గోదారి తల్లికి కోపమొచ్చిందా? | 27 dead, several injured in stampede at Godavari | Sakshi
Sakshi News home page

గోదారి తల్లికి కోపమొచ్చిందా?

Jul 15 2015 10:13 AM | Updated on Sep 3 2017 5:29 AM

గోదారి తల్లికి కోపమొచ్చిందా?

గోదారి తల్లికి కోపమొచ్చిందా?

జీవకోటి ప్రాణధారమైన గోదావరి తల్లికి ఏం కోపమొచ్చిందో కానీ.. గడిచిన రెండు నెలల్లో తన తీరంలో ఘోర మృత్యుఘోష మోగించింది.

  •  ధవళేశ్వరం ఘటన మరువకముందే.. పుష్కర దుర్ఘటన
  •  రెండు ఘటనలకు ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యమే కారణం
  • రాజమండ్రి :జీవకోటి ప్రాణధారమైన గోదావరి తల్లికి ఏం కోపమొచ్చిందో కానీ.. గడిచిన రెండు నెలల్లో తన తీరంలో ఘోర మృత్యుఘోష మోగించింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తుపాను వాహనం పడిన ఘటనలో 22 మంది మృత్యువాత పడగా.. తాజాగా పుష్కరఘాట్ వద్ద పుష్కర స్నానాలు చేసేందుకు వచ్చిన 27 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినా.. ఇంత పెద్ద మొత్తంలో మృత్యువాత పడడం ఇదే తొలిసారి. గోదావరికి భారీ వరదలు వచ్చిన సమయంలోనూ ఒకేచోట ఇంత పెద్ద విషాదాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవు. ఈ రెండు ఘటనలకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.  ఫలితంగా ఈ విషాద వికటట్టహాసాన్ని గోదావరి తీరం మూగబోయి చూసింది.
     
     గత నెల 13న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తుపాను వాహనం అదుపుతప్పిన ఘటనలో 22 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మూసయ్యిపేటకు చెందిన 22 మంది మృతిచెందారు. ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు ఈ ఘటనలో ప్రాణాలు విడవడం విషాదాన్ని నింపింది. డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినా.. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులకు మాత్రం అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం. బ్యారేజ్‌పై కనీసం పాడైపోయిన విద్యుత్ దీపాలనూ మరమ్మతులు చేయించకపోడంతో ఆ ప్రాంతంమంతా చీకటిగా మారడం, సకాలంలో ఆధునికీకరణ పనులు చేయక బలహీనంగా మారిన రెయిలింగ్‌ను ఢీకొట్టిన తుపాను వాహనం బ్యారేజ్ నుంచి కింద పడిపోయింది. తాజాగా జరిగిన పుష్కర దుర్ఘటన వెనుక కూడా అధికార యంత్రాంగం విఫలం కావడమే కారణం కావడం గమనార్హం.
     
     గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదం. 1991 పుష్కరాలకు కోనసీమలో పడవ బోల్తా కొట్టిన ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన కొంతమంది ఐ.పోలవరం మండలం కేశనకుర్రు వద్ద పుష్కర స్నానానికి వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తరువాత ఇదే పెద్ద ప్రమాదం జరగడం గమనార్హం. పుష్కరాల తొలి రోజే జరిగిన ఈ ఘటన పుష్కర సందడి లేకుండా చేసింది.
     

Advertisement
 
Advertisement
Advertisement