అఖిలేశ్‌ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?

అఖిలేశ్‌ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా? - Sakshi


లక్నో: సమాజ్‌వాదీ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన అఖిలేశ్‌ యాదవ్‌.. ఎన్నికల పొత్తులపై దృష్టిసారించారు. దూకుడుమీదున్న బీజేపీని, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో దూసుకుపోతున్న బీఎస్పీని గట్టిగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం ఇతర ముఖ్యపార్టీలతో పొత్తు తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గడిచిన కొద్ది రోజులుగా రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నట్లే.. అఖిలేశ్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైంది.



ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తిరిగి వచ్చీరాగానే.. ఎస్పీ చీఫ్‌ హోదాలో అఖిలేశ్‌ ఢిల్లీకి పయనం అవుతారని, జనవరి 9న జరగబోయే భేటీలో పొత్తు ఖరారు కానుందని, ఆ వెంటనే ఇరు నేతలూ ప్రకటన విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌తోపాటు ఆర్‌ఎల్‌డీతోనూ ఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ మేరకు పరిణామాలేవీ చోటుచేసుకోలేదు.



ఇప్పటికి లభించిన సమాచారం ప్రకారం.. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్‌ పార్టీ 90 నుంచి 105 స్థానాల్లో పోటీ చేయనుంది. కొన్ని రోజుల కిందట అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ముఖ్య నాయకురాలు ప్రియాంకా గాంధీల మధ్య జరిగిన రహస్య భేటీలోనే పొత్తు ఖాయమైపోయిందని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనేది మాత్రం రాహుల్‌- అఖిలేశ్‌లు నిర్ణయించుకోనున్నారని తెలిసింది.



టార్గెట్‌ 300

సంప్రదాయ దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు తప్పక ఉత్తమ ఫలితాన్నిస్తుందని మొదటి నుంచీ నమ్ముతోన్న అఖిలేశ్‌.. ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తద్వారా బీఎస్పీని, బీజేపీని ఒకేసారి దెబ్బకొట్టొచ్చన్నది ఆయన వ్యూహం. కాంగ్రెస్‌తో జతకడితే కనీసం 300 స్థానాల్లో విజయం ఖాయమని అఖిలేశ్‌ నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూడ్‌ విడుదలైన నేపథ్యంలో ఎంత త్వరగా పొత్తులు ఖరారుచేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తే అంతమంచిదని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, జనవరి 9న జరగబోయే రాహుల్‌- అఖిలేశ్‌ భేటీలో ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని తెలిసింది. (చదవండి: ములాయం-అఖిలేష్‌ వివాదంలో మరో ట్విస్ట్‌)



మాయ ‘ముస్లిం’ మంత్రం

అభ్యర్థులను ప్రకటించే విషయంలో మిగతా పార్టీల కంటే ముందంజలో ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) శుక్రవారం ఉదయం 100 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాతో కలిపి బీఎస్పీ ఇప్పటి వరకు 200 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, మొత్తం 403 స్థానాలకుగానూ బీఎస్పీ ఈసారి ఏకంగా 97స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టనుంది. ముజఫర్‌నగర్‌ అల్లర్లు, అసహన పరిస్థితులు, దాద్రీ ఘటన.. తదితర సంఘటనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యక్తమైన వ్యతిరేకతను మాయావతి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారని, అందుకే పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top