ఆచితూచి అడుగులు

ఆచితూచి అడుగులు


- ‘సీఎం’ దిశగా డీఎంకే ఎత్తులు

- కలిసొస్తున్న అన్నాడీఎంకే కుమ్ములాటలు

- కుదిరితే అధికారం... లేదంటే ఎన్నికలు!




చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
పురచ్చి తలైవి జయలలిత మరణంతో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకే చీలికను ఉపయోగించుకునేందుకు డీఏంకే పావులు కదుపుతోంది.



ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఎదురైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతు ఇవ్వడం కంటే... రిసార్ట్స్‌లో ఉన్న కొందరిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా డీఏంకే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలంతా చెన్నైకి తరలి రావాలని సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా ముందుకు వెళ్లడం మంచిది కాదని భావించి అప్పటికప్పుడు సమావేశాన్ని వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం.



సీఎం పీఠమా.. ఎన్నికలా?

ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్‌ శిబిరంలో పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక చేసిన పళనిస్వామి శిబిరంలో 124 మంది ఎమ్మెల్యే ఉన్నారు. డీఏంకేకి 89తో పాటు మిత్రపక్షాలనుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్‌ ప్రకటించినా... పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదనేది డీఏంకే ముందున్న ప్రధాన లక్ష్యం. దీంతో కువత్తూరు రిసార్ట్స్‌ నుంచి తక్షణం 20 మంది ఎమ్మెల్యేలను తీసుకురాగలిగితే పన్నీర్‌కు మద్దతిచ్చి పళనిని నిరోధించాలని డీఎంకే భావిస్తోంది.



కనీసం పదిమందిని తీసుకురాగలిగితే పన్నీర్‌ వద్ద ఉన్న మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 118 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ సీనియర్లకు మంత్రి పదవులు ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డీఎంకే మద్దతుతో పన్నీర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్, కేంద్రం సుముఖంగా లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఏంకే పాచికలు ఫలిస్తే సీఎం పీఠం, లేదంటే ఆరు నెలల్లో ఎన్నికలు తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top