విజయవాడకు ‘తరలింపు’ ఆలస్యమే! | Andhra Pradesh rule transfers to Vijayawada delayed | Sakshi
Sakshi News home page

విజయవాడకు ‘తరలింపు’ ఆలస్యమే!

Sep 14 2014 3:34 PM | Updated on Mar 21 2019 8:18 PM

విజయవాడకు ‘తరలింపు’ ఆలస్యమే! - Sakshi

విజయవాడకు ‘తరలింపు’ ఆలస్యమే!

విజయవాడ నుంచి తాత్కాలిక పాలన సాగించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజయవాడ బ్యూరో: విజయవాడ నుంచి తాత్కాలిక పాలన సాగించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులోగా 11 శాఖలను హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలించడానికి ప్రభుత్వం తొలుత హడావుడి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఏ శాఖలకు ఎంత స్థలం కావాలి? ఎంత మంది సిబ్బంది ఇక్కడకు వస్తారు? అనే విషయాల్లో ఇప్పటిదాకా స్పష్టత లేదు. మరోవైపు ఉన్న పళంగా తరలిరావడానికి ఉద్యోగులు కూడా ఇష్టపడటం లేదు.

సీఎం చంద్రబాబు నాయుడు గత నెలలోనే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నెలాఖరుకు ఇక్కడినుంచి  కొన్ని కార్యాలయాలైనా పనిచేసేలా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందనరావును ప్రభుత్వం ఆదేశించింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని మేథ ఐటీ టవర్స్‌ను ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు పరిశీలించాలనీ, అలాగే నగరంలోని కొన్ని ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. దీంతో కలెక్టర్ మేథ టవర్స్‌లోని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయని ప్రభుత్వానికి నివేదించారు.

మిగిలిన 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కొంతమేరకు మరమత్తులు చేసుకుని తాత్కాలిక కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చని నివేదిక సమర్పించారు. దీంతోపాటు నగరంలోని కొన్ని భవనాలను అద్దెకు తీసుకునేందుకు గల అవకాశాలను కూడా ఆ నివేదికలో వివరించారు. రాజధాని నిర్మాణ సలహా కమిటీ చైర్మన్, మంత్రి పి. నారాయణ మేథ టవర్స్‌తోపాటు నగరంలోని ఒక ప్రైవేట్ భవంతిని పరిశీలించారు. ఆగస్టు నెలాఖరుకు కనీసం 11 రాష్ట్ర స్థాయి కార్యాలయాలను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి.

మరోవైపు గుంటూరులో సైతం ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను సైతం పరిశీలించి ఆ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సైతం ప్రభుత్వానికి మరో నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ వేగం తగ్గింది. దీంతో ఆగస్టు చివరినాటికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఒక్క కార్యాలయంకూడా విజయవాడకు తరలి రాలేదు. ప్రభుత్వం ఇటీవలే శాఖల వారీగా విజయవాడకు ఎంతమంది అధికారులు, ఉద్యోగులను తరలిస్తారు? కార్యాలయ నిర్వహణకు ఎంత మేరకు స్థలం అవసరమవుతుందని ఆయా శాఖల ఉన్నతాధికారులను వివరాలు అడిగింది.

విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయమై శనివారం ప్రభుత్వం ఆర్థిక శాఖముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబుతో కమిటీ వేసింది. ఈ కమిటీ 15 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని  నిర్దేశించింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇవ్వడం, దానిమీద అనేక అభ్యంతరాలు, పరిశీలనలు జరిగి, హైదరాబాదు నుంచి కార్యాలయాలు తరలిరావడానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
అధికారులు, ఉద్యోగుల నిరాసక్తత
విజయవాడలో ఎలాంటి వసతులు కల్పించకుండా విద్యా సంవత్సరం మధ్యలో తమను తరలించాలంటే ఎలా కుదురుతుందని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు నిరాసక్తి చూపుతున్నారు. రాజధాని వస్తుందనే ప్రచారంతో విజయవాడలో ఇంటి అద్దెలు, స్కూల్ డొనేషన్లు, ఫీజు లు విపరీతంగా పెరిగిన విషయాన్ని వారు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు.

విజయవాడను ఇప్పుడు రాజధానిగా ప్రకటించడంతో డబుల్ బెడ్‌రూం ఇంటి అద్దె కనీసం రూ 9 నుంచి రూ 10 వేలకు పెరిగి, నాలుగైదు నెలల అడ్వాన్సులు చెల్లించాల్సిన పరిస్థితిని వారు ఉన్నతాధికారుల వద్ద వెళ్లబోసుకుంటున్నారు. హైదరాబాదులో కుటుంబం ఉంచి, తాము విజయవాడలో పనిచేయడానికి కూడా ఉద్యోగులు ధైర్యం చేయలేకపోతున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో విజయవాడకు కుటుంబాన్ని మార్చలేమనీ, వచ్చే విద్యాసంవత్సరానికైతే వెళ్లే ప్రయత్నం చేస్తామని కొందరు ఉద్యోగులు సచివాలయంలోని తమ శాఖ సెక్రటరీలకు విన్నవించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయవాడలో మంత్రులు ఏర్పాటు చేసుకున్న విధంగా క్యాంప్ కార్యాలయాలను ఏర్పాటుచేసి వారానికి రెండు, మూడు రోజులు పనిచేసి రమ్మంటే దాని గురించి ఆలోచిస్తామని మరికొందరు ఉద్యోగులు తమ అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే తక్కువ అద్దెకు ప్రభుత్వమే నివాస గృహాలు సమకూర్చాలనే డిమాండ్‌ను వారు తెరమీదకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎలాంటి వసతులు కల్పించకుండా ఆగమేఘాల మీద విజయవాడకు వెళ్లాలంటే తమకు కూడా వీలుకాదని ఐఏఎస్ అధికారులు సైతం అసంతృిప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement