బాబూ హోదాపై ఆమరణ దీక్ష చేస్తారా: ముద్రగడ | mudragada challenge to andhra pradesh cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ హోదాపై ఆమరణ దీక్ష చేస్తారా: ముద్రగడ

Aug 4 2016 12:47 PM | Updated on Mar 23 2019 9:10 PM

బాబూ హోదాపై ఆమరణ దీక్ష చేస్తారా: ముద్రగడ - Sakshi

బాబూ హోదాపై ఆమరణ దీక్ష చేస్తారా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, ఆయన తనయుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడితే.. తాను కూడా వారితో పాటు దీక్షలో కూర్చుంటానని ముద్రగడ స్పష్టం చేశారు. దీనిని సవాల్గా తీసుకొని దీక్ష ప్రారంభించి కబురుపెట్టమని ఆయన చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

తాను చేపట్టిన దీక్షపై చంద్రబాబు తన శిష్యుల చేత తప్పుడు ప్రచారం చేయించారని ముద్రగడ విమర్శించారు. ఎవరు ఎన్నిరోజులు దీక్ష చేయగలరో పరీక్షకు నిలబడదామన్నారు. చంద్రబాబు ఈ సవాలును స్వీకరిచండం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు 'మన' శరిర పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి కూడా ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

కాపు రిజర్వేషన్ల కోసం.. తాను చేపట్టిన దీక్ష విరమించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ గడువు దగ్గరపడిందని ముద్రగడ గుర్తుచేశారు. సెప్టెంబర్ 7వ తేదీతో ఆ గడువు పూర్తవుతుందని, ఇంకా వంకలు పెట్టకుండా.. అసలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు. కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైందని చంద్రబాబు పదేపదే చెబుతున్నారని.. అయితే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టినప్పుడు ఆయనకు సున్నితమైనదనే విషయం తెలియదా అని ముద్రగడ ప్రశ్నించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. ఆర్థికంగా, సామాజికంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న కాపు జాతి కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ స్పష్టం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన లేఖలో కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement