ఈ ఆదాయాలకు పన్ను లేదు... | Sakshi
Sakshi News home page

ఈ ఆదాయాలకు పన్ను లేదు...

Published Sat, Apr 8 2017 7:27 PM

ఈ ఆదాయాలకు పన్ను లేదు... - Sakshi

కొన్ని రకాల ఆదాయాలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరగతిలోకి వచ్చే ఆదాయాలను భారత ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 10లో చేర్చారు. అందులో కొన్ని...

వ్యవసాయ ఆదాయం: ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో ఆ రంగాన్ని ప్రోత్సహించడం కోసం.. వ్యవసాయం మీద వచ్చే ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించారు.

హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రాబడులు: హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్‌) సభ్యులుగా ఎవరైనా కుటుంబ ఆదాయం నుంచి అందుకున్న లేదా వారసత్వంగా పొందిన నగదుకు పన్ను మినహాయింపు ఉంది. హెచ్‌యూఎఫ్‌కు వేరుగా ఆదాయ పన్ను వర్తిస్తుంది.

పొదపు బ్యాంకు ఖాతాలో వడ్డీ ఆదాయం: బ్యాంకుల్లోని పొదపు ఖాతాల్లో వడ్డీగా ఆర్జించిన మొత్తంలో ఏటా రూ. 10 వేల మొత్తానికి పన్ను మినహాయింపు ఉంది. అయితే.. దీనిని ఇతర మార్గాల ఆదాయంగా చూపించి, సెక్షన్‌ 80టీటీఏ కింద మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

భాగస్వామ్య సంస్థ నుంచి వాటా: ఏదైనా భాగస్వామ్య సంస్థలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి.. సదరు సంస్థ మొత్తం ఆదాయంలో ఎంత వాటా పొందినప్పటికీ.. ఆ మొత్తానికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

దీర్ఘ కాలిక పెట్టుబడి రాబడులు: సెక్యూరిటీ లావాదేవీల పన్ను కట్టిన ఈక్విటీ షేర్లు, మూచ్యువల్‌ ఫండ్ల విక్రయం ద్వారా లభించే దీర్ఘ కాలిక పెట్టుబడి రాబడులకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. అంటే.. ఏడాదికి మించి కొనసాగించిన ఎటువంటి షేర్లనైనా విక్రయించడం ద్వారా పొందే లాభాల మీద ఎటువంటి పన్నూ లేదు.

విదేశీ సేవలకు భత్యం: భారత పౌరుడు ఎవరైనా సరే దేశం వెలుపల సేవలు అందించి, దేశం వెలుపల స్వీకరించే జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలకు ఆదాయ పన్ను లేదు.

గ్రాట్యుటీ ద్వారా ఆదాయం: ఒక సంస్థ తన ఉద్యోగి దీర్ఘ కాలిక సేవలకు గుర్తింపుగా చెల్లించే మొత్తం గ్రాట్యుటీ. ప్రభుత్వ ఉద్యోగులు పొందే గ్రాట్యుటీకి ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ప్రభుత్వేతర ఉద్యోగులకు మాత్రం.. చివరిసారిగా అందుకున్న వేతనం ప్రాతిపదికగా.. ప్రతి సర్వీసు సంవత్సరానికి 15 రోజుల వేతనం, లేదా రూ. 10 లక్షలు, లేదా అందుకున్న మొత్తం గ్రాట్యుటీ – ఈ మూడింట్లో ఏది తక్కువైతే దానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే.. పదవీ విరమణ సమయంలో గానీ, ఉద్యోగం నుంచి తొలగింపు సమయంలో కానీ, సదరు ఉద్యోగి మరణానంతరం అతడి కుటుంబ సభ్యులు కానీ ఈ గ్రాట్యుటీని అందుకున్నట్లయితే పన్ను ఉండదు.

స్వచ్ఛంద పదవీ విరమణ కింద అందుకున్న మొత్తం: స్వచ్ఛంద పదవీ విరమణ నిబంధనల్లోని 2బీఏ నిబంధన కింద స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని రూపొందించిన ఒక సంస్థ లేదా స్థానిక సంస్థలో స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా అందుకున్న మొత్తంలో రూ. 5 లక్షల వరకూ మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ఉపకార వేతనాలు, అవార్డులు: విద్యా ఖర్చు కోసం ఏ అర్హమైన విద్యార్థి అయినా అందుకునే ఉపకార వేతనం లేదా అవార్డులకు పన్ను లేదు. ఈ మినహాయింపు మీద ఎటువంటి గరిష్ట పరిమితీ లేదు.

ఎందుకు పన్ను కడుతున్నాం?

కొన్ని అవసరాలు వ్యక్తిగతమైనవి. కారు, బైకు వంటివి. మరికొన్ని అవసరాలు సామూహికమైనవి. అందరి కార్లు, బైకులు నడపడానికి అవసరమైన రోడ్లు వంటివి. ఇలాంటి సామూహిక అవసరాలు తీర్చేది ప్రభుత్వ ఖజానా. అది ప్రజల సామూహిక నిధి. దాని కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తారు. వ్యక్తులు తమ ఆదాయంలో కొంత వాటా ఈ నిధికి ఇస్తారు. ప్రతి ఒక్కరూ వస్తువులు కొన్నప్పుడు, వివిధ సేవలు పొందినప్పుడు అనేక రూపాల్లో పన్నుల కింద ఈ నిధికి కొంత మొత్తం జమచేస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ నిధిని నిర్వహిస్తూ.. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి దీనిని వెచ్చిస్తారు. అంటే.. ప్రజల అవసరాలు తీర్చే బాధ్యతను ప్రజలే ప్రభుత్వానికి అప్పగిస్తారు కానీ.. ప్రజల అవసరాలు తీర్చడం ప్రభుత్వ దాతృత్వం కాదు.

తప్పక చదవండి:మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం!

ఏమేం పన్నులు కడుతున్నాం? 

Advertisement
Advertisement