బోయకొట్టములు పండ్రెండు


ఇప్పుడేం చదువుతున్నారు?

- కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లె

 ‘... ప్రభు పండరంగు బంచిన సామంత పదువతో బోయ కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి గొఱల్బియ త్రిభువనాంకుశ బాణ నిల్పి. కట్టెపు దుర్గంబు కడు బయల్సేసి కందుకుర్బెజవాడ గావించె మెచ్చి...’ ఇవి దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం... ఇంకా ఇప్పటి రూపం తీసుకోని చాళుక్య తెలుగు లిపిలో, గుండ్లకమ్మ నదీతీరాన అద్దంకి (అణ్దెక్కి) వేయి స్తంభాల ఆలయ పరిసరాల్లో లభించిన ఓ శిలా శాసనంలోని పద్యపాదాలు. ఎవరీ పండరంగడు? ఎక్కడివీ బోయకొట్టములు? ఈ ‘కట్టెపు దుర్గంబు’ కథాకమామిషు ఏమిటి?’ అందునా ఈ శాసనం పద్యరూపంలో ఉండటమేమిటి? ఆదికవిగా పిలవబడుతున్న నన్నయకు పూర్వం పద్యమెలా ఉండేది? దేశి కవిత ఏమిటి? తెలుగు మాతృభాష కాని ఓ మహరాజు తెలుగువారిని తెలుగు పద్య సృష్టికి ప్రేరేపించడమేమిటి?

 వీటన్నింటికీ అంగీకారయుక్తమైన జవాబులు చెప్పే రచన ‘బోయకొట్టములు పండ్రెండు’. History is a bunch of answers which are Hypothetical, to the questions posed about unknown past...

 

 ఆ శాసనం ద్వారా ‘పన్నెండు బోయకొట్టములను, పండరంగడనేవాడు యుద్ధంలో గెల్చి, నేలమట్టం చేసి, కందుకూరు బెజవాడల మల్లె చదును చేసేశాడు’ అని మాత్రమే తెలుస్తుంది. ఆ సదరు పండరంగడనేవాడు గర్వాతిశయంతో బోయకొట్టములు చదును చేసి పారేసినానని శాసనంలో చెక్కించాడంటే అదేదో గొప్ప యుద్ధమై ఉండవలె... ఆ కొట్టముల బోయలు బహు పరాక్రమవంతులై ఉండవలె... అయితే ఆ బోయలెక్కడివారు? ఈ శాసనం చెక్కించిన పండరంగడెవరు? అన్నవి అత్యంత సహజంగా తలెత్తే ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అంతే సహజంగా ఆ శాసనాన్ని చూసిన సుబ్రహ్మణ్యం పిళ్లెగారిలో తలెత్తాయి. జవాబులుగా దాదాపు 300 పేజీల నవల పుట్టుకొచ్చింది. ఆ ప్రశ్నల్లో ఒకటి సాహితీ సంబంధి. శాసనం ‘తరువోజ’ ఛందస్సులో ఉంది. కాలమా నన్నయకు పూర్వం... అంటే తెలుగు పద్యం నన్నయకు పూర్వమే ఊపిరి పోసుకుని, తరువోజ, సీసం, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కరల రూపంలో అస్తిత్వం కలిగుంది. దానికీ సమాధానాలు... దాదాపు సత్యానికి కొన్ని ఇంచీల దూరంలో ఉన్నట్టనిపించే కథనం ఇందులో.

 

 అంత బలవంతులైన బోయలెక్కడివారు? చాళుక్య, పల్లవ రాజుల యుద్ధాల మధ్య నలిగి అలసిన నల్లమల ప్రాంతపువారై త్రిపురాంతకం నించీ కందుకూరు, అద్దంకికి వలస వచ్చినవారు... వారికో నాయకుడు కావాలి గదా? యుద్ధాల మధ్య వికలాంగుడైన ఓ మధ్య వయస్కుడైన బోయ... వాడికో పేరు కట్టెం వీరబోయడు... వాడి భార్య మంగసాని... చాలు కథ మొదలైంది. కొన్ని తరాలు గడిచింది. ప్రేమలూ, ద్వేషాలూ, ఆప్యాయతలూ, రాజభక్తీ, శౌర్యం, రాజకీయపుటెత్తులూ, పగా, ప్రతీకారాలూ, యుద్ధాలూ, చిట్టచివరికి సర్వనాశనం...

 

 అద్భుత కథనం...

చరిత్రలో కేవలం ఒకే ఒక వాక్యంగా మిగిలిన తరాల కథ... చెక్ రచయిత మిలన్ కుందేరా ‘ఇమ్మార్టాలిటీ’ అన్న నవల ఒక స్త్రీ ఆంగికం... కేవలం ఒక్క శారీరక కదలికలోంచీ పుట్టుకొచ్చిన 350 పేజీల నవల... తెలుగు సాహిత్యంలో ఇంతటి సృజన కలిగిన వారి గురించి ఆలోచిస్తున్న సమయాన, ఓ శాసన వాక్యం నించీ ‘బోయ కొట్టములు పండ్రెండు’ నవల రచించిన కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లెగారు ఇదుగో నేనున్నానన్నారు. జయహో!

 - కాశీభట్ల వేణుగోపాల్

 ఫోన్: 9550079473

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top