ఆ ఫొటోలు నావి కావు!

ఆ ఫొటోలు నావి కావు! - Sakshi


 రాధికా ఆప్టే... తెలుగు సినిమాల్లో చేస్తున్న తెలుగు తెలియని మరాఠీ నటి... రంగస్థలం నుంచి కళాత్మక సినిమా మీదుగా, కమర్షియల్ సినిమాలోనూ చకచకా అడుగులు వేస్తున్న నవతరం నాయిక. మొన్న రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘రక్తచరిత్ర’... నిన్న బాలకృష్ణ సరసన ‘లెజెండ్’... ప్రస్తుతం మళ్ళీ బాలకృష్ణ పక్కనే త్వరలో జనం ముందుకు రానున్న ‘లయన్’. ఇటీవలే వచ్చిన హిందీ చిత్రం ‘బద్లాపూర్’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారామె. మరాఠీ, హిందీ, తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూ పుణే, బొంబాయి, హైదరాబాద్, చెన్నైల మధ్య తిరుగుతున్న 29 ఏళ్ళ ఈ కథా నాయికతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ...

 

  తెలుగు సినిమాల్లో నటించడం ఎలా ఉంది?

 మొన్న మొన్నటి వరకు నాకు హిందీ, మరాఠీ చిత్రాలతో, కొద్దిగా తమిళ చిత్రాలతో పరిచయం. కానీ, ‘రక్తచరిత్ర’ దగ్గర నుంచి అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటించడం నాకు ఒక కొత్త అనుభవం. హిందీ, మరాఠీ సినిమాలతో పోలిస్తే, తెలుగు చిత్రాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి భాష, సంస్కృతి వేరు. అంతేకాకుండా, తెలుగులో నేను నటించిన ‘లెజండ్’, తాజా ‘లయన్’ లాంటివి ప్రధానంగా భారీ బడ్జెట్ చిత్రాలు. నేనేమో ఎక్కువగా సమాంతర చిత్రాలలో నటిస్తుంటా. కాబట్టి, కొత్త సంగతులు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇక్కడ పాత్రలను ఎలా తీర్చిదిద్దుతారు, ఈ సంస్కృతిలో ఏవి పాపులర్, ఏవి పాపులర్ కావు అని తెలుసుకుంటున్నా. పైగా, రంగస్థలం నుంచి వచ్చిన నటిగా సంస్కృతి అనేది సినిమానూ, సినిమా అనేది మన సంస్కృతినీ ఎంతగా ప్రభావితం చేస్తుందనేది అధ్యయనం చేయడానికి కూడా ఇది ఉపకరిస్తోంది.

 

 అసలింతకీ మీకు తెలుగులో తొలి అవకాశం ఎలా వచ్చింది?

 నిజానికి, మాది సినిమాలతో సంబంధం లేని కుటుంబం. మా నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు... మహారాష్ట్ర అంతటా పేరున్న న్యూరోసర్జన్. మా అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న ఎనస్థీషియన్. నేను, ఇద్దరు తమ్ముళ్ళు - మొత్తం ముగ్గురం. లండన్‌లో నృత్యం కూడా నేర్చుకున్న నేను రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగానికీ వెళ్ళాను. నా సినిమాలు చూసి, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సహాయకులెవరో చెప్పడంతో, ఆయన నన్ను ‘రక్తచరిత్ర’ సినిమాకు ఆడిషనింగ్‌కు పిలిచారు. అక్కడ ఎంపికవడంతో, తెలుగులోకి వచ్చా. ‘రంగీలా’, ‘సత్య’ లాంటి హిందీ చిత్రాల వల్ల ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆయన దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం.

 

  ముఠా కక్షల నేపథ్యంలోని ‘రక్త చరిత్ర’ నిజజీవిత వ్యక్తులు, ఘటనల ఆధారంగా తీసిన సినిమా కదా! మరి, మీకు ఏ విధమైన బెదిరింపులూ....!

 (చటుక్కున అందుకుంటూ...) అలాంటివేమీ నా వరకు రాలేదు. అయితే, ఆ చిత్ర కథ గురించి రామూ సార్ నాకు ముందుగానే వివరంగా చెప్పారు.

 

  మరి, హీరో బాలకృష్ణతో నటించడం ఎలా ఉంది?

 (మెరుస్తున్న కళ్ళతో...) ఆయనతో ఇది నా రెండో సినిమా. ‘రక్తచరిత్ర’ చూసిన ప్రకాశ్‌రాజ్ తమిళ - తెలుగు భాషల్లో ‘ధోనీ’ తీస్తూ నాకు అవకాశమిచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ ‘లెజెండ్’లో పాత్ర దక్కింది. ఆయన చాలా పెద్ద స్టార్. పెద్ద హీరో కుమారుడు. అయినప్పటికీ ఆయన తోటి నటీనటులతో కలసిపోయి, బాగా సహకరిస్తుంటారు. మా కాంబినేషన్‌లోని ‘లెజండ్’ సినిమా సూపర్‌హిట్టయింది. రానున్న ‘లయన్’ కూడా అంతే! ముఖ్యంగా ప్రతి డైలాగ్‌నూ ఎలా పలకాలో ఆయన స్పష్టంగా మనకు చెబుతారు. దీనివల్ల నేను డైలాగ్‌ను సరిగ్గా పలుకుతున్నా, అర్థం చేసుకుంటున్నా.

 

  మీకు తెలుగు రాదు కదా! మరి డైలాగులు చెప్పడం...?

 ప్రాథమికంగా నేను రంగస్థలం నుంచి వచ్చినదాన్ని కాబట్టి, నా తెలుగు డైలాగులన్నీ ముందుగానే దేవనాగరి లిపిలో రాసుకొని, కంఠస్థం చేస్తాను. వాటిని ఎలా పలకాలనే విషయంలో బాలకృష్ణ గారి సాయం చాలా ఉంది. అందుకే, వన్... టు... త్రీ... అని నంబర్లు చెబుతూ నటించడం కాకుండా, కష్టమైనా సరే ఒరిజినల్ డైలాగులు చెబుతూనే, నటిస్తున్నా. నా రంగస్థల అనుభవం కూడా అందుకు బాగా ఉపకరిస్తోంది.

 

  ఇంతకీ, ‘లయన్’లో మీ పాత్ర విశేషాలేమిటి?

 (నవ్వేస్తూ...) ఈ సినిమా ఒక థ్రిల్లర్, యాక్షన్ చిత్రం. అందరినీ ఆకట్టుకొనేలా ఉండే స్వీట్ అండ్ లవ్లీ పాత్ర నాది. పెపైచ్చు, కథలో కూడా కీలకమైన పాత్ర. ఊహించని మలుపులతో సాగుతుంది. అందుకే, ప్రస్తుతానికి నా పాత్ర వివరాలు సస్పెన్స్. రేపు తెర మీద చూస్తే, మీకే అర్థమవుతుంది.

 

  ప్రతి సినిమాలో ఇద్దరేసి నాయికల్లో ఒకరుగా నటిస్తున్నారే?

 ‘లెజండ్’లో నాకూ, మరో హీరోయిన్ సోనాలీ చౌహాన్‌కూ మధ్య కాంబినేషన్ సీన్లు లేవు. ‘లయన్’లో మాత్రం నేను, నటి త్రిష కలసి ఒక సీన్‌లో నటించాం. అలాగే, మేమిద్దరం కలసి ఒక పాటలో నర్తిస్తాం. నా పాత్రకున్న ప్రాముఖ్యం కీలకం కానీ, సినిమాలో ఇద్దరు హీరోయిన్లం ఉంటే నాకేంటి! పైగా, సెట్స్‌పై మాటలు కలబోసుకోవడానికి మరో నటి ఉండడం మరీ హ్యాపీ కదా!

 

 రంగస్థలం మీద మీకు చాలా అనుభవమే ఉన్నట్లుంది!


 ఇప్పటికి 13 - 14 ఏళ్ళుగా రంగస్థలంతో నాకు అనుబంధం. మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించా. మా ఊరు పుణేలో చాలా నాటక సంస్థలతో కలసి పనిచేశా. ముఖ్యంగా ‘ఆసక్త’ అనే రంగస్థల బృందంతో ఎక్కువగా పనిచేశాను. పుణేలోని ‘బాల గంధర్వ’ లాంటి ప్రసిద్ధ వేదికలపై ప్రదర్శనలిచ్చా.  ఇప్పటికీ రంగస్థలమంటే నాకు ప్రేమ. అలాగే, సమాంతర చిత్రాల్లో నటించడం కూడా! తమిళంలో ‘ధోనీ’, ‘ఆల్ ఇన్ ఆల్ అళగురాజా’, ‘వెట్రిసెల్వన్’, ’ఊలా’ మొదలైన సినిమాల్లో చేశా.

 

  దర్శకుడు ప్రకాశ్‌రాజ్‌తో తమిళంలో పనిచేయడం గురించి?

 ప్రకాశ్‌రాజ్ మంచి నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా. అందరూ అనుకుంటున్నట్లు ఆయన మరీ కఠినమేమీ కాదు. ఆయనతో పనిచేయడంలో చాలా ఫన్ ఉంది. కాకపోతే, ‘ధోనీ’ చిత్రాన్ని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో తీయడంతో, వెంట వెంటనే రెండు భాషల్లో డైలాగులు చెబుతూ, నటించడం కొద్దిగా శ్రమ అనిపించింది. అయితేనేం, ఆయన భార్య పోనీ, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.

 

  నట - దర్శకుడు అమోల్ పాలేకర్ సినిమాలో నటించిన అనుభవం మాటేమిటి?

 ఆయనను మంచి స్నేహితుడిగా భావిస్తా. మధ్యతరగతి మనస్తత్వాల్ని ప్రతిబింబిస్తూ ఆయన నటించిన ‘చిత్‌చోర్’ లాంటి అనేక సినిమాలన్నా, ఆయన అన్నా నాకు పిచ్చి ఇష్టం. రంగస్థలంపై కూడా ఆయన కృషి చాలా ఉంది. నాటకరంగంలో ఆయన మాకు ఎంతో అండగా నిలిచారు. పుణేలో రంగస్థల ఉత్సవం కూడా చేశారు. ఆయన తీసిన ‘సమాంతర్’ సినిమా నా కెరీర్‌లో ఒక మరపురాని అనుభవం.

 

  మీ తాజా హిందీ చిత్రం ‘బద్లాపూర్’కు మంచి పేరు వచ్చినట్లుంది!

 అవును. శ్రీరామ్ రాఘవన్ అద్భుతమైన దర్శకుడు. వాస్తవికతను ప్రతిబింబించేలా చాలా మంచి సినిమా తీశారు. దాదాపు రెండేళ్ళు నేను విరామం తీసుకున్న తరువాత, చేసిన ఈ సినిమా మళ్ళీ నాకు అందరిలో మళ్ళీ గుర్తింపు తెచ్చింది.

 

  ఆ సినిమాలో డైలాగులు, సన్నివేశాల మీద, సెన్సార్ మీద విమర్శలూ వచ్చాయి!

 నేను ఆ విమర్శల్ని అంగీకరించను. అంతెందుకు! చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోకుండా, కొన్ని మాటలను సినిమా డైలాగుల్లో నుంచి నిషేధించాలంటూ ఇటీవలే కొత్త కేంద్ర సెన్సార్ బోర్డ్ చేసిన ప్రయత్నం చాలా హాస్యాస్పదం. వాళ్ళంతా పాత రాతియుగంలో ఉన్నట్లనిపిస్తోంది. మారుతున్న సమాజం, పరిస్థితుల్ని పట్టించుకోని మన సెన్సార్ వ్యవస్థ తిరోగమన దృక్పథంతో వ్యవహరిస్తోంది.

 

  ఈ నేపథ్యంలో నిర్భయ కేసులోని నేరస్థుడి ఇంటర్వ్యూతో వచ్చిన ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?

 నేను ఆ డాక్యుమెంటరీ మొత్తం చూశాను. అందులో మనకు తెలియనిదీ, మన సమాజంలో లేనిదీ - ఏదీ అందులో లేదు. అన్నీ అందరికీ తెలిసినవే, చూస్తున్నవే. అయినప్పటికీ, దాన్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించడమెందుకో నాకు అర్థం కాదు. దేశంలో ఉన్న జనాభా సమస్య, నిరుద్యోగం, నిరక్షరాస్యత, స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం లాంటి సమస్యల పరిష్కారం ఆలోచించకుండా, వాస్తవాన్ని ఎత్తిచూపిన డాక్యుమెంటరీని నిషేధించడంలో విజ్ఞత ఏముంది!

 

  స్త్రీ పురుష అసమానత్వం సినీ రంగంలోనూ ఉందిగా!

 (కాస్త ఆవేశంగా) పారితోషికం, పాత్రచిత్రణ ఇలా అన్నింటిలో ఇక్కడ హీరోకు ఉన్న ప్రాధాన్యం హీరోయిన్‌కు ఎక్కడ ఉంటుంది! ఆ మాటకొస్తే,.. అసమానత్వం లేనిదెక్కడ! రంగస్థలం... సినిమా... చివరకు జర్నలిజమ్‌లో కూడా ఉంది. పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న మసాలా సినిమాల కన్నా ప్రత్యామ్నాయ సినిమాల్లో నేను ఎక్కువగా నటించేది అందుకే! కాకపోతే, పాటలు, ఫైట్లతో ఆడవాళ్ళను అందంగా, సంప్రదాయానికి కట్టుబడినట్లు చూపించే మాస్ సినిమాలు చేస్తే నటిగా కమర్షియల్ వ్యాల్యూ వస్తుంది. దాని వల్ల మనం ప్రత్యామ్నాయ సినిమాలు నటించినప్పుడు, అవి ఎక్కువ మందికి చేరతాయి.



  ఆ మధ్య మీ ఫోటోలంటూ... నగ్నంగా ఉన్న స్వీయచిత్రాలు (సెల్ఫీలు) కొన్ని నెట్‌లోకి వచ్చిన వివాదం గురించి...!

 (మధ్యలోనే అందుకుంటూ...) చూడండి. ఆ ఫోటోలు నావి అని మీరనుకుంటున్నారా? నావి కావు. ఇవాళ ఎవరి ఫోటోలైనా మార్ఫింగ్ చేసి పెట్టేస్తున్నారు. (కాస్త కోపంగా...) అయినా ఆ పెట్టినవాణ్ణి వెళ్ళి అడగండి. ఇలాంటి చౌకబారు ప్రయత్నాల గురించి పట్టించుకోకుండా వదిలేయాలే తప్ప, వాటి గురించి మాట్లాడి నా సమయం వృథా చేసుకోను.

 

  ఇలాంటి వార్తలొచ్చినప్పుడు సున్నిత హృదయులెవరైనా బాధపడతారు కదా!

 అలా బాధపడడం వల్ల ఉపయోగం లేదు. అయినా, నేనే కాదు... తెలివైనవాళ్ళెవరూ అవాస్తవ ప్రచారం గురించి బాధపడరు, పడకూడదు.

 

  బ్రిటీష్ -ఇండియా కో-ప్రొడక్షన్ సినిమాలో పాత్ర మీకొచ్చినట్లుంది!

 అవును. పేరు - ‘బొంబేరియా’. ఏప్రిల్ నుంచి బొంబాయిలో షూటింగ్ మొదలవుతుంది. అలాగే, మరో రెండు చిత్రాలు హిందీలో ఒప్పుకున్నా. వాటి వివరాలు మార్చి చివరలో చెబుతా.

 

 మీకు పెళ్ళయిపోయిందని విన్నాం!

 అవును. (అప్పుడే అక్కడకు వచ్చిన భర్త బెనెడిక్ట్ టేలర్‌ను పరిచయం చేస్తూ...) ఈయనే! మంచి మ్యుజీషియన్, మ్యూజిక్ డెరైక్టర్ కూడా! బొంబాయిలో, ప్రధానంగా లండన్‌లో ఎక్కువగా పనిచేస్తుంటారు. మా ప్రేమ, పెళ్ళి కథ చాలా పెద్దది. అది మరోసారి పాఠకులతో పంచుకుంటా!

 - రెంటాల జయదేవ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top