పార్లమెంట్‌లో టపాసులు పేలతాయనుకున్నా..

పార్లమెంట్‌లో టపాసులు పేలతాయనుకున్నా..


న్యూఢిల్లీ: ‘రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. గిట్టుబాటుధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలో ఇన్ని సమస్యలతొ కొట్టుమిట్టాడుతుండగా వీటిలో కనీసం ఒకదానిగురించైనా నేటి బడ్జెట్‌లో మాట్లాడారా?’అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. బడ్జెట్‌ ప్రసంగం పూర్తైన తర్వాత పార్లమెంట్‌ వెలుపల రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు కీలకమైన సమస్యలను గాలికొదిలేసి, చలోక్తులు, చతురులతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విమర్శించారు.



‘ప్రధాని మోదీ, ఆయన కేబినెట్‌ సహచరులు కొంతకాలంగా మాట్లాడిన మాటలు వింటే, బడ్జెట్‌ లో అద్భుతాలు ఉంటాయని, పార్లమెంట్‌లోనే టపాసులు పేలతాయని అనుకున్నాం. కానీ పేలని బాంబులాగా తుస్సుమనిపించారు. మోదీ గొప్పగా చెప్పుకున్న బుల్లెట్‌ రైళ్ల ప్రస్తావన బడ్జెట్‌లో రానేలేదు. రైతాంగ సమస్యలకు పరిష్కారాలు చూపలేదు’అని రాహుల్‌ అన్నారు.


తమ పథకాలతో నిరుద్యోగ సమస్య తీరుదుందని గొప్పలు చెప్పుకున్న మోదీ సర్కారు.. గత ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందని, ఇందుకు ప్రధాని సిగ్గుపడాలని రాహుల్‌ విమర్శించారు.


రక్షణ రంగం ఊసేది?: రేణుకా చౌదరి
కీలకమైన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలేవీ బడ్జెట్‌లో పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు మించిన విరాళాలు ఇకపై డిజిటల్‌ రూపంలో జరగాలన్న బడ్జెట్‌ ప్రతిపాదనపైనా ఆమె మాట్లాడారు. ‘యూపీ ఎన్నికల్లో వాళ్లెలా పోరాడతారు? డొనేషన్లను చెక్కుల రూపంలో తీసుకుంటారా? లేక డిజిటల్‌ రూపంలో తీసుకుంటారా? అని వ్యగ్యధోరణిలో విమర్శించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top