జల్లికట్టు వేండమా, నిషేధం వేండమా? | Sakshi
Sakshi News home page

జల్లికట్టు వేండమా, నిషేధం వేండమా?

Published Wed, Jan 18 2017 7:18 PM

జల్లికట్టు వేండమా, నిషేధం వేండమా? - Sakshi

చెన్నై: ‘వేండమ్‌ వేండమ్‌ జల్లికట్టు వేండమ్‌’ నినాదాలతో మెరీనా బీచ్‌ హోరెత్తిపోతోంది. లక్షలాది మందితో  ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. చిన్నా పెద్ద, బడి పిల్లలు, యూనివర్శిటీ విద్యార్థులు ప్లేకార్డులు పట్టుకొని ‘కావాలి కావాలి జల్లికట్టు కావాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తేసేవరకు అక్కడి నుంచి కదలమంటూ వారు భీష్మించుకు కూర్చున్నారు. బీచ్‌ ఒడ్డున నిరసన కోసం మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ప్రజల రాక క్రమంగా పెరగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిన్న రాత్రి చేరుకున్న ప్రజలు బీచ్‌ ఒడ్డునే ఉండిపోగా ఎప్పటికప్పుడు కొత్త వారు వచ్చి చేరుతున్నారు. అక్కడి నుంచి ప్రజలను పంపించేందుకు మంగళవారం రాత్రి బీచ్‌ ఒడ్డున పోలీసులు విద్యుత్‌ దీపాలను ఆర్పేసినా, వారు కదలకుండా అక్కడే ఉండి తమ సెల్‌ఫోన్‌ లైట్లతో నిరసన తెలిపారు.

సుప్రీం కోర్టు వాస్తవానికి తమిళనాడులో జల్లికట్టును 2014 లోనే నిషేధించింది. అప్పటి నుంచి అప్పీళ్ల మీద అప్పీళ్లు కొనసాగుతున్నాయి. 2015లో ఓ అప్పీల్‌పై నిషేధం సక్రమమేనంటూ తీర్పు చెప్పింది. మొన్న నవంబర్‌లో ఇది ‘ఇది గ్లాడియేటర్‌’ తరహా ఆటవిక క్రీడా అని కూడా వ్యాఖ్యానించింది. నిషేధం ఎత్తివేస్తూ తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుపై ఒత్తిడి పెరిగింది. పొంగల్‌ లోపల తీర్పు ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈసారి ఎలాగైనా జల్లికట్టు జరిగేలా చూస్తానంటూ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకరావాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు.



అనుమతి లేకపోయినా మధురై, సివంగ ప్రాంతాల్లో ప్రజలు జల్లికట్టు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మధురైకి సమీపంలో అలంగలూరు వద్ద 500 మంది రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఒక్కసారికా జల్లికట్టుకు అనుకూలంగా నిరసన ఉప్పొంగింది. సుప్రీం కోర్టు నిషేధాన్ని సమర్థించినందుకు ‘పెటా’ సంస్థను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఓ ముఖ్యమంత్రి, ఓ చిన్నమ్మ మీరెక్కడా?’ అంటూ నిలదీస్తున్నారు.  రైతులు ప్రజలతోపాటు నాయకులు, మీడియా జల్లికట్టు వివాదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

తమిళనాడులో ముఖ్యంగా కావేరి డెల్టా ప్రాంతంలో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితులను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఈశాన్య, నైరుతి రుతుపవనాలు విఫలమవడంతో వ్యవసాయం సాగు భారీగా పడిపోయింది. పర్యవసానంగా ఇప్పటికే 144 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, కూలి దొరక్కా వ్యవసాయ కూలీలు పస్తులుంటున్నారు. మైక్రోఫైనాన్సర్ల కబంధ హస్తాలో ఇరుక్కుంటున్నారు. మంచి, చెడు విచక్షణ లేకుండా సంప్రదాయాల కోసం సమైక్యమయ్యే ప్రజలు నిజమైన సమస్యలపై ఎప్పుడు తిరగబడతారో!












Advertisement
Advertisement