సుకేష్‌.. చాలా సుఖ పురుషుడు! | Sakshi
Sakshi News home page

సుకేష్‌.. చాలా సుఖ పురుషుడు!

Published Mon, Apr 17 2017 7:05 PM

సుకేష్‌.. చాలా సుఖ పురుషుడు!

అది దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్. అందులోని ఓ గదిలో సుకేష్‌ చంద్రశేఖర్‌ చాలా తాపీగా కూర్చున్నాడు. అంతలో ఉన్నట్టుండి అక్కడకు పోలీసులు వచ్చారు. వాళ్లు వచ్చే సమయానికి అతడి చేతికి రూ. 6.5 కోట్ల విలువైన బ్రేస్‌లెట్‌ ఉంది. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీటీవీ దినకరన్‌ తరఫున ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చేందుకు బెంగళూరుకు చెందిన చంద్రశేఖర్‌ ఢిల్లీకి వచ్చాడని ఆ తర్వాత విచారణలో తేలింది. తమ పార్టీకి రెండాకుల గుర్తు వచ్చేందుకు 50 కోట్ల వరకు ఇవ్వడానికి తాను సిద్ధమని దినకరన్‌ చంద్రశేఖరన్‌కు చెప్పినట్లు తెలిసింది.

నగరంలో నల్లధనం గురించి తమకు సమాచారం రావడంతో తాము సోదాలు చేసి, చంద్రశేఖర్‌ను అరెస్టు చేశామని, కానీ ఇది ఇంత పెద్ద కేసన్న విషయం ఆ తర్వాత తెలిసిందని పోలీసులు కూడా అంటున్నారు. ఢిల్లీలో పని మొదలుపెట్టడానికి ముందుగా రూ. 10 కోట్లు సుకేష్‌కు ఇచ్చారని సమాచారం. అయితే, ఎన్నికల కమిషన్‌ అధికారుల వద్దకు ఈ లంచం ప్రతిపాదన ఏమైనా వెళ్లిందా లేదా అనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. ఢిల్లీలో పోలీసులు పట్టుకునేసరికి సుకేష్‌ లూయిస్‌ విట్టన్‌ చెప్పులు వేసుకున్నాడు. అతడి మీద చెన్నై, బెంగళూరు నగరాల్లో 12 కేసులున్నాయి. వాటిలో మోసం, ఫోర్జరీ.. ఇలా రకరకాలవి ఉన్నాయి. ఢిల్లీలో చాలా ఫ్యాన్సీ ఫాంహౌస్‌లు ఉన్నాయి. అతడి నెట్‌వర్క్ చాలా పెద్దదని, దినకరన్‌కు ఇతడు నాలుగేళ్లుగా తెలుసని పోలీసుల సమాచారం.

సుకేష్‌ చంద్రశేఖర్‌ ఇంటర్మీడియట్‌తోనే చదువు ఆపేశాడు. 17 ఏళ్ల యవసులో తొలిసారిగా ఒక స్కాంలో ఇతగాడి పేరు బయటకు వచ్చింది. తన సొంత ఊళ్లో బ్రోకర్‌గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అప్పటికి మైనర్‌ కావడంతో అరెస్టు చేయలేకపోయారు. కానీ ఏడాది తర్వాత సరిగ్గా అదే పద్ధతిలో చెన్నైలో పెద్ద వ్యవహారం చేస్తూ దొరికేసి, కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్‌ తెచ్చుకున్నాడు. తర్వాత ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు. నకిలీ బీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3 వేల కోట్లు సంపాదించాడు. తనను తాను ఎంపీగా చెప్పుకోడానికి నకిలీ ఐడీ కార్డులు కూడా వాడేవాడట! అతడి దగ్గర సీజ్‌ చేసిన ఒక బీఎండబ్ల్యు, ఒక మెర్సిడిస్‌ కార్ల మీద 'మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్' అనే స్టిక్కర్లు లైసెన్సు ప్లేట్ల మీద ఉన్నాయి.

తమిళ నటిని పెళ్లాడి...
మద్రాస్‌ కేఫ్‌, బిర్యానీ లాంటి సినిమాల్లో నటించిన లీనా మేరీ పాల్‌ను చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీళ్లిద్దరినీ 2015 సంవత్సరంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కారణం మోసం చేయడమే. తనకు కేంద్రంలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, తాను తలచుకుంటే బెంగళూరు జైలు నుంచి శశికళను కూడా బయటకు రప్పించగలనని చెప్పుకొనేవాడట.

Advertisement
Advertisement