మెరుపులా మెరిసినవాడు...

మెరుపులా మెరిసినవాడు... - Sakshi


పెద్దిరాజు జంపన గురించి చెబితే బహుశా ఆయన గుర్తుకు రాకపోవచ్చు. కానీ శ్రీరంగం రాజేశ్వరరావు, ఎస్‌ఎస్ ప్రకాశరావు, శారద లాంటి రచయితలు కచ్చితంగా గుర్తుకు వచ్చి తీరుతారు. మంచి కథలు రాస్తూ ఉండటం వీళ్లందరి మధ్యనా మొదటి పోలిక. అలానే చిన్న వయసులోనే మరణించడం అన్నది మరో విషాదకరమైన పోలిక. వీళ్లు జీవించి ఉంటే మరిన్ని మంచి కథలు రాయగలిగి ఉండేవారు అన్న విషయం వాళ్ల వాళ్ల కథలని చదివితే తెలిసిపోతూ ఉంటుంది.

 

 1946లో పశ్చిమగోదావరి జిల్లా జువ్వల పాలెంలో జన్మించిన పెద్దిరాజు చదువు ఏలూరు, భీమవరం, బెజవాడలో జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ 1969లో పూర్తి చేశారు. బహుశా రాయడం తన యూనివర్సిటీ రోజుల్లోనే మొదలుపెట్టి ఉండాలి. యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమెస్కో వారు విశ్వవిద్యాలయ విద్యార్థుల కథల సంకలనం వేశారు. అందులో పెద్దిరాజు రాసిన ‘ఫౌల్ ఫౌల్’ అనే కథ చోటు చేసుకోవడమూ ఆ కథ గుర్తింపు పొందడమూ జరిగింది.

 ఉద్యమాలూ శ్రీశ్రీ స్ఫూర్తీ బలంగా ఉన్న రోజుల్లో ఉద్భవించిన రచయిత పెద్దిరాజు జంపన. ఆ ప్రభావం ఆయన కథల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. నిజాయితీ, ఉత్సాహం, సామాజిక బాధ్యత ఉన్న రచయితగా గుర్తించబడ్డాడు.

 ‘ఫౌల్ ఫౌల్’ కథ కాకుండా పెద్దిరాజు ‘మంచం’ (ఆంధ్రపత్రిక- 1969), ‘దేవత’ (జ్యోతి-1969) అనే రెండు మంచి కథలు రాశాడు. కవితలు రాశాడు.

 పురోగమించడం లేదని నేననను

 ప్రతితీ సుఖంగానే ఉందంటే నే వినను

 నిజం- ఈ రథం ముందే పోతోందికానీ

 బతికున్న మనిషిని

 నాకొక్కడిని చూపించు...

 చాలా మంచి ఎక్స్‌ప్రెషన్ ఉన్న కవి అనిపిస్తాడు. ఈ కవితా ధోరణి ఉండటం వల్ల కావచ్చు ‘పట్టిందల్లా బంగారం ‘ (1971) సినిమాలో ఒక పాట కూడా రాశాడు.

 ఎమ్‌ఏ పూర్తి కాగానే భీమవరం కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో స్థిరపడిన జంపన సంవత్సరం తిరిగే లోపు 1970లో మరణించాడు. అంటే అప్పటికి ఆయన వయసు 24 ఏళ్లు మాత్రమే. అలా తెలుగు కథ ఒక మంచి కథకుణ్ణి కోల్పోయింది.

 - రమణమూర్తి, ఫేస్‌బుక్ కథ గ్రూప్ నుంచి...

  విస్మృత కథకుడు/ పెద్దిరాజు జంపన

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top