క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం

క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం - Sakshi


 ఇంద్రగంటి జానకీ బాల, ప్రముఖ రచయిత్రి - గాయకురాలు

 


ఏ సామాన్య గుణానికైనా కొన్ని మినహాయింపులుంటాయి. కళాకారులు - వారు గాయకులైనా, కవులైనా - వచన రచన చేసే రచయిత(త్రు)లైనా పరస్పరం అసహనం - కించిత్ ఈర్ష్య, స్పర్ధ కలిగి ఉంటారనేది లోకసహజంగా అనుకునే విషయం. ఈ లోకవాక్యానికి రజనీకాంతరావుగారు పూర్తిగా మినహాయింపు. రజనిగారు అనేక సాహిత్య ప్రక్రియల్లోనూ, రకరకాల సంగీత రీతులలోనూ నిష్ణాతులు. అయితే ఆయన పాటల గురించి, ప్రత్యేకంగా లలిత గీతాల గురించి ఇక్కడ మాట్లాడాలనిపిస్తోంది. ఆయన పాటరచన, దానికి ఆయన కూర్చే బాణీ చాలా విలక్షణంగా ఉంటాయి. ఒక ప్రత్యేకత గల లిరిసిస్ట్! అపారమైన సంగీతంతో మనసు నిండి ఉండడం వల్ల రాగం - భావం జంటగా ఒక పాటై బయటికి వచ్చి ఆయన గళంలో పలుకుతుంది. అది ఒక తిరుగులేని కళారూపమై అందర్నీ అలరిస్తుంది. ఆయన పాటలు చాలా సున్నితంగా, సులభశైలిలో ఉన్నట్లనిపిస్తాయి గానీ పాడి ఒప్పించటం కష్టంగానే అనిపిస్తాయి. అయినా రజని సినిమాల్లో చేసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి.



నాకు చిన్నప్పటి నుంచీ రజనీ గారి పాటలు వినడం, పాడడం అలవాటుంది. స్కూలు రోజుల్లో ‘మాదీ స్వతంత్ర దేశం...’, ‘ఇదె జోతా - నీకిదె జోతా...’, ‘పసిడి మెరుగుల తళతళలు...’ లాంటి పాటలు తరచూ పాడే సందర్భాలుండేవి. 1970లో ఆలిండియా రేడియో (విజయవాడ)లో లలిత సంగీతం పాడేందుకు ఆడిషన్ ప్యాసయ్యాను. అప్పటికి రజని విజయవాడ స్టేషన్ డైరక్టర్‌గా రాలేదు. రేడియోలో ‘గీతావళి’ కార్యక్రమం కోసం పాటలు ఎంపిక చేసుకోవాలంటే ఆయన పాటలు ఆకర్షణీయంగా ఉండేవి. ‘రజని’ పాటలుగా ఆయన గీతాలు రేడియోలో మారు మ్రోగుతూ ఉండేవి. సాలూరి రాజేశ్వరరావు పాడిన ‘ఓ విభావరీ...’ గ్రామ్‌ఫోన్ రికార్డు ఆనాటి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించింది. ఇందులో సమాసాలు, పదబంధాలు వినూత్నంగా ఉంటాయి. ‘‘ఓ విభావరీ - / నీ హార హీర నీలాంబర ధారిణీ/ మనోహా రిణీ - ఓ విభావరీ’’ అంటూంటే ఆ ఊహ మనకందని లోకాలలో విహరింప చేస్తుంది. దానికనుగుణంగా రాగం తీగెలు సాగుతుంది.



అలాగే ‘చల్లగాలిలో యమునా తటిపై, శ్యామ సుందరుని మురళీ...’. ఇదీ సాలూరి రాజేశ్వరరావు పాడిన పాటే. ఇందులో -  ‘‘తూలిరాలు వటపత్ర మ్ముల పయి/ తేలి తేలి పడు అడుగులవే/ పూల తీవ పొదరిండ్ల మాటగ / పొంచి చూడు శిఖి పింఛమదే -’’ అంటూ పాటలోనే బొమ్మకట్టి, కళ్ల ముందుంచి, అద్భుత దృశ్యాన్ని మనోఫలకంపై ముద్రిస్తారు. రజనీగారి పాటలో సాహిత్యం - సంగీతం చెట్టాపట్టాలేసుకుని నడిచే నర్తకీమణుల్లా మెరిసిపోతూంటాయి. శృంగారం, దేశభక్తి, ప్రకృతి, భక్తి - వేటికవే అందంగా పలుకుతాయి ఆయన లలిత గీతాల్లో. ‘‘హాయిగ పాడుదునా సఖీ -/ ఆకసమందున రాకా చంద్రుడు/ నా కౌగిలిలో నీ సౌందర్యము/ కాంచలేక నా మబ్బుల లోపల/ పొంచి చూసి సిగ్గున తలవంచగ - హాయిగ పాడుదునా!’’ ఇక, దేశభక్తి రజనీగారికి వెన్నతో పెట్టిన లక్షణం. దేశ స్వాతంత్య్రం ప్రకటించగానే పాట, ఆంధ్రరాష్ట్రం లభించగానే పాట, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాట - ఇలా అన్ని సందర్భాల లోనూ ఆయన పాటలు రాశారు.



‘‘పసిడి మెరుంగుల తళతళలు / పసిమి వెలుంగుల మిలమిలలు/ గౌతమి కృష్ణల గలగలలు/ గుడి జేగంటల గణగణలు -’’ అంటూ ఆ శుభ సమయాన్ని ఉత్తేజంగా ప్రకటిస్తారు. ‘‘మరునిముసము మనదో - కాదో/ మధువానవో - మధుపా మధుపా’’ అని మరొక్కసారి తాత్వికంగా అంటారు. ‘పోయిరావే కోయిలా’ అంటూ కోయిలకు వీడ్కోలు చెబుతారు. ఇలా చెప్పాలంటే రజనీ గారివి ఎన్ని భావాలు! ఎన్ని ఊహలు! ఎంత వేదన - ఎంత ఆవేదన! ఎంత ప్రేమ - ఎంత అభ్యుదయం - ఎంత సమ భావం! ఇవన్నీ కలిసి ‘రజని’, ఆయన పాటలూ!!



మళ్లీ మొదటికొస్తే, 1980లలో రజనీగారి పుట్టిన రోజు ఉత్సవంగా విజయవాడలో జరిగి నప్పుడు నేను ఆయన పాటలు రెండు పాడాను. ఆ రెండూ మా తమ్ముడు సూరి కుమారస్వామి ట్యూన్ చేశాడు. ఒకటి ‘నటన మాడవే మయూరి’. రెండోది ‘పోయి రావే కోయిలా.’ అవి విని రజని గారు బాగున్నాయని నన్ను అభినందించారు. నా లాంటి సామాన్య గాయకురాలు పాడిన పాటలు కూడా ఆనందంగా స్వీకరించి, బాగా పాడాననడం ఆయన హృదయ సంస్కారం.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top