు- మిత్రులు వెంటబడినా సరే. ఆ తర్వాత ఆరోగ్య స్థితి చెడిపోవడంతో  కొన్నాళ్ళకే చనిపోవడం తెలుగు సాహిత్యంలో పెద్ద విషాదం.



 చరిత్ర, సంస్కృతుల గతిని పడుగుపేకల్లా అల్లి రాసిన ‘రాజుల లోగిళ్ళు’ అసంపూర్ణంగా మిగిలిపోవడం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. ఒక పూరించలేని అగాధం.

 - సూరంపూడి పవన్ సంతోష్

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top