ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Published Fri, Sep 23 2016 11:20 AM

ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - Sakshi

ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టేను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు.

ఇది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారమని, కేసును జాప్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దశలో స్టే విధించడం సరికాదని ఆయన చెప్పారు. తాము సమర్పించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు సంతృప్తి చెందడం వల్లే ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణకు ఆదేశించిందని, దానిపై స్టేను తొలగించేలా చూడాలని కోరారు. అయితే.. కేసు విచారణపై హైకోర్టు 8 వారాల పాటుస్టే ఇచ్చిన నేపథ్యంలో కేసులో జోక్యం చేసుకోలేమని.. అయితే నాలుగు వారాల్లోగా కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపింది.

చంద్రబాబుకు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులు ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ అని ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి అన్నారు. స్టేలతో దర్యాప్తును ఆపాలని చంద్రబాబు చూశారని ఆయన అన్నారు. అయితే నాలుగు వారాల్లో ఓటుకు కోట్లు కేసును పరిష్కరించాలని సుప్రీం ఆదేశించిందని.. నాలుగు వారాలు దాటితే మళ్లీ తమ వద్దకు రావల్సిందిగా చెప్పిందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement