పతంజలి-మోహన్

పతంజలి-మోహన్


పురస్కార ప్రదానం

 

పతంజలి తన తొలి నవల ‘ఖాకీవనం’ను శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రిలకు అంకితం ఇచ్చాడుగానీ వాస్తవానికి ఆయన గురజాడ స్కూల్‌కి నిజమైన వారసుడు. కన్యాశుల్కంలో గిరీశం లెక్చర్ అంతా విన్నాక బండివాడు ‘అయితే మా వూరి పోలీసుకు ఎప్పుడు బదిలీ అవుతుంది’ అని అడుగుతాడు. ఒక రకంగా ఆ మాటకు కొనసాగింపే పతంజలి ఖాకీవనం. పోలీసు వ్యవస్థపై పతంజలి వేసిన ఇరవయ్యవ శతాబ్దపు అత్యుత్తమ చురక- ఖాకీవనం. దీని ఛాయ ఆయన కథ ‘చూపున్న పాట’లోనూ ఆ తర్వాత ‘పిలక తిరుగుడు పువ్వు’లోనూ కనిపిస్తుంది. పిలక తిరుగుడు పువ్వులో ఆఖరున పోలీసు ప్రభువు ఇలా అంటాడు- ‘ఆలమండ గ్రామస్తులందరికీ భూమి ఎలాగుందో అర్థం అయిందా లేదా? జాగ్రత్తగా వినండి. భూమి గుండ్రంగా లేదు. బల్లపరుపుగా కూడా లేదు. భూమి నా టోటీ లాగుంటాది. భూమి పోలీసోడి లాఠీ లాగుంటాది.’...



 ప్రపంచస్థాయి రచన చేయడంలో గురజాడ తర్వాత పతంజలి పేరు చెప్పాలి. పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, రచయితగా తన యాభై ఏడేళ్ల జీవితంలో పతంజలి సాధించిన అభివృద్ధి రేటు గమనించినా ఆయన పక్కన నంబర్ టు నంబర్ త్రీ అంటూ వేరే ఎవరినైనా నిలబెట్టడం కష్టం. గురజాడ ఒక గిరిశాన్ని చిత్రించి ఊరుకుంటే మనుషులందరిలో దాగిన గిరీశాల సామూహిక దర్శనం చేయించినవాడు పతంజలి. అందుకు ఉదాహరణ ‘గోపాత్రుడు’. భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా అంటూ ఆల్బర్ట్ కామూ స్థాయిలో ఒక తాత్విక విరోధాభాష సాధించినవాడు పతంజలి. లోకం మీద వ్యంగ్యపు అక్షౌహిణులను నడిపించి దుర్మార్గపు వ్యవస్థల మీద కురుక్షేత్ర యుద్ధం చేసిన సాహిత్య సరోత్తమ సేనాని ఆయన.



 మరి అలాంటి రచయిత మీద తొలి పురస్కారం ఎవరికిస్తాం? ఇంకెవరికి? చిత్రకారుడు మోహన్‌కే. రాతలో పతంజలి చేసిన పని చిత్రకారుడిగా మోహన్ గీతలో చేశాడు. కార్టూనిస్టుగా ఆయన రాజకీయ నాయకులకు పెట్టిన వాతలు, పోస్టర్లతో ఉద్యమాలకు ఊదిన ఊపిరులు, భిన్న సందర్భాలలో చేసిన రచనలు పతంజలి వలే మోహన్‌ను కూడా ప్రజల పక్షాన నిలబెట్టాయి. హాస్యం, వ్యంగ్యం అనే పచ్చి బెత్తాలతో వ్యవస్థను చక్కదిద్దే పని చేశాయి.



 అందుకే విశాఖలో ఉత్సవం. ఈ ఆదివారం (మార్చి 29) పతంజలి జన్మదినం సందర్భంగా విజయనగరంలో మోహన్‌కు పురస్కార ప్రదానం. ఈ సందర్భంగా ‘పతంజలి సాహిత్యావలోకనం’ పేరిట మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో సభ. విశాఖ మ్యూజియంలో 28, 29 తేదీలలో మోహన్ చిత్రాల ప్రదర్శన.



 ఒక రాతను తలచుకుని, ఒక గీతను నమస్కరించుకునే ఈ ఉత్సవానికి అందరికీ ఆహ్వానం.

 - రామతీర్థ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top