'లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?' | Sakshi
Sakshi News home page

'లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?'

Published Tue, Jan 12 2016 6:22 PM

'లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?' - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తనపై వేసిన పరువునష్టం దావాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదునైన సమాధానమే ఇచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జైట్లీ లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారని, కాపాడుకునేందుకు ప్రజల్లో ఆయనకు గొప్ప పరువు, ప్రతిష్టలు ఏమీ లేవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జైటీ వేసిన పరువు నష్టం కేసులో ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్ మంగళవారం తన సమాధానాన్ని అందజేశారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం, పరువు, ప్రతిష్టలు ఉన్నాయని జైట్లీ చెప్పుకొంటున్నదంతా అల్పమైన వాదనేనని కేజ్రీవాల్ కొట్టిపారేశారు.

'2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జైట్లీ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ భారీ విజయం సాధించినా, అమృతసర్ లో జైట్లీ మాత్రం లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం ఉందని ఆయన చేసిన వాదనను భారత ప్రజాస్వామ్యం ఎన్నడూ అంగీకరించలేదు' అని ఢిల్లీ సీఎం తన సమాధానంలో పేర్కొన్నారు.

జైటీ హయాంలో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీఏ)లో అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ తన పరువు తీశారని కేజ్రీవాల్, ఆప్‌పై జైట్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు.
 

Advertisement
Advertisement