మేజర్ పంచాయతీలోని రాజుపాలెం గ్రామానికి వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త కంచర్ల శ్రీనివాసగౌడ్(37) బుధవారం రాత్రి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
► దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త
► రాత్రి వేళ హతమార్చిన ప్రత్యర్థులు
► టీడీపీకి చెందినవారే చేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
పొదిలి: మేజర్ పంచాయతీలోని రాజుపాలెం గ్రామానికి వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త కంచర్ల శ్రీనివాసగౌడ్(37)బుధవారం రాత్రి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన ఓ హోంగార్డు మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించడంత హత్య వెలుగులోకి వచ్చింది. పాత గొడవలకు తోడు ఇటీవల గ్రామంలో బొడ్రాయి ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తడంతో టీడీపీకి చెందినవారే ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.
బుధవారం రాత్రి పొదిలిలో జరిగిన ఓ వివాహానికి గౌడ్ హాజరై తిరిగి మోటారు సైకిల్‌పై రాజుపాలెం వెళుతున్నాడు. ఈక్రమంలో దారి కాచిన ప్రత్యర్థులు బాప్టిస్ట్‌పాలెం–రాజుపాలెం మధ్య సుమారు రాత్రి 10 గంటలు దాటిన తరువాత దాడి చేశారు. ముందుగా ఇనుపరాడ్‌తో కొట్టి, తదుపరి కత్తులతో పొడిచి చంపినట్లుగా భావిస్తున్నారు.
మిన్నంటిన రోదనలు
సంఘటనా స్థలంలో రోదనలు మిన్నంటాయి. భార్య, పిల్లలు, బంధువులు విలపిస్తున్న తీరు హృదయ విదారకంగా మారిది. మా శీనును ఒక్క సారి చూపించండయ్యా అంటూ సోదరి విలపించింది. మాకు దిక్కెవరంటూ భార్య, పిల్లలు రోదించారు. గ్రామస్తులను సమీకరించి సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకవెళ్లటంతో గౌడ్ ముందుంటారని మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు, పంచాయతీ వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు తెలిపారు.
డీఎస్పీ సందర్శన
సమాచారం తెలుసుకున్న దర్శి డీఎస్పీ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హత్యకు ఉపయోగించి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సభ్యులు వచ్చి వేలి ముద్రలు సేకరించారు. పోలీస్ జాగిలం మృతదేహం ఉన్న పరిసర ప్రాంతాల్లో సంచరించింది. సీఐ శ్రీనివాసరావు, కొనకనమిట్ల, మర్రిపూడి ఎస్సైలు బ్రహ్మనాయుడు, శ్రీహరిలు సంఘటనా స్థలంలో బందోబస్తు నిర్వహించారు. ఈ వార్త వేగంగా వ్యాప్తి చెందడంతో సంఘటనా స్థలానికి ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
కిరాయి హంతకుల పనేనా?
స్థానికులకు గౌడ్‌పై వ్యతిరేకత ఉన్నా, దాడి చేసి చంపేంత ధైర్యం చేయలేరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పక్కా పథకం ప్రకారం కిరాయి హంతకులను పురిగొల్పారని.. హత్య జరిగిన తీరు, వాడిన వస్తువుల ఆధారంగా చెబుతున్నారు. ఎక్కడికీ వెళ్లవద్దని సన్నిహితులు, బంధువులు గౌడ్‌ను హెచ్చరిస్తున్నారు. అయితే మొండి ధైర్యంతో ఉండే శ్రీను పట్టించుకోలేదని అందుకే రాత్రి వేళల్లో కూడా ఒంటరిగా రాక పోకలు సాగిస్తుంటాడని స్నేహితులు తెలిపారు. వివాహానికి హాజరైన దగ్గర నుంచి ఏ సమయంలో బయలు దేరింది, ఎంత సమయానికి అక్కడికి చేరేది అనే విషయాలను ప్రత్యర్థులు ఫోన్ ద్వారా హంతకులకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నేతల నివాళి
హత్యకు గురైన కంచర్ల శ్రీనివాసగౌడ్ మృతదేహాన్ని ప్రభుత్వం వైద్యశాలలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, కాంగ్రెస్ మార్కాపురం ఇన్ చార్జి ఎస్‌కే సైదా, సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షుడు డి. శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులరి్పంచారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డిలు సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు.
బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఎంపీపీలు కోవెలకుంట్ల నరసింహారావు, ఉడుముల రామనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, వైఎస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ వాకా వెంకటరెడ్డి, సర్పంచ్ చాగంరెడ్డి మాలకొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు, వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, మందలపు శ్రీనివాసరెడ్డి తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.


