శ్రీనివాస్‌ మృతిపట్ల యూఎస్‌ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ మృతిపట్ల యూఎస్‌ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి

Published Fri, Feb 24 2017 9:08 AM

శ్రీనివాస్‌ మృతిపట్ల యూఎస్‌ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి

కన్సాస్‌: జాత్యహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్‌ కూచిబోట్ల మృతిచెందడంపై ఆయన పని చేస్తున్న కంపెనీ గార్మిన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. శ్రీనివాస్‌ మృతదేహాన్ని తరలించేందుకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని కూడా స్పష్టం చేసింది. అమెరికాలో జాతి వివక్ష నెత్తికెక్కిన ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ కూచిబొట్ల చనిపోగా మరో తెలుగు వ్యక్తి అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో వారు పనిచేస్తున్న గార్మిన్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లారీ మైనార్డ్‌ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కంపెనీ తరుపున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో మన ఏవియేషన్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోలోని పనిచేస్తున్న శ్రీనివాస్‌ కూచిబొట్ల దురదృష్టవశాత్తు కన్నుమూశాడు. మరో సహచరుడు అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అలోక్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. శ్రీనివాస్‌ మృతిపట్ల కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వారి కుటుంబాలకు ధైర్యంగా ఉండాలి. మేం వారికి అండగా ఉంటాం’ అని ఆ ప్రకటనతో తెలిపారు.

కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్‌ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌ అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. అలోక్‌ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరిలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్‌ గ్రిల్లట్‌ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు.

సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి..

అమెరికాలో జాతి విద్వేష కాల్పులు

 

Advertisement
Advertisement