మారుతీ కారు ధరలు తగ్గాయి..
జీఎస్టీ ప్రభావంతో కార్ల ధరలు కిందకి దిగొస్తున్నాయి.
న్యూఢిల్లీ : జీఎస్టీ ప్రభావంతో కార్ల ధరలు కిందకి దిగొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కార్ల ఎక్స్‌షోరూం ధరలన్నింటి పైనా 3 శాతం వరకు ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ధరల తగ్గింపు వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుందని, జీఎస్టీకి ముందున్న వ్యాట్‌ను బట్టి తగ్గింపు ధరలు భిన్నంగా ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
వాహనాలపై జీఎస్టీ రేట్ల మొత్తం ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో తమ కారు మోడల్స్‌పై ధరలను తగ్గించినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. అదేవిధంగా హైబ్రిడ్ వాహనాలపై పన్ను రాయితీలను మినహాయించుకున్న నేపథ్యంలో స్మార్ట్ హైబ్రిడ్ సియాజ్ డీజిల్, స్మార్ట్ హైబ్రిడ్ ఎర్టిగా డీజిల్ ధరలు పెరుగుతున్నట్టు మారుతీ సుజుకీ చెప్పింది. ఈ కొత్త ధరలు కూడా నేటి(శనివారం) నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది.