దేవుడు లేడంటే చంపేస్తారా?
సోషల్ మీడియా వేదికలపై మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా దేవుడు లేడంటూ ప్రచారం చేస్తున్న 31 ఏళ్ల ముస్లిం యువకుడిని అన్యాయంగా చంపేయడంపై అదే సోషల్ మీడియా వేదకలపై నేడు చర్చ జరుగుతోంది.
చెన్నై: సోషల్ మీడియా వేదికలపై మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా దేవుడు లేడంటూ ప్రచారం చేస్తున్న 31 ఏళ్ల ముస్లిం యువకుడిని అన్యాయంగా చంపేయడంపై అదే సోషల్ మీడియా వేదకలపై నేడు చర్చ జరుగుతోంది. కోయంబత్తూరులో స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్న హెచ్. ఫరూక్‌పై నలుగురు దుండగులు గురువారం రాత్రి దాడిచేసి హత్య చేసిన విషయం తెల్సిందే. ప్రముఖ ద్రవిడ నాయకుడు పెరియార్ ఈవీ రామస్వామి సిద్ధాంతం ప్రాతిపదికన వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘ద్రావిడార్ విద్యుతలై కళగం’ సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తున్న ఫరూక్ మృతదేహాన్ని కోయంబత్తూర్ సీవరేజ్ ప్లాంట్ వద్ద పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో అర్షద్ అనే రియలెస్టేట్ వ్యాపారి లొంగిపోగా, సద్దాం హుస్సేన్ అనే మరో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన 400 మంది హేతువాదులతో ఫరూక్ ఏర్పాటు చేసిన ‘వాట్సప్ గ్రూప్’ను రద్దు చేయాల్సిందిగా ఆయనకు గతకొంతకాలంగా ఫేస్‌బుక్, వాట్సప్‌లో హెచ్చరికలు వస్తున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నేను దేవుడికి శత్రువును, మతానికి శత్రువును, కులానికి శత్రువును, మానవత్వాన్ని విశ్వసించే మానవతావాదులకు మాత్రం మంచి మిత్రుడిని’ అంటూ ఫరూక్ మార్చి 13వ తేదీన ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలపై పలువురి నుంచి ఆగ్రహం వ్యక్తం అయినట్లు ఆయన భార్య రషీదా మీడియాకు తెలిపారు. ఆయనకు భార్యతోపాటు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.
ఒక్క ఫరూక్ తప్పా తమ ఇంట్లో అందరూ ఇస్లాం సంప్రదాయాన్ని ఆచరిస్తారని, అందరి విశ్వాసాలను గౌరవించే ఫరూక్ తమతో విభేదించి తమను ఎన్నడూ నొప్పించలేదని, తాను మాత్రం మతాలను, దేవుళ్లను నమ్మనని చెప్పేవాడని ఆయన తండ్రి హమీద్ వాపోయారు. ఫరూక్ నిజమైన మానవతావాదని, ఆయన హత్యను ముస్లిం నాయకులంతా ఖండించడం అభినందనీయమని ‘ద్రావిడార్ విద్యుతలైవి కళగం’ రాష్ట్ర అధ్యక్షుడు కొలతూర్ మణి వ్యాఖ్యానించారు.
భారత్‌తో సహా పలు దేశాల్లో ఏ మతాన్నైనా విశ్వసించే హక్కు ఉన్నప్పుడు, ఏ మతాన్ని విశ్వసించని హక్కు ఎందుకుండదో అర్థం కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజలు సంతోషంగా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన నార్వేలో మత విశ్వాసులకన్నా, మతాన్ని, దేవుళ్లని విశ్వసించని హేతువాదులే ఎక్కువ మంది ఉన్నారు. కమ్యూనిస్టు చైనాలో 40 నుంచి 49 శాతం మంది హేతువాదులున్నారు.
ఫ్రాన్స్‌లో ఐదొంతుల మంది హేతువాదులే. మత విశ్వాసాలు బలంగా కనిపించే అమెరికాలో 2014 లెక్కల ప్రకారం హేతువాదుల సంఖ్య ఏడు శాతం ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో హేతువాదులు ఒక శాతానికి మించి లేరు. ఏ మత విశ్వాసాన్నైనా ఆచరించే హక్కును కల్పిస్తున్న భారత లౌకిక వ్యవస్థ ఏ మతాన్ని విశ్వసించని హక్కును కల్పించలేక పోయింది. ఈ విషయంలో భారత కోర్టులు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి.
భారతీయుడు తన మతాన్ని వెల్లడించాల్సిందిగా ఒత్తిడిచేసే హక్కు భారత ప్రభుత్వానికి లేదంటూ ముంబై హైకోర్టు 2014లో తీర్పు చెప్పడం గుడ్డిలో మెల్లలాంటి పరిణామం. ఏడు శాతం హేతువాదులున్న అమెరికా ప్రభుత్వం వారి హక్కుల పరిరక్షిణకు, భద్రతకు ఓ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. అలాంటి బిల్లును మనకున్నట్లయితే నేడు ఫరూక్, అంతకుముందు గోవింద్ పన్సారే, ఎంఎంకే కల్బుర్గీ, నరేంద్ర దాబోల్కర్ లాంటి ప్రముఖ హేతువాదులు హత్యలకు గురయ్యేవారు కాదేమో!


