ఉత్కంఠపై చైనా ఎలా స్పందిస్తోంది? | ​how China reaction over US-Korea war plans | Sakshi
Sakshi News home page

ఉత్కంఠపై చైనా ఎలా స్పందిస్తోంది?

Apr 12 2017 9:03 PM | Updated on Aug 24 2018 8:39 PM

ఉత్కంఠపై చైనా ఎలా స్పందిస్తోంది? - Sakshi

ఉత్కంఠపై చైనా ఎలా స్పందిస్తోంది?

ఉత్తర కొరియా దుందుడుకుగా ఏదైనా దాడులకు పాల్పడితే.. అది ముందు చైనాకు వాణిజ్యపరంగా నష్టం కలిగిస్తుంది. అంటే....

ఉత్తర కొరియాతో చైనాకు ప్రభావవంతమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలున్నాయి. దీంతో.. చైనా తన మిత్రదేశమైన ఉత్తర కొరియాను అదుపు చేయడంలో విఫలమైతే అమెరికా ఏకపక్షంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమని డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. ‘ఉత్తర కొరియాను చైనా పరిష్కరించకపోతే.. మేం పరిష్కరిస్తాం’ అని ఆయన ఇటీవల ఒక పత్రికతో వ్యాఖ్యానించారు.

అయితే.. కొరియాను సైనిక చర్యల పేరుతో హెచ్చరించడం, అణ్వస్త్రాల మోహరింపు, యుద్ధనౌకల తరలింపు వంటి చర్యలు ఆ దేశాన్ని కవ్వించడమేనని.. అలా చేయడమంటే కొరివితో తల గోక్కున్నట్లేనని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. తన ఉనికే ప్రమాదంలో పడేటట్లయితే ఉత్తర కొరియా ఎటువంటి భీకర చర్యలకైనా వెనుకాడకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. చైనా కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఉత్తర కొరియా, చైనాలు చాలా కాలంపాటు సైద్ధాంతికంగా సన్నిహిత దేశాలు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి చైనా ప్రాధాన్యతలు దక్షిణ కొరియా వైపు మొగ్గాయి. గత దశాబ్ద కాలంగా దక్షిణ కొరియా ప్రధాన వాణిజ్య భాగస్వామి చైనాయే కావడం ఇందుకు నిదర్శనం. ఉత్తర కొరియా దుందుడుకుగా ఏదైనా దాడులకు పాల్పడితే.. అది ముందు చైనాకు వాణిజ్యపరంగా నష్టం కలిగిస్తుంది. అంటే.. కొరియా ద్వీపకల్పంలో ఎటువంటి సంక్షోభం తలెత్తినా ముందు చైనా నష్టపోతుంది. కాబట్టి.. ఉత్తర కొరియాను కట్టడి చేయడానికే చైనా ప్రయత్నిస్తుందన్నది అంతర్జాతీయ పరిశీలకుల అంచనా.
 

(ఉత్తర కొరియా అంటే అమెరికాకు ఎందుకంత భయం?)

మరోవైపు ఉత్తర కొరియా విషయంలో అమెరికా కఠినవైఖరి చైనాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా గత వారంలో సిరియాలోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేయడం.. ఆ వెంటనే ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ కఠిన స్వరం వినిపించడం.. కీలకమైన హెచ్చరికగా పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తర కొరియాపై అమెరికా ముందస్తు దాడికి దిగే అవకాశం ఉందని చైనా కూడా భావిస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సైన్యాన్ని సంసిద్ధం చేస్తోంది. ఉత్తర కొరియా సరిహద్దులో లక్షన్నర మంది సైనికులను మోహరించింది. ముఖ్యంగా అమెరికా దాడులు చేపడితే ఉత్తర కొరియా నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు తరలివస్తారని భావిస్తోంది.

మరోవైపు.. దౌత్యపరంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకూ ప్రయత్నిస్తోంది. కొరియా ద్వీపకల్పంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం కావాలని షి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఈ అంశంపై చర్చించారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితం కావాలన్న లక్ష్యానికి చైనా కట్టుబడి ఉందని షి ఉద్ఘాటించారు. చైనా దౌత్యవేత్త ఒకరు దక్షిణ కొరియా చేరుకుని ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరిపారు. అదే సమయంలో ఉత్తర కొరియాకు పరోక్ష హెచ్చరికలు కూడా పంపిస్తోంది. ఈశాన్య చైనాకు ఉత్తర కొరియా అణు కార్యక్రమం ప్రమాదకరంగా పరిణమిస్తోందని.. ఆ దేశం గీత దాటిదే చైనా సైన్యం ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టి, ఆ దేశంలోని అణు కేంద్రాలను ధ్వంసం చేయాల్సి వస్తుందని చైనా అధికారిక వార్తా పత్రిక 'గ్లోబల్ టైమ్స్' తాజా సంపాదకీయంలో హెచ్చరించడం గమనార్హం.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement