ఆండాళ్ పలికిన మధుర కవిత: తిరుప్పావై

ఆండాళ్ పలికిన మధుర కవిత: తిరుప్పావై


  పారవశ్యం

 

 పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (కీ.శ. 9వ శతాబ్ది) రచించిన ‘తిరుప్పావై’ భారతీయ సాహిత్యంలోని అత్యంత విలువైన కృతుల్లో ఒకటి. తదనంతర సాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్క మహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీన కవయిత్రులతో పాటు సరోజినీ నాయుడు, తోరూదత్, మహాదేవీ వర్మ వంటి ఆధునిక కవయిత్రుల దాకా ఎందరో భావుకులకూ, రస పిపాసులకూ ఆండాళ్‌దే ఒరవడి. ఆమెకు పూర్వం అంతగా ప్రసిద్ధి చెందని కొందరు సంగం కాలం నాటి కవయిత్రులూ, ప్రాకృత కవయిత్రులూ, థీరీగాథల పేరిట కొంత కవిత్వం చెప్పిన బౌద్ధ సన్యాసినులూ లేకపోలేదుగాని, మధుర కవిత్వాన్ని ఒక సంప్రదాయంగా మార్చగలిగిన తొలి కవయిత్రి ఆండాళ్ అనే అనాలి. ప్రపంచ సాహిత్యంలో కూడా ఆమె కన్న ముందు ఒక శాఫో, ఒక రబియా... అంతే. అంతకన్నా ఎక్కువ పేర్లు కనిపించవు.

 

 కవిగా ఆండాళ్ యశస్సు తిరుప్పావై, నాచ్చియార్ తరుమొళి అనే రెండు చిన్న కావ్యాల మీద ఆధారపడి ఉంది. రెండూ అత్యంత శక్తిమంతమైన రచనలు. ముఖ్యంగా తిరుప్పావై బాహ్య ప్రపంచానికీ, మనోమయ ప్రపంచానికీ, భక్తికీ, ప్రేమకీ, నిద్రకీ, మెలకువకీ, స్థానికతకీ, వైశ్చికతకీ, ఐహికానికీ, ఆముష్మికానికీ మధ్య హద్దులు చెరిపేసిన రచన. భక్తి గురించి వివరించేటప్పుడు భాగవతం అయిదు విధాల భక్తిని పేర్కొంది. అవి దాస్య, సఖ్య, వాత్సల్య, శాంత, మధుర భక్తి మార్గాలు. భారతీయ భాషల్లో భక్తికవిత్వం చెప్పిన ప్రతి భాషలోనూ ప్రతి కవీ ఈ అయిదింటిలోని నాలుగు మార్గాల్లో ఏదో ఒక పద్ధతిలో కవిత్వం చెప్పినవాడే. కాని మధురభక్తిలో కవిత్వం చెప్పగలిగే అదృష్టానికి నోచుకున్నది ఒక ఆండాళ్, ఒక మీరా మాత్రమే.

 

 ఆళ్వారుల ముందు తమిళ దేశంలో శైవ భక్తికవిత్వం చెప్పిన అప్పర్ దాస్య భక్తికీ, సంబంధర్ వాత్సల్య భక్తికీ, సుందరమూర్తి సఖ్యభక్తికీ అక్షర రూపమిస్తే, తిరువాచకాన్ని గానం చేసిన మాణిక్య వాచకర్ మధురభక్తి అంచుల దాకా పోగలిగారు. తిరువాచకంలోని తిరువెంబావై అనే అధ్యాయం తిరుప్పావైకి ప్రేరణ అనవచ్చు. శైవభక్తిని ఒక ఉద్యమంగా ప్రచారం చేసిన నాయన్మారుల బాటలోనే ఆళ్వారులు పన్నెండు మందీ వైష్ణవ భక్తిని ప్రచారం చేశారు. వారిలో పెరియాళ్వారుది వాత్సల్య భక్తి. తరుమంగై ఆళ్వారుది దాస్యభక్తి. ఆళ్వారుల్లో స్వయంగా దేవుడే ‘నా ఆళ్వారు’ అని చెప్పుకున్న నమ్మాళ్వారుది సఖ్యభక్తి. కాని ఆయన కూడా మధురభక్తి అంచుల దాకా పోగలిగాడే తప్ప అందులో మునిగిపోలేకపోయాడు. ఆళ్వారు అంటే మునిగిపోయిన వాడని అర్థమైనప్పటికీ, నిజంగా మధుర భక్తిలో మునిగిపోగలిగింది ఆండాళ్ మాత్రమే.

 

 తిరుప్పావై అంటే శ్రీవ్రతమని చెప్పవచ్చు. ఆ కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు దాన్ని ‘సిరినోము’ అన్నారు. తిరుప్పావై పైకి ఒక సాధారణమైన నోముపాటలాగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఉపనిషత్తుల రహస్యాన్వేషణా, ప్రాచీన సంగం కవిత్వంలోని కవి సమయాలూ విడదీయలేనంతగా కలిసిపోయాయి. ఒక పాశ్చాత్య భావుకుడు చెప్పినట్టుగా పైకి సరళంగా కనిపించే అత్యంత సంక్లిష్టమైన కావ్యమది. అందులోని ఒక్కొక్క పాశురాన్నీ, ఒక్కొక్క పద ప్రయోగాన్నీ వివరించుకుంటూ విశోధించుకుంటూ పోయే కొద్దీ ఉత్తర దక్షిణ దేశాల అత్యున్నత వివేచనంతా అందులో కనవస్తుంది. అందులో వేదాంతముంది, రస పిపాస ఉంది, గోకులముంది, తమిళ దేశముంది. ఏది శ్రీవిల్లి పుత్తూరో, ఏది రేపల్లెనో విడదీసి చూపలేనంతగా అల్లిన జిమిలినేత అది.

 

 ఇంతకీ తిరుప్పావై దేని గురించి? ప్రాచీన తమిళ దేశంలో మార్గశిర మాసంలో కన్యలు పెళ్లి కోసం పట్టే నోము అది. దాన్ని భాగవతం కాత్యాయనీ వ్రతంగా పేర్కొంది. తిరుప్పావైలో ఆ నోము ఏదో ఒక దేవతను కొలిచే నోముగా కాక ఒక మంగళవాద్యం కోసం కోరుకున్న మొక్కుగా కనిపిస్తుంది. ఒక కన్య మంగళవాద్యం కోసం నోము నోచడమన్న ఊహలోనే అనిర్వచనీయమైన రసస్ఫూర్తి ఉంది. మంగళవాద్యమంటే ఏమిటి? అది జీవితాన్ని కల్యాణప్రదం చేసే శబ్దానికీ వాక్కు తూర్యధ్వనికీ దేనికైనా ప్రతీక కావచ్చు.

 

 ఆ నోము పట్టి మార్గశిర మాసం ముప్పై రోజులూ పాడుకునే పాటల్లాగా తిరుప్పావైని ఆండాళ్ నిర్మించింది. ఒక్కొక్క రోజూ ఒక్కొక్క పాశురం చొప్పున ముప్పై పాశురాల సంపుటి. పాశురమంటే ఎనిమిది పంక్తుల గీతం. అచ్చతమిళం, సెందమిళంలో చెప్పిన కవిత్వమనిది. దానికొక నిర్మాణ క్రమముంది. మొదటి అయిదు పాశురాలూ నోము నోచడానికి చెప్పుకున్న సంకల్పం. 6వ పాశురం నుంచి 15వ పాశురం దాకా కన్యలు ఒకరినొకరు పిలుచుకోవడం, ఇంటింటికీ తిరగడం, ఒకరినొకరు మేల్కొల్పుకోవడం, మిత్రురాళ్లు చేరువకావడం. 16వ పాశురం నుంచి 29వ పాశురం దాకా కావ్యంలోని సారాంశమంతా ఉంది. అది కన్యలు శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీ కృష్ణ దేవుని దేవాలయం ముందు చేరి దేవుణ్ణి మేల్కొల్పే కవిత్వం. కాని అక్కడ ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరుకీ రేపల్లెకీ మధ్య హద్దులు చెరిపేసింది. ఆమె తన ఊళ్లో తన కులం మధ్య గుళ్లో ఉన్న విగ్రహానికి మేలుకొలుపు పాడుతు న్నట్టుగా కాక, రేపల్లెలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పు తున్నట్టుగా పాటలు పాడింది. అందుకనే తిరుప్పావైకి గొప్ప వ్యాఖ్యానం రాసిన పెరియవచన పిళ్లై ‘తక్కిన ఆళ్వారుల్ని భగవంతుడు మేల్కొల్పాడు. కాని ఆండాళ్ తానే స్వయంగా భగవంతుణ్ణి మేల్కొల్పింది’ అన్నాడు.

 

 26వ పాశురంలో మంగళవాద్యం కోసం మొక్కుకున్న కవయిత్రి 27వ పాశురానికి వచ్చేటప్పటికి తిరుప్పావై వ్రత ప్రయోజనమేమిటో ఆశ్చర్యకరంగా చెప్తుంది. కృష్ణశాస్త్రి అనుసృజనలో ఆ పాశురం:

 

 ఇంతకన్న శుభవేళ ఏదీ / ఇంతకన్న ఆనందమేదీ

 బంతులుగా నీతోడ గూడి/ ఇంతుల మెల్లరము

 నేయి వెన్న మీగడలు/ తీయతీయని పాయసము

 చేయి మునుగగా ఆరగింపగా/ చేయవా చిత్తగింపవా


 

 ఇదొక మహిమాన్వితమైన వాక్యం. భగవంతుడితో కలిసి జీవించే క్షణాలు సంభవించినప్పుడు ఆ ఆనందాన్ని ఆండాళ్ అత్యంత లౌకికమైన పరిభాషలో వ్యక్తం చెయ్యడం. తిరుప్పావైలోని 3వ పాశురంతో దీన్ని కలిపి చదవి చూడండి. అందులో ఆమె వ్యక్తం చేసిన ఆకాంక్ష:

 

 ఎనలేని సిరులతో నిండును, ఈ సీమ

 ఈతిబాధలు కలుగకుండును

 నెలనెలా మూడు వానలు కురియును

 బలిసి ఏపుగ పైరులెదుగును

 అలపైరుసందులను మీలెగురును

 కలువల ఎలతేంట్లు కనుమూయును

 కడిగి కూర్చుండి పొంకంపు చన్నులను

 ఒడిసి పిదుకగ పట్ట రెండు చేతులను

 ఎడము లేకుండ పెనుజడుల ధారలను

 కడవల ఉదార గోక్షీరములు కురియును


 

 ‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటు పడవోయ్’ అని గురజాడ కోరుకున్న కోరికకీ ఈ కోరికకీ ఎంత సారూప్యత! ఈ వాక్యాలు చూసినప్పుడు తిరుప్పావైని ఒక మతగీతంగా భావించలేమ నిపిస్తుంది. అత్యంత సుఖప్రదమైన, శుభప్రదమైన లౌకిక జీవితాన్ని కోరకున్న శుభాకాంక్షగా భావించాలనిపిస్తుంది. ఆండాళ్ దేవుడి కోసం పడ్డ విరహంలో దేశం సుభిక్షంగా ఉండాలన్న ఆవేదన ఉంది. భగవంతుణ్ణి చేరుకోవడం ఎవరికివారు విడివిడిగా చేసే పని కాదనీ, అదొక బృందగానం కావాలన్న మెలకువ ఉంది. లోకానికి మేలు చేకూరాలన్న శుభకామన కన్నా గొప్ప మంగళవాద్యమే ముంటుంది? మనం కూడా చిన్నప్పుడేదో ఒక తిరుణాలకి వెళ్లే ఉంటాం. ఆ సంతోషం, ఆ సంరంభం చూసినప్పుడు మనకేమనిపించి ఉంటుంది? మనమొక బూర కొనుక్కుని నోరారా ఊది ఉంటాం. మనమున్నామనీ, జీవించి ఉన్నామనీ, పట్టలేనంత ఆనందంగా ఉన్నామనీ మనకి మనం చెప్పుకోవడానికి మనం చేసిందల్లా నోరారా బూర  ఊదడమే. అట్లాంటి మంగళమయ సంగీతం కోసమొక మహనీయురాలు నోరారా పాడిన గీతం తిరుప్పావై.

 

 - వాడ్రేవు చినవీరభద్రుడు

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top