ఇడియట్ చంటిగాడు లోకల్

ఇడియట్ చంటిగాడు లోకల్ - Sakshi


  సినిమా వెనుక స్టోరీ

 ఒక్కోసారి ఫెయిల్యూర్ కూడా మంచి చేస్తుంది. ‘బాచి’ సినిమా ఫెయిల్యూర్ పూరి జగన్నాథ్‌ని బెంగళూరు దాకా తీసుకెళ్లింది. కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ ఫ్యామిలీతో క్లోజ్ అయ్యేలా చేసింది. అదెలా అంటే - ‘బాచి’ ఇక్కడ అట్టర్‌ఫ్లాప్. కానీ కర్ణాటకలో బాగా ఆడింది. కన్నడ రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఎవరో ఈ సినిమా చూసి, డెరైక్టర్ బాగా తీశాడని ఇంట్లోవాళ్లందరికీ చెప్పాడు. ఇంకేముంది... పూరీకి పిలుపొచ్చింది.

 

 కన్నడ రాజ్‌కుమార్ పెద్దబ్బాయ్ శివరాజ్‌కుమార్‌తో ‘యువరాజా’ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. అదే టైమ్‌లో రవితేజతో తెలుగులో ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ చేస్తున్నాడు పూరి. అక్కడో కాలు... ఇక్కడో కాలు. రెండు పడవల మీద కాళ్లేసినా ప్రయాణం మాత్రం సాఫీగానే జరిగింది. అక్కడ ‘యువరాజా’ హ్యాపీ. ఇక్కడ ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ హిట్.

 

 పూరి బిహేవియర్, స్పీడ్, టాలెంట్ కన్నడ రాజ్‌కుమార్‌కు విపరీతంగా నచ్చే శాయి. తను మామూలు దర్శకుడు కాదని ఆయనకు అర్థమైపోయింది. ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఆయన! రెండేళ్ల ఎదురు చూపులకు ఇతనే ఫుల్‌స్టాప్ పెట్టగలడని కన్నడ రాజ్‌కుమార్‌కు అర్థమైపోయింది.

   

 కన్నడ రాజ్‌కుమార్ మూడో కొడుకు పునీత్ రాజ్‌కుమార్. అతణ్ని హీరోగా లాంచ్ చేయాలి. రెండేళ్ల నుంచీ వినని కథ లేదు. పిలవని డెరైక్టర్ లేడు. వాళ్లకేదీ ఎక్కడం లేదు. ఆ టైమ్‌లో పూరి వాళ్లకు విపరీతంగా నచ్చేశాడు. పునీత్‌ని లాంచ్ చేసే ప్రపోజల్ పెట్టారు. పూరి మంచి స్వింగ్‌లో ఉన్నాడు. అప్పటికే ఓ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. కమిషనర్ కూతురితో కానిస్టేబుల్ కొడుకు ప్రేమా యణం. క్లాసూ మాసూ లవ్‌స్టోరీ. హీరో క్యారెక్టరైజేషనే ఈ స్క్రిప్టుకి గుండెకాయ.

 

 విజయవాడలో శ్రీను అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతనేం మాట్లాడినా తన పేరు చెప్పుకుని మాట్లాడుతుంటాడు. ఆ రోజు అతని బర్త్‌డే అనుకోండి. ‘ఈరోజు శ్రీనుగాడి బర్త్‌డే. మీకు తెలుసా?’ అనడిగేవాడు. దాన్ని బేస్ చేసుకునే పూరి ఈ కేరెక్టర్ డిజైన్ చేశాడు. కథ చెప్పడానికి పూరి బెంగళూరు వెళ్లాడు. రాజ్‌కుమార్ ఇంట్లో పూరీకి రాయల్ ట్రీట్‌మెంట్. ఓ గదిలో కూర్చోబెట్టారు తనని. అక్కడ ఫుల్ క్రౌడ్. ఏదైనా ఫంక్షన్ జరుగు తుందేమోననుకున్నాడు పూరి. కాస్సేపటికి కన్నడ రాజ్‌కుమార్ వచ్చి కూర్చున్నారు. పార్వతమ్మ, శివరాజ్‌కుమార్, పునీత్... అంతా అక్కడే ఉన్నారు.

 

 రాజ్‌కుమార్ చేయి పెకైత్తగానే రూమ్‌లో పిన్‌డ్రాప్ సెలైన్స్. ‘‘ఊ... కథ చెప్పండి’’ అన్నారు రాజ్‌కుమార్. పూరి కంగారుగా ‘‘వీళ్లందరూ ఎవరు సార్?’’ అనడిగాడు. ‘‘వీళ్లంతా నా ఫ్యామిలీ మెంబర్స్. కొడుకులూ కూతుళ్లూ అల్లుళ్లూ మనవళ్లూ మనవరాళ్లూ పనివాళ్లూ అందరూ ఉన్నారు. మా పునీత్‌ని లాంచ్ చేసే ప్రాజెక్ట్ మా ఫ్యామిలీకి ప్రెస్టీజ్ ఇష్యూ. అందుకే వీళ్లందరి అభిప్రాయం కావాలి’’ అని చెప్పారాయన.

 

 పూరీకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రపంచ సినీచరిత్రలోనే ఇంత పెద్ద స్టోరీ సిట్టింగ్ ఎప్పుడూ జరిగి ఉండదని పించింది. ఒక వ్యక్తికి కాదు... ఓ పెద్ద ఆడిటోరియమ్‌కి కథ చెప్పి ఒప్పించాలి. ఇదొక వింతైన విచిత్రమైన అనుభవం. ఏదైతే అది అయ్యిందిలే అనుకుని కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. రెండు గంటలు పిన్‌డ్రాప్ సెలైన్స్. కథ పూర్తయింది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఒకళ్లకొకళ్లు సైగలు మాత్రం చేసుకుంటున్నారు. కాస్సేపటికి రాజ్‌కుమార్ లేచి పూరీని హగ్ చేసుకుని, ‘‘వెరీగుడ్. చాలా బాగుంది. మా పునీత్‌ని మీరే హీరోగా లాంచ్ చేయాలి’’ అన్నారు.

 

 అప్పుడు పూరి రిలాక్స్ అయ్యాడు. దీన్ని రవితేజతో తెలుగులో చేద్దామని పూరి అప్పటికే ప్రిపేర్ అయ్యాడు. కానీ పునీత్ కోసం ముందే చేసేయాల్సి వచ్చింది. రవితేజ కూడా వెయిట్ చేస్తానన్నాడు. ‘‘ఏం పర్లేదు. ఇంకో ఏడాదైనా నీకోసం చూస్తా’’ అని చెప్పాడు చాలా కాన్ఫిడెంట్‌గా.పునీత్ హీరోగా ‘అప్పు’ స్టార్ట్ అయ్యింది. ఎంత స్పీడ్‌గా తీస్తున్నాడంటే అంత స్పీడ్‌గా తీస్తున్నాడు. ఇంకోపక్క తెలుగులో చేయడానికి కూడా ఏర్పాట్లు షురూ. ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ హిట్ కావడంతో ప్రొడ్యూసర్లు చాలామంది వస్తున్నారు. కానీ పూరీకి మాత్రం సొంతంగా చేసుకోవాలనిపించింది. ‘వైష్ణో అకాడమీ’ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశాడు.

 

 పూరీ వైష్ణోదేవి టెంపుల్‌కెళ్లినప్పుడు అక్కడి పూజారి, ‘ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుంద’ని చెప్పాడు. పూరి ఇలాంటివి నమ్మడు. పూజారితో అదే చెప్పాడు. పూజారి చాలాసేపు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ‘‘నేను ప్రొడ్యూసర్ కావాలను కోవడం లేదు. ప్రొడ్యూసరైతే మాత్రం వైష్ణో పేరుతోనే చేస్తాను’’ చెప్పాడు పూరి ఆ పూజారితో. అప్పటికి తాను నిర్మాత అవుతాననే ఆలోచన వన్ పర్సంట్ కూడా లేదు. కానీ పరిస్థితులు అలా డ్రైవ్ చేసి పూరీని ప్రొడ్యూసర్‌ను చేశాయి. బయటి ప్రొడ్యూసర్లు తనతో చేయాలనుకుంటే ఇందులో షేర్ ఇస్తాడంతే.

 

 పొలిటీషియన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ప్రాజెక్టులో పార్ట్‌నర్. కానీ ఆయన పేరుం డదు. సీహెచ్ పద్మావతి అని ఆయన శ్రీమతి పేరుంటుంది. ఆయన తరఫున ప్రొడక్షన్ అంతా ఎం.ఎల్.కుమార్ చౌదరి చూసుకుంటాడు. ఇదీ కమిట్‌మెంట్.కన్నడంలో ‘అప్పు’ సూపర్‌హిట్. పునీత్‌కి హీరోగా ఫస్ట్ సినిమాతోనే డిస్టింక్షన్. కన్నడ రాజ్‌కుమార్ ఖుష్ అయిపోయారు.‘‘నువ్వు నాకు నాలుగో కొడుకువయ్యా. నా కొడుకు లెవరూ నాకింత డబ్బు ఇవ్వలేదు. అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ’’ అని పూరీని మెచ్చుకున్నారు. హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌ని బెంగళూరులో చాలా గ్రాండ్‌గా చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫస్ట్ టైమ్ పాల్గొన్న కన్నడ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అదే. సినిమా చూసి పూరీకి హ్యాట్సాఫ్ చెప్పారు రజనీకాంత్.

   

 రవితేజతో ‘ఇడియట్’ సినిమా అనౌన్స్ చేశాడు పూరి. తిట్టుని టైటిల్‌గా పెట్టడమేంటని నెగటివ్ కామెంట్లు. ఆడియన్స్‌లో స్పెషల్ అటెన్షన్ కావాలంటే ఇలాంటి టైటిలే కావాలి. కథకు ఇదే యాప్ట్. పూరి ఇంతకుమించి ఆన్సర్ చెప్ప లేదు. ఈ టైటిల్‌కి క్యాప్షన్ - ‘ఓ శ్రీనుగాడి ప్రేమకథ’. రవితేజకు చంటిగాడు పేరంటే ఇష్టం. ‘సిందూరం’లో అతని పేరు అదే. రవితేజ కోరిక మేరకు హీరో పేరుని చంటిగాడుగా చేసేశారు. ‘అప్పు’లో చేసిన రక్షితనే తెలుగు వెర్షన్‌కు తీసుకున్నాడు. రక్షిత వాళ్ల నాన్నగారు గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్. రక్షిత తల్లి మమతా రావ్ కన్నడంలో హీరోయిన్. ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారా యణ తదితరులకు ఇంపార్టెంట్ రోల్స్.

 

 చక్రికి మ్యూజిక్ డెరైక్టర్‌గా మళ్లీ చాన్స్. శ్యామ్.కె.నాయుడుకు పూరి ఆస్థానంలో ఛాయాగ్రాహకునిగా చోటు. 2002 మార్చి 24న షూటింగ్ మొద లెట్టారు. హైదరాబాద్ దాటి వెళ్లకుండానే షూటింగ్ చేసేశారు. ఇందులో కీలకమైన మూడు ఫైట్స్ ఉన్నాయి. రవితేజ - టాస్క్‌ఫోర్స్ పోలీసులను కొట్టే ఫైట్, హెడ్ ఫైట్, మరో ఫైట్. ఈ మూడింటినీ సారథి స్టూడియోలోనే తీసేశారు. ఫైట్‌లో కాన్సెప్ట్ ఉంటే ఆడియన్స్‌కు లొకేషన్‌తో పనేముంటుంది! రెండు పాటల కోసం మాత్రం బ్యాంకాక్ వెళ్లారు. పూరీకి బ్యాంకాక్‌తో అటాచ్‌మెంట్ ఏర్పడటానికి బీజం ఇక్కడే పడింది.

 

 2002లో చిరంజీవి పుట్టినరోజునాడు ‘ఇడియట్’ రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్. రవితేజ క్యారెక్టరైజేషన్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మనసులో ఏదనుకుంటే అది చేసేయడం, ఎవరో ఏదో అనుకుంటారని సంకోచ పడకుండా ఉండటం... హీరో పాత్ర చిత్రణ చాలా కొత్తగా అనిపించింది. హీరో అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలని, స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా బిహేవ్ చేయాలని, వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్‌గా ఉండాలని, చాదస్తం - చేతకానితనం ఉండకూడదని పూరీ తనదైన శైలిలో హీరోయిజానికి కొత్త డెఫినిషన్ సెట్ చేసి పెట్టాడు.

 

 దీనికి రవి తేజ బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా సెట్ అయ్యింది. ఆ పాత్రకు రవితేజ మినహా వేరే ఆప్షన్ లేదన్నంతగా ఇన్వాల్వ్ అయి  చేశాడు. కెరీర్‌లో పెద్ద బ్రేక్ కోసం ఎన్నో యేళ్లుగా ఎదురుచూస్తున్న రవితేజకు గొప్ప యాక్సిలేటర్‌లాగా ‘ఇడియట్’ పనికొచ్చింది. అటు పూరి - ఇటు రవితేజ ఇన్నేళ్లపాటు బిజీబిజీగా ఉన్నారంటే, అదంతా ‘ఇడియట్’ పుణ్యమే.పెట్టుబడి 2.20 కోట్లు. రాబడి 20 కోట్లు. అంటే రూపాయికి పది రూపా యల లాభం. 45 ప్రింట్లతో రిలీజైన సినిమా వంద ప్రింట్లకు చేరుకుంది. 36 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది.

 

 ‘కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్’, ‘కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా?’, ‘రోజూ ఈ టైమ్‌లో ఇక్కడికొచ్చి సైటు కొడతానని తెలుసు కదా. వచ్చి నిలబడాలని తెలీదా?’ లాంటి డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. ‘చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే’ లాంటి పాటలు కూడా మార్మోగాయి. ‘ఇడియట్’ క్యారెక్టరైజేషన్ ఓ ట్రెండ్ సెట్ చేసేసింది.



ఇదే తరహాలో చాలా మంది స్క్రిప్టులు చేసేసుకున్నారు. ఇప్పటికీ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఇది. హిందీలో దీన్ని వివేక్ ఒబెరాయ్‌తో రీమేక్ చేయాలని సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ట్రై చేశారు. కుదర్లేదు. తమిళంలో హీరో శింబు ‘ధమ్’ (2003) పేరుతో రీమేక్ చేశాడు. ఇందులోనూ రక్షితే కథానాయిక. 2008లో బెంగాలీలో ‘ప్రియ అమర్ ప్రియ’ పేరుతో రూపొందింది. ఫెయిల్యూర్లు వస్తుంటాయి... పోతుంటాయి. పూరి మాత్రం కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఉన్నవాడి దగ్గరే సక్సెస్ కాపురం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్సే ‘ఇడియట్’ని సృష్టించింది.

 

 వెరీ ఇంట్రస్టింగ్

  ఈ కథను పవన్ కల్యాణ్‌కి చెప్పారు. మహేశ్‌కి వినిపించారు. తరుణ్‌నీ టచ్ చేశారు. చివరకు రవితేజతో తీశారు. ‘ఇడియట్’ నెగటివ్ ఎక్స్‌పోజర్ కేవలం 55 వేల అడుగులు  ఈ సినిమాలో రవితేజ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతానంటాడు. మళ్లీ ఆగిపోయి ‘నేను చచ్చిపోతే నువ్వెలా ఉండగలవే’ అంటాడు రక్షితతో. ఈ సీన్‌కి ‘పదహారేళ్ల వయసు’ సినిమా ప్రేరణ. అందులో చంద్రమోహన్ కూడా చచ్చిపోతానని చెప్పి, మళ్లీ శ్రీదేవి దగ్గరకొచ్చి ఇదే డైలాగ్ చెబుతాడు. దీన్నే పూరీ క్యాప్చర్ చేసి ఈ సినిమాలో వాడారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top