‘‘అయితే పోదామా నువ్వూ నేనూ’’ అని పిలిచిన కవితకు నూరేళ్లు


‘‘అయితే పోదామా నువ్వూ నేనూ, మత్తిచ్చిన రోగిలా సంజ నింగిలో పరచుకున్నప్పుడు’’ అని పిలిచిన కవిత పిలుపునకు నూరేళ్లు. ‘‘ద లవ్ సాంగ్ ఆఫ్ జె.ఆల్ఫ్రెడ్ పృఫ్రాక్’’ అంటూ వచన కవిత్వానికి అభివ్యక్తి మంత్రనగరి తలుపులు తీసిన 1915 నాటి కవితకు ఈ నెల శతాబ్ద సందర్భం. కవి టి.ఎస్.ఎలియట్. జూన్ 1915లో ‘పొయెట్రీ’  సాహిత్య పత్రిక ఈ ప్రేమరహిత ప్రేమ గీతికను అచ్చువేసింది. కవి అనామకుడు. అచ్చు కావడం వెనకాల తన మరో కవి సహచరుడు ఎజ్రా పౌండ్ జోక్యం ఉన్నది. తరువాత వచ్చిన సమీక్షలు ఈ కవితను పెద్దగా పట్టించుకోలేదు. పౌండ్ మాత్రం, ఇది ఈ శతాబ్దంలో నిలబడిపోయే కవిత అన్నాడు, శిఖరాయమాన కవితలకు ఆదిలో ఈ చిన్నచూపు తప్పదేమో! ఇంకో 18 ఏళ్ల తరువాత యువకవి శ్రీరంగం శ్రీనివాసరావు విశాఖపట్నంలోని టర్నరు వారి సత్రంలో కూచుని కేవలం కొద్ది నిమిషాలలో రాసి పంపిన ఒక గీతాన్ని ‘భారతి’ పత్రిక తిప్పి పంపింది. ఆ గీతమే మహాప్రస్థానం. ఒక శతాబ్ద సంగీతానికి ఆవాహన గీతం.

 

 కానీ ఇవాళ ఈ ‘పృఫ్రాక్ ప్రేమ గీతం’ ఆధునిక సాహిత్యోద్యమానికి ఆదిగీతంగా ప్రపంచమంతా సంభావిస్తున్న సంరభ సందర్భం. ఇందులో మొదలైన నిరాశ, అనిశ్చయ మనస్థితి, ఇరవయ్యో శతాబ్దాన్ని ఒక ఊపు ఊపాయి. చైతన్య స్రవంతి ధోరణుల బీజాలు ఈ కవితలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలలోని పాత్రల మానసిక దశలకు ఆది చిత్రణ ఈ కవితలో దర్శనమిస్తుంది.

 

 ప్రపంచంలోని సాహిత్య కళా, మానవ వికాస రంగాలు (ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్) ఈ రచనను పలు రూపాలలో వ్యాఖ్యానిస్తున్నాయి. ‘‘నా జీవితాన్ని కాఫీ స్పూన్‌లతో కొలుచుకున్నాను’’ అన్నది ఈ కవితలో ఒక ప్రఖ్యాత వాక్యం. దానికి ఒక ఆధునిక చిత్రకారిణి వేసిన గమ్మత్తయిన కాఫీ కప్పు ఎలియట్ బొమ్మ, ఈ తరాల పిల్లలు ఎలా ఎలియట్ కవిత్వాన్ని చదువుతున్నారో తెలియజేస్తున్నది.

 కారా మాస్టారు తెలిపినట్టు చక్కని కళారూపాలనదగ్గ ఇతివృత్తాలతో శ్రేష్టమైన కథలు మూడు వేలకు పైగా తెలుగులో ఉన్నాయన్న మాటలను చెవిన పెడదాము. వెయ్యేళ్ల కవిత్వ సంప్రదాయం లేని ఆంగ్లభాష సాధిస్తున్న సాంకేతిక ప్రగతితో పోల్చుకుని, మన భారతీయ రచయితలకు, ముఖ్యంగా తెలుగు రచయితలలో దిగ్దంతులకు విశ్వ పాఠక/ ప్రేక్షక రాజ్య పట్టాభిషేకం ఎలా చేయగలమో ఆలోచిద్దాము.



‘‘వర్తమాన కవిత్వమంటే ఏమిటో తెలుసా వరదా, అది భూత భవితవ్యాల మధ్య ట్రాన్స్‌పరెంట్ పరదా’’, (కవిత్వానికే కాదు వచనానికీ ఇది వర్తిస్తుంది), ‘‘చూశావా ఆరుద్రా ఒక తమాషా, సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా’’ అన్న శ్రీశ్రీ, ఆరుద్ర, అబ్బూరి వరద రాజేశ్వరరావుల చింతన ‘సాహిత్యోపనిషత్’లో నమోదై ఉంటే, ఇదే భావాల సారాన్ని అంతకన్నా ముందరే పాశ్చాత్య సాహిత్యంలో ధ్వనించిన ప్రపంచ ఆధునిక కవిత్యోద్యమ సారథి ఎలియట్. వారి ‘ప్రేమ గీతానికి’ నూరేళ్లయితే, వారి స్మృతికి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. అలా కూడా మనం ఎలియట్‌ను, శ్రీశ్రీని, రెండు యుద్ధాల మధ్య కాలపు కవులుగా, వారి దేశ, కాల, చైతన్య పరిధుల మేరకు అధ్యయనం చేసేందుకు ఒక అపూర్వ అవకాశం ఇది. అందుకే పిలుస్తున్నది ఎలియట్ కవిత. ఈ కృషి శిఖరాల అధిరోహణకు, ‘‘పోదామా అయితే నువ్వూ నేనూ!’’

 - రామతీర్థ, 9849200385

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top