'మేం ఎవర్నీ టార్గెట్‌ చేయట్లేదు.. అర్ధం చేసుకోండి'

'మేం ఎవర్నీ టార్గెట్‌ చేయట్లేదు.. అర్ధం చేసుకోండి' - Sakshi


హైదరాబాద్‌: సినిమా పరిశ్రమను టార్గెట్‌ చేశారనడం సరికాదని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ అన్నారు. సినిమా వాళ్లనే టార్గెట్‌ చేసి తెలంగాణ ప్రభుత్వం విచారణ చేయిస్తుందని వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్‌శాఖ తరుపున వివరణ ఇచ్చారు. ఈ కేసు చాలా సున్నితమైనదని చెప్పిన చంద్రవదన్‌.. తాము ఎవర్నీ టార్గెట్‌ చేయడం లేదని అన్నారు. చిన్నారులపైకి సైతం ఎగబాకిన డ్రగ్స్‌ మహమ్మారి సమాజంపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు.



భావితరాల వారిని కాపాడే ఉద్దేశంతోనే ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ చాలా జాగ్రత్తగా అన్ని రకాల సాంకేతిక విషయాలు చూసుకుంటూ విచారణ జరిపిస్తున్నారని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. పిల్లలు బలైపోతున్నారని చెబుతున్నా ఎక్సైజ్‌ శాఖ విశ్వసనీయతను దెబ్బకొట్టేలా మాట్లాడటం, విచారణను వక్రీకరించడం సరికాదని చెప్పారు. డ్రగ్స్‌ వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రి నుంచి తమకు చాలా సీరియస్‌గా ఆదేశాలు అందాయని ఆ మేరకే ముందుకు వెళుతున్నామని తెలిపారు. విచారణకు వచ్చిన సినీ ప్రముఖులు తమకు సహకరిస్తున్నారని, మంచి వాతావరణంలో విచారణ జరుగుతోందని అన్నారు.



సాంకేతిక విషయాలు, అన్ని రకాల మెథడ్స్‌ ఫాలో అవుతూ ప్రశ్నిస్తున్నందునే కాస్తంత ఆలస్యం అవుతోందని, అది విచారణలో భాగమే తప్ప ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దర్యాప్తు కాదని స్పష్టం చేశారు. మీడియా కూడా తమకు సహకరించాలని, ఎక్సైజ్‌శాఖ ధైర్యాన్ని దెబ్బకొట్టేలాగా వ్యవహరించొద్దని, ఈ కేసు పిల్లలు సైతం బలవుతున్నంత ప్రమాదకరంగా ఉన్నందున అందరి సహకారం అవసరం అని కోరారు. మరోపక్క, శనివారం నాటి విచారణకు సిట్‌ అధికారుల ముందుకు తరుణ్‌ రాగా, ఆయా పబ్‌ యాజమాన్యాలు కూడా విచారణకు హాజరయ్యాయి. వీరి ప్రమేయం డగ్ర్స్‌ వ్యవహారంలో ఉంటే చర్యలు కఠినంగా తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top