కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసిన బాబు


పొత్తు వద్దన్నందుకు కక్షసాధింపు!

 

హైదరాబాద్: సొంతంగా ఎదగాలంటే టీడీపీతో పొత్తు అవసరం లేదంటూ చివరి వరకు అధిష్టానం వద్ద వాదించిన పాపానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబుకు టార్గెట్‌గా మారారు. చంద్రబాబు కక్ష సాధింపులో భాగంగా బీజేపీలోని సీనియర్ నాయకులను ప్రభావితంచేసి కిషన్‌రెడ్డిని ఏకాకిని చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల్లో ఉన్న గుర్తింపును ఓట్ల రూపంలో మార్చి తన పార్టీని బలోపేతం చేసుకోవాలనేది కిషన్‌రెడ్డి ఆలోచన. అన్ని జిల్లా శాఖల అధ్యక్షులు, అనుబంధ సంఘాల శ్రేణులు, వీటికి వెన్నుదన్నుగా నిలిచే ‘సంఘ్’ కూడా ఈ విషయంలో కిషన్‌రెడ్డి వెంటే నిలిచాయి. కానీ చంద్రబాబు ప్రోత్సాహంతో కొందరు బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణలో టీడీపీతో పొత్తు లేకుంటే సీట్లు గెలవటం కష్టమనే వాదనను వినిపించారు. కిషన్‌రెడ్డి చెప్పినట్లు చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని సమాచారం ఇచ్చారు.



ఇప్పుడు చంద్రబాబు వారితో కలసి కిషన్‌రెడ్డిని ఏకాకిని చేస్తున్నారని సమాచారం. పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దత్తాత్రేయ, ముషీరాబాద్ అభ్యర్థి లక్ష్మణ్ ప్రచార కార్యాలయాల ప్రారంభోత్సవానికి హాజరైన సీనియర్ నేత వెంకయ్యనాయుడు అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి కార్యాలయం ప్రారంభానికి రాకపోవడం బాబు కుట్రలో భాగమేనంటున్నారు. దత్తాత్రేయ ప్రచార రధాలపై శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చిత్రాలు లేకపోగా చంద్రబాబు బొమ్మలు ఉండటం గమనార్హం. మూడు రోజుల కిందట పార్టీ సీనియర్ నేత హర్షవర్ధన్ సైతం కిషన్‌రెడ్డి కార్యక్రమానికి డుమ్మాకొట్టారు. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా చివరివరకు కిషన్‌రెడ్డి పేరే ఉన్నప్పటికీ, జాబితా ప్రకటించేరోజు రాత్రి ఆ స్థానంలో దత్తాత్రేయ పేరు ప్రత్యక్షమైంది. మరోవైపు అంబర్‌పేట నియోజకవర్గంలో కిషన్‌రెడ్డిని ఓడించేందుకు కూడా కొన్ని శక్తులు తెరవెనక పావులు కదుపుతున్నట్టు ఆయన సన్నిహితులు అనుమానిస్తున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top