మొదటి శుభలేఖ దుర్గమ్మ పాదాల చెంతే..! | vvs lakshman wife raghava sailaja chit chat with sakshi | Sakshi
Sakshi News home page

మొదటి శుభలేఖ దుర్గమ్మ పాదాల చెంతే..!

Jun 27 2017 2:03 PM | Updated on Sep 5 2017 2:36 PM

మొదటి శుభలేఖ దుర్గమ్మ పాదాల చెంతే..!

మొదటి శుభలేఖ దుర్గమ్మ పాదాల చెంతే..!

వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఇది యావత్‌ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికిట్‌ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచారు

►క్రికెటర్‌ వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ సహధర్మచారిణి రాఘవా శైలజ
►విజయవాడకు వస్తే భలే హ్యాపీ..!
►వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ అవార్డు వేడుకకు వచ్చి ‘సాక్షి’తో సంభాషణ


వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఇది యావత్‌ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికెట్‌ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచారు. కుదురైన ఆట.. చురుకైన శైలితో క్రికెట్‌ ప్రేమికుల ప్రశంసలు పొందారు. సోమవారం ఈ క్రీడా దిగ్గజం సహధర్మచారిణి రాఘవ శైలజ, కుమార్తె అచింత్య, కుమారుడు సర్వజిత్‌తో కలిసి విజయవాడ గ్రాండ్‌ మినర్వాలో వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ ‘ఎక్స్‌లెన్సీ’ అవార్డు అందుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సతీమణి రాఘవ శైలజ ‘సాక్షి’తో ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే...

నాకు ఆంధ్రప్రదేశ్‌ అంతా సుపరిచితమే. కడప, కర్నూలు, ఒంగోలు, విశాఖపట్టణం... అన్ని ప్రదేశాల్లో నేను చదువుకున్నాను. విజయవాడ నలందా కళాశాలలో ఇంటర్మీడియెట్, సిద్ధార్థ మహిళా కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ వరకూ చదివా. తర్వాత కాకినాడలో డిగ్రీ పూర్తి చేశా. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు అచింత్య, అబ్బాయి పేరు సర్వజిత్‌.

విజయవాడలో ఎన్నో జ్ఞాపకాలు..
విజయవాడ వస్తే నాకు భలే సంతోషంగా ఉంటుంది. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఏదో తెలియని అనుభూతి. నాతో కలిసి చదువుకున్న స్నేహితులను కలవడం లైఫ్‌లో కొత్త జోష్‌నిస్తుంది. నేను ఇక్కడ చదివే రోజుల్లో విజయవాడ టిక్కిల్‌ రోడ్డులో ఉండేవాళ్లం. మా ఇంటి దగ్గరలోనే ‘స్కూప్స్‌’ ఐస్‌క్రీమ్స్‌ షాప్‌ ఉండేది. తరచూ అక్కడికి వెళ్లే దాన్ని. ఇప్పుడు లేదు. ఇప్పుడు అలాంటి భవనాల్ని చూస్తుంటే భలే సరదగా అనిపిస్తోంది. అప్పట్లో అసలు షాపింగ్‌ మాల్స్‌ లేవు. ఇప్పుడు బాగా వచ్చేశాయి.

అప్పట్లో ఎగ్జిబిషన్‌కి కూడా తప్పకుండా వెళ్లేవాళ్లం. అదో రకమైన అనుభూతి. ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి గుహలకు  కూడా వెళ్లేవాళ్లం. అప్పుట్లో ఉండవల్లి గుహలు చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. చాలా చక్కగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడక అపహరణకు గురైంది. ఆ విషయం కూడా నాకు గుర్తుకు వస్తుంది. రెండేళ్ల క్రితం విజయవాడ వచ్చినప్పుడు అమరావతి చూశా. అక్కడ కూడా చాలా మార్పులు వచ్చాయి.

కనకదుర్గ అంటే భక్తి..
విజయవాడలో ఉన్న రోజుల్లో తరచూ కనకదుర్గ గుడికి వెళ్లేవాళ్లం. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారిని తప్పకుండా దర్శించుకునేవాళ్లం. కృష్ణా పుష్కరాలకు అమ్మతో కలిసి స్నానానికి వెళ్లడం అన్నీ గుర్తుకువస్తున్నాయి. మా అమ్మకు కనకదుర్గ అంటే ఎంతో భక్తి. మా పెళ్లి కుదిరాక మొట్టమొదటి శుభలేఖ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాకే తిరుపతి వెళ్లాం. అంత గురి మా అమ్మకి. ఇప్పటికీ ఎప్పుడు విజయవాడ వచ్చినా కనకదుర్గ అమ్మవారిని, లబ్బీపేట వెంకటేశ్వరస్వామిని, మంగళగిరి పానకాలస్వామిని తప్పకుండా దర్శిస్తా.

విజయవాడలో అడుగు పెడితే అన్నీ గుర్తుకువస్తాయి. విజయకృష్ణ సూపర్‌బజార్‌ బాగా గుర్తు. స్టేడియం పక్క నుంచి మొగల్‌రాజపురం వెళ్లే దారిలో అప్పట్లో మొట్టమొదటి మొబైల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ చూశా. అప్పట్లో లక్ష్మణ్‌ ఆ స్టేడియంలో ఆడేవారని ఆయన చెబుతుంటారు. విజయవాడ మధురస్మృతులను నెమరవేసుకుంటుంటే నాకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది.’ అని ముగించారు మిసెస్‌ లక్ష్మణ్‌ ఉరఫ్‌ రాఘవ శైలజ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement