బ్రేకింగ్స్‌ వేసి మరీ తప్పుడు కథనాలు...: బొత్స | TDP and Yellow media for creating rumours, says ysrcp leader botsa satyanarayana | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్స్‌ వేసి మరీ తప్పుడు కథనాలు...: బొత్స

May 8 2017 2:22 PM | Updated on Jul 28 2018 7:54 PM

బ్రేకింగ్స్‌ వేసి మరీ తప్పుడు కథనాలు...: బొత్స - Sakshi

బ్రేకింగ్స్‌ వేసి మరీ తప్పుడు కథనాలు...: బొత్స

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని  ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు, వైఎస్‌ఆర్‌ సీపీకి ముడిపెట్టి కొన్ని పత్రికలు, చానల్స్‌, కొంతమంది మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.  రామ జపంలా ఎప్పుడు జగన్‌ను, వైఎస్‌ఆర్‌ సీపీని విమర్శించడమే వారి పని అని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ సర్కార్‌ ... వాటిని గాలికి వదిలేసి ప్రతిపక్షంపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటనలో ఉంటే, ఓ చానల్‌లో జగన్‌, విజయసాయిరెడ్డి లోటస్‌ పాండ్‌లో చర్చిస్తున్నారని బ్రేకింగ్స్‌ వేశారన్నారు. కొన్ని చానల్స్‌ వాస్తవాలను ప్రజలకు చేరకుండా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

ఇక విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అందరికీ తెలుసని, ఒక పక్క ఉన్న కంపెనీలే వెనక్కి వెళ్లిపోతుంటే మరోవైపు పెట్టుబడులు వెల్లువ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ చేసిన విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకు వచ్చారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.  అమెరికా పర్యటనలో పెట్టుబడులు రావనే లోకేశ్‌ను చంద్రబాబు అక్కడకు తీసుకు వెళ్లలేదన్నారు. సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి లాంటి సీనియర్‌ మంత్రి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. సీఎం అమెరికా పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్న భయంతోనే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని బొత్స విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement