ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం...! | andhra pradesh government change rules to disqualifying 8 MLAs | Sakshi
Sakshi News home page

ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం...!

Mar 15 2016 4:20 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం...! - Sakshi

ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం...!

ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఏం చేయాలి.

హైదరాబాద్ : ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఏం చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఊడిపోతే మళ్లీ గెలవడం కష్టమని భావించిన అధికార తెలుగుదేశం అడ్డదారులు వెతికింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏకంగా రూల్స్నే మార్చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  శాసనసభ నియమ నిబంధనలను క్షణాల్లో తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

ఇలా అధికార తెలుగుదేశం ప్రభుత్వం అడ్డదారులు తొక్కిన వైనం మొత్తాన్ని పరిశీలిస్తే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ ఫాం మీద ఎన్నికల్లో గెలిచి ఇటీవలి కాలంలో టీడీపీలోకి ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు స్పీకర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ వేదికగా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ ఆయనపై మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.

స్పీకర్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇచ్చినప్పుడు దానికి సభలో కనీసంగా 50 మంది సభ్యుల మద్దతు ఉందా అని సభాపతి సభలో పరిశీలిస్తారు. అలా 50 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తేలితే ఆ రోజు నుంచి 10 రోజుల తర్వాత దానిపై చర్చ చేపట్టాలి. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. పార్టీలు విప్ జారీ చేస్తే ఆ విప్ నకు అనుగుణంగా ఆయా పార్టీల సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరైనా విప్ ధిక్కరిస్తే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుంది.

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇలాంటి నోటీసుపై చర్చ చేపట్టాలంటే ముందుగా ఆ నోటీసుకు సభలో 50 మందికి తక్కువ కాకుండా మద్దతు ఉందా అన్న విషయాన్ని (మోషన్ ఫర్ లీవ్) స్పీకర్ సభలో పరిశీలించాలి. అయితే అదెప్పుడు చేయాలంటే... శాసనసభ నిబంధన 71 (2) సబ్ రూల్ (1) ప్రకారం నోటీసు ఇచ్చిన నుంచి 14 రోజుల తర్వాత ఏ రోజైనా దీన్ని చేపట్టాలి. 14 రోజుల తర్వాత ఆ నోటీసుపై సభలో 50 మంది సభ్యుల మద్దతు ఉందా లేదా అన్నది పరిశీలించాలి. కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తేలితే... లీవ్ గ్రాంట్ అయినట్టు ప్రకటిస్తారు. ఇకపోతే అసెంబ్లీ నిబంధన 72 (3) మేరకు లీవ్ గ్రాంట్ అయిన రోజు నుంచి 10 రోజుల్లోగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు చేపట్టాలి.

ఈ రెండు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే... అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులందరినీ చర్చ రోజున విధిగా సభకు హాజరుకావాలని విప్ జారీ చేస్తుంది. దాంతో పాటే చర్చలో పాల్గొని ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని కూడా విప్ జారీ చేస్తుంది. ఈ విప్ ను ధిక్కరించిన సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. 71 (2) ప్రకారం 14 రోజుల తర్వాత, నిబంధన 72 (3) లీవ్ గ్రాంట్ అయిన 10 రోజుల్లోపు చర్చ చేపట్టడానికి సమయం ఉంటుంది. కాబట్టి ఆయా పార్టీలు జారీ చేసిన విప్ సభ్యులందరికీ చేరడానికి వీలుంటుంది. విప్ అందిన తర్వాత ఇక సభ్యులు తప్పనిసరిగా సభకు హాజరుకావలసి ఉంటుంది.

ఇక్కడే టీడీపీ సర్కారు అడ్డదారులు వెతికింది. ఆ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేల పదవులకు గండి పడటం ఖాయం. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించకతప్పదు. ఇటీవలి కాలంలో తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కొనడానికి భయపడిన టీడీపీ దీన్ని తప్పించుకోవడానికి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఆ రూల్స్ నే తొలగించింది.

రూల్స్ను తొలగిస్తూ తీర్మానం

ఉపఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కష్టమని భావించిన టీడీపీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగానే చకచకా పావులు కదిపింది. మంగళవారం ఉదయం వైఎస్సార్ సీపీ నోటీసు ఇవ్వగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రోజులు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు చెప్పగానే ఆ నిబంధనలను మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు.

అనుకున్నదే ఆలస్యం మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత అవిశ్వాస తీర్మానం అంశాన్ని ప్రస్తావిస్తూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ నియమ నిబంధనల్లోని 71 (2), 72 (3), 73 లను తొలగిస్తూ ఒక తీర్మానం ప్రతిపాదించారు. దానిపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలు ఉదాహరణలతో సహా వివరించారు. నియమ నిబంధనలు ఏం చెబుతున్నారో వివరించారు.

 

తమ పార్టీ విప్ జారీ చేస్తే టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, అందుకే సమయం ఇవ్వకుండా, సమయం ఇవ్వాలని చెప్పే నిబంధనలను ఎత్తివేయడమేంటని జగన్ సూటిగా ప్రశ్నించారు. అయినప్పటికీ సభలో సంఖ్యా బలం ఉందన్న ఉద్దేశంతో ఆ రూల్స్ ను తొలగిస్తున్నట్టుగా మంత్రి తీర్మానం పెట్టడం, వాయిస్ ఓటుతో ఆ నిబంధనలు ఎత్తివేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం క్షణాల్లో ముగించారు. ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మంత్రి లేచి మాట్లాడుతూ, ఆ నిబంధనలు ఎత్తివేస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని కాబట్టి వెంటనే అవిశ్వాస తీర్మానం చేపట్టాలని పట్టుబట్టారు. అంతే చర్చ మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement