హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు

హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు - Sakshi

మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణల కేసు సృష్టించిన సంచలనం ఇంకా వీడిపోక ముందే మరో తమిళ నటి తనపై ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టి సంచలనం సృష్టించారు. తమిళంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, స్వయంగా హీరోయిన్ కూడా అయిన వరలక్ష్మి తనపై చోటుచేసుకున్న వేధింపుల విషయాన్ని వెల్లడించారు. తాను ఇటీవల ఒక టీవీ చానల్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అక్కడినుంచి బయటకు వచ్చేశానన్నారు. అతడు దారుణంగా మాట్లాడాడని, తనను వేధించాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిత్రసీమలో హీరోయిన్లపై కూడా వేధింపులు వెలుగు చూడటం దారుణంగా ఉందని తెలిపారు. ట్విట్టర్‌లో ఈ అంశంపై ఆమె ఒక భారీ లేఖ పోస్ట్ చేశారు. (వరలక్ష్మి లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)

 

అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందని, మహిళల భద్రత అనేది జోక్‌గా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. ఈ వెధవలను ఉరి తీయాలన్నారు. మళయాళ నటికి మద్దతు పలుకుతున్నానని, వాళ్లకు శిక్ష పడి తీరుతుందని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పెట్టిన సందర్భంలోనే ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఒక భారీ లేఖ రూపంలో ట్వీట్ చేశారు.  ఈ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అని రెండు రోజులుగా మధనపడుతున్నానని, చివరకు చెప్పి తీరాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ రాస్తున్నానని అన్నారు. 

 

 
ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో తాను సమావేశంలో పాల్గొన్నానని, ఒక అరగంట తర్వాత సమావేశం ముగుస్తోంది అనగా అతడు తనను ''మనం బయట ఎక్కడ కలుద్దాం'' అని అడిగాడని, ఏదైనా పని కోసమా అని తాను అడగ్గా.. కాదని, ఇతర విషయాల కోసమని అతగాడు అన్నట్లు ఆమె తెలిపారు. తాను కోపంగా అక్కడినుంచి వెళ్లిపోవాలని అతడికి చెప్పానన్నారు. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని, పరిశ్రమలోకి తాను శరీరాన్ని అమ్ముకోడానికి రాలేదని, మహిళలపై జరుగుతున్న దోపిడీ ప్రమాణాలను పాటించడానికి కూడా రాలేదని చెప్పారు. తనకు నటన అంటే ఇష్టమని, ఇలాంటి అఘాయిత్యాలను అడ్డుకుని, వాటిపై బయటకు మాట్లాడాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. పురుషులకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉందని, వాళ్లు మహిళలను అగౌరవపరచడం మానుకోవాలి లేదా బయటకు పోవాలని ఆవేశంగా ఆ లేఖలో వరలక్ష్మి రాశారు. 
 
తాను ఒక నటినని, వెండితెర మీద గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదరదని స్పష్టం చేశారు. తన జీవితం, తన శరీరం తన ఇష్టమని, ఏ మగాడూ కూడా తనను అగౌరవంగా చూసి సులభంగా వెళ్లిపోతానని అనుకోకూడదని వరలక్ష్మి అన్నారు. ఇది చిన్న విషయమని, ఏమీ జరగలేదని అనుకునేవాళ్లు కూడా ఉంటారని, అయితే ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మాత్రమేనని తెలిపారు. అదృష్టవశాత్తు తాను సురక్షితంగా బయటపడ్డాను గానీ, దీనివల్ల చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడే అవకాశం తనకు లభించిందని తెలిపారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాక.. అన్ని రకాల పరిశ్రమలు, ఆర్థిక పరిస్థితులు, సంస్కృతులు, వయసులో కూడా ఇలాంటి వేధింపులు ఉంటున్నాయని, మనది పురుషాధిక్య సమాజం కావడంతో మహిళలను వస్తువులుగా చూస్తూ అసమానతలు పెంచుతున్నారని ఆవేశంగా చెప్పారు. మహిళల భద్రత అనేది కేవలం ఒక కలగా మిగిలిపోయిందని, మన సమాజం నుంచి 'రేప్' అనే పదం ఎప్పటికీ తొలగిపోదా అని ఆమె ప్రశ్నించారు. తాను మౌనంగా ఊరుకునేది లేదని, తన స్నేహితులు, చెల్లెళ్లు కూడా మౌనాన్ని వీడాలని తెలిపారు. మీరు ఒంటరి కారని.. తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top