అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్
ఆనందీ బెన్ పటేల్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
అహ్మదాబాద్: గుజరాత్ లో ఆనందీ బెన్ పటేల్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు (నాన్ రిజర్వుడ్ కులాలు) చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గుజరాత్ దివస్ ను పుసర్కరించుకుని మే 1 నుంచి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే అమలవుతోన్న 49 శాతం మించబోదని, అగ్రవర్ణాల పేదలకు ప్రకటించిన 10 శాతం కోటా కూడా ఆ పరిథిలోనే అమలవుతుందని తెలిపింది.
రిజర్వేషన్ల కోసం పటీదార్ కులస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించడం, సమీప భవిష్యత్ లో ఆధిపత్య కులాలుగా కొనసాగుతున్న ఇంకొన్ని కులాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఆమోదంతోనే ఈ నిర్ణయం వెలువడినట్లు సమాచారం. ఇప్పుడు 49 శాతం రిజర్వేషన్లు పొందుతున్న కులాల ప్రయోజనాలకు కోతపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై భిన్నస్పందనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఏమేరకు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుందో వేచి చూడాలి.
అటు హరియాణాలోనూ జాట్ల డిమాండ్లకు తలొగ్గిన మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆ వర్గానికి విద్య, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఉన్నత వర్గాలుగా పేరుపొందిన కులాల్లోని పేదలు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కుతోన్న పరిస్థితుల్లో నిన్న హరియాణా, నేడు గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించిన నిర్ణయాలు ఉద్యమాలకు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉండటం గమనార్హం.


