ప్రజల ‘నగదు’ కష్టాలు తీర్చాలి
‘పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం అందుకు అనుగుణంగా నగదును బ్యాంకులకు పంపిణీ చేసి ప్రజలకు సమస్య లేకుండా చూసి ఉంటే బాగుండేది.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
- బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బుల్లేక అవస్థ పడుతున్నారు
- నిర్ణయం మంచిదే.. తగిన జాగ్రత్తలు తీసుకోవలసింది
- పెద్దనోట్ల రద్దు కష్టాలను ప్రతిపక్షనేతకు వివరించిన జనం
- వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన పలు టీడీపీ కుటుంబాలు
సాక్షి, కడప : ‘పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం అందుకు అనుగుణంగా నగదును బ్యాంకులకు పంపిణీ చేసి ప్రజలకు సమస్య లేకుండా చూసి ఉంటే బాగుండేది. ప్రస్తుతం ప్రజలంతా పనులు మానుకొని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి కైనా నగదును పూర్తిస్థాయిలో బ్యాంకులకు పంపించి ప్రజల కష్టాలు తీర్చాలి’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రా నికి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల చేరుకున్న జగన్‌ను క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రజలు కలుసుకుని పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇబ్బందుల గురించి వివరించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదేనని.. అదే సమయంలో కచ్చితంగా పూర్తిస్థాయిలో నగదు నిల్వలు బ్యాంకులకు పంపించి ఉంటే బాగుండేదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌లో మంచిరోజులు రానున్నాయని.. కొద్దిరోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మీరు నగదు కోసం పడుతున్న ఇబ్బందులు గమనించామని, ఆ సమస్యల పరిష్కారం కోసమే హర్తాళ్ వంటి కార్యక్రమాలు చేపట్టామని జగన్ తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్దకొమెర్లకు చెందిన సుమారు 50 కుటుంబాలు మంగళవారం జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరాయి. మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన పెద్దకొమెర్లకు చెందిన టీడీపీ నేత సిద్ధంరెడ్డి సంజీవరెడ్డితోపాటు మరిన్ని కుటుంబాలు నియోజకవర్గ ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీలోకి చేరాయి. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్య దర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేశారు.
ప్రజలకు జగన్ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు నిరసనగా సోమవారం నిర్వహించిన హర్తాళ్‌ను విజయవంతం చేసినందుకు వైఎస్ జగన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. హర్తాళ్‌లో పాల్గొన్న కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నింటికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


