ఆసక్తి రేపుతున్న కేసీఆర్, ఎర్రబెల్లిల భేటీ!
టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలవనున్నారు.
వరంగల్ : టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలవనున్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం హన్మకొండలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సమావేశానికి హాజరై పలు శాఖలకు సంబంధించి తన నియోజకవర్గంలోని పనులను ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అందుకు తగిన నిధులు కేటాయించాలని సీఎంను కోరారు.
‘సమీక్ష సమావేశంలో చర్చ సందర్భంగా అభివృద్ధి పనుల విషయంలో తనను కలిసి ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు’’అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. అయితే, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎం కేసీఆర్‌ను కలుస్తారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ మూడు రోజుల వరంగల్ జిల్లా పర్యటన బుధవారం మధ్యాహ్నం ముగియనుంది. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో కేసీఆర్ బస చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం అక్కడే సీఎంను కలవనున్నారు.


