
పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ సమావేశం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన ప్లీనరీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. టీడీపీ పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ఎన్నికల వరకూ ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్లీనరీలో సిద్ధం చేయాలని నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. త్వరలో మరోసారి ప్లీనరీ ఏర్పాట్ల సమీక్షపై నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. గుంటూరు - విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఎంపిక చేసిన స్థలంలో జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.