ములాయం కుటుంబంలో ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

ములాయం కుటుంబంలో ఏం జరిగింది?

Published Fri, Dec 30 2016 8:38 PM

ములాయం కుటుంబంలో ఏం జరిగింది?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ వివాదాలను మొదట్లో రాజకీయ డ్రామాగా ప్రత్యర్థులు విమర్శించారు. నిజానికి పార్టీలో, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవహారాలు కొన్ని ఇలాగే సాగాయి. అయితే ములాయం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు చివరకు ఎస్పీ చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ములాయం తన కన్నకొడుకు, యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించడంతో ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కొత్త సీఎంను ఎంపిక చేస్తామని ఆయన ప్రకటించారు. ములాయం ఇంట్లో విభేదాలకు కారణాలు చాలానే ఉన్నాయి.

( చదవండి : కొత్త సీఎంను నేనే ప్రకటిస్తా: ములాయం)

ఎస్పీలో ములాయం కుటుంబ సభ్యులదే కీలక పాత్ర. ఆయన కొడుకు అఖిలేష్‌ యూపీ సీఎం. తమ్ముడు శివపాల్‌ యాదవ్‌ యూపీ ఎస్పీ చీఫ్‌. సోదరుడి వరుసయ్యే రాంగోపాల్‌ యాదవ్‌ ఎంపీ. అఖిలేష్‌ భార్య డింపుల్‌ కూడా ఎంపీయే. వీరే గాక ములాయం ఇతర బంధువులు కూడా పార్టీలో ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్‌ రెండోభార్య సాధనకు తన కొడుకు ప్రతీక్ యాదవ్‌కు పట్టం కట్టాలన్నది ఆశ. వదిన సాధనకు మరిది శివపాల్ యాదవ్ మద్దతు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఆరు నెలల క్రితం అఖిలేష్‌, బాబాయ్‌ శివపాల్‌ మధ్య ఏర్పడ్డ విభేదాలు ఎన్నో మలుపులు తిరుగుతూ, ములాయం కొడుకును బహిష్కరించేదాకా వెళ్లాయి.

ఒకప్పటి గ్యాంగ్‌స్టర్, ప్రస్తుత రాజకీయ నాయకుడైన ముఖ్తార్ అన్సారీ నేతృత్వంలోని క్యూఈఎంను ఆరు నెలల క్రితం ఎస్పీలో విలీనం చేయడానికి శివపాల్‌ చొరవ తీసుకున్నారు. సర్వం సిద్ధమైన నేపథ్యంలో దీనికి పార్టీ హైకమాండ్ అడ్డుపుల్ల వేసింది. దీనివెనుకు అఖిలేష్ ఉన్నారని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి బాబాయ్‌, అబ్బాయ్‌ మధ్య చాలా వివాదాలు నడిచాయి. కుటుంబ సభ్యులు చెరో పక్షాన నిలిచారు. అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్‌ నిలవగా.. సాధన, శివపాల్‌, అమర్‌ సింగ్‌ మరో వర్గంగా ఉంటున్నారు. కుటుంబ పెద్ద ములాయం కూడా చివరకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖిలేష్కు సన్నిహితుడైన ఎమ్మెల్సీని పార్టీ నుంచి ములాయం బహిష్కరించగా, శివపాల్‌కు సన్నిహితులైన ఇద్దరు మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్‌కిశోర్ సింగ్‌లపై అఖిలేష్‌ వేటు వేశారు.

శివపాల్‌కు సన్నిహితుడుగా భావించిన యూపీ చీఫ్‌ సెక్రటరీ దీపక్ సింఘాల్‌ను పదవి నుంచి అఖిలేష్‌ తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ములాయం.. యూపీ ఎస్పీ చీఫ్‌గా ఉన్న కొడుకు అఖిలేష్‌ను తొలగించి, తమ్ముడు శివపాల్‌కు పట్టంకట్టారు. అఖిలేష్‌ ఏకంగా బాబాయ్‌ శివపాల్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ములాయం ఒత్తిడితో అఖిలేష్‌ మళ్లీ బాబాయ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అఖిలేష్‌.. ములాయం సన్నిహితుడు అమర్‌ సింగ్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు.

(చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?)

తమ కుటుంబంలో కలహాలకు అమర్‌ సింగే కారణమని ఆరోపించారు. అయితే ములాయం అమర్‌ సింగ్‌ను వెనుకేసుకొచ్చారు. తాజాగా టికెట్ల వ్యవహారం ములాయం కుటుంబంలో మరింత అగ్గి రాజేసింది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అఖిలేష్‌ సూచించిన వారికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన ములాయం తన సోదరుడు శివపాల్‌తో కలసి అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. అఖిలేష్‌ పోటీగా రెబెల్స్‌ జాబితాను ప్రకటించారు. దీంతో అఖిలేష్‌తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన సమీప బంధువు రాంగోపాల్‌ యాదవ్‌ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ పరిణామం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి..!

Advertisement

తప్పక చదవండి

Advertisement