తమిళనాట తెలుగు రారాజు విశాల్ | vishal create history in tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాట తెలుగు రారాజు విశాల్

Oct 19 2015 10:08 AM | Updated on Aug 28 2018 4:30 PM

తమిళనాట తెలుగు రారాజు విశాల్ - Sakshi

తమిళనాట తెలుగు రారాజు విశాల్

'మూడేళ్లుగా సమావేశాలు.. ఒక్కటే ప్రశ్న.. సమాధానం మాత్రం లేదు. కానీ, ఎన్నో అవమానాలు, తిట్లు, హేళనలు.. కానీ ఎలాంటి బాధలోకి కూరుకుపోలేదు.

'మూడేళ్లుగా సమావేశాలు.. ఒక్కటే ప్రశ్న.. సమాధానం మాత్రం లేదు. కానీ, ఎన్నో అవమానాలు, తిట్లు, హేళనలు.. కానీ ఎలాంటి బాధలోకి కూరుకుపోలేదు. మేమంతా కలిసికట్టుగా నిలబడ్డాం. దేవుడు మీద భారం వేశాం. సత్యం గెలుస్తుందని నమ్మాం.. రాజీపడే సమస్య లేదని నిర్ణయించుకుని ఎన్నికలకు వెళ్లాం. మార్పు అవసరం అని భావించాం' అని రెండు రోజుల కిందట ప్రముఖ తమిళ తెలుగు నటుడు విశాల్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.

పలు ఉద్రిక్తల నడుమ ఆదివారం దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు జరిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్లుగా అప్రతిహతంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నటుడు శరత్ కుమార్ ప్యానల్‌పై.. హీరో విశాల్ ప్యానల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి దెబ్బకొట్టింది. అయితే, ఈ విజయం అంత ఆషామాషీగా వచ్చింది కాదని రెండు రోజుల కిందటి విశాల్ ట్వీట్లను చూస్తే అర్థమవుతోంది. భాషకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని మనుషులకు ఇవ్వని తమిళ తంబీల్లో కొందరికి... విశాల్ అంటే గిట్టదని ఈ ఎన్నికలు చూస్తే తెలిసిపోయింది.

అందుకు ప్రధాన కారణం విశాల్ స్వతహాగా తెలుగువాడు. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి చెందిన విశాల్ కుటుంబం ఎప్పుడో తమిళనాడులో స్థిరపడింది. సినిమాల పరంగా విశాల్ వాళ్ల కుటుంబ ప్రభావం తమిళనాట సినీ పరిశ్రమలో తీసిపోనిది కాదు. విశాల్ తీసే ప్రతి సినిమా కూడా నేరుగా తమిళం నుంచే తెలుగులోకి విడుదలవుతుంది. పైగా తమిళనాడులో ఈ కుర్ర హీరోకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. అయితే, ఇప్పటి వరకు విశాల్కు ఎదురవ్వని కొత్త అనుభవం మాత్రం దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల ద్వారా ఎదురైనట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో విశాల్కు ప్రత్యర్థులుగా నిలిచిన శరత్ కుమార్ వర్గం... విశాల్ తెలుగువాడని, తమిళులకే మద్ధతివ్వాలని ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టినట్టు తెలిసింది. అందుకే ఈ ఎన్నికల ప్రారంభం నుంచి కూడా విశాల్ను రెచ్చగొట్టడం, భాషా పరంగా తమిళనాడు వ్యక్తివి కాదని అవమానించడం ఏకంగా ఆదివారం ఎన్నికలు జరిపే సమయంలో దాడికి పాల్పడి విశాల్ చేతిని గాయపరచడం వంటి దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

అయితే, గత పదేళ్లుగా ఈ ప్యానెల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శరత్ కుమార్ వర్గంతో చిరాకుపడిన తమిళ సినీ వర్గం విశాల్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొని ఆయనకు పట్టంగట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా యువ ఓటర్లంతా కూడా విశాల్ వెంటే ఉన్నారు. విశాల్ ప్యానల్ తరపున అధ్యక్షుడిగా పోటీ చేసిన కేరెక్టర్ నటుడు నాజర్.. శరత్‌పై 109 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్ 141 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారిగా మరో నటుడు కార్తి గెలుపొందారు. ఈ విజయంతో సినీ పరిశ్రమలోనే కాకుండా  రాజకీయ రంగంలో కూడా ప్రభావం చూపుతుందనే దానిలో సందేహం లేదు. మంచికి ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే కులం అని తమిళ సోదరులు కూడా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement